-

ఇండో – పసిఫిక్‌ చౌరస్తా!

14 Feb, 2021 00:47 IST|Sakshi

జనతంత్రం

లద్దాఖ్‌లోని సోయగాల ప్యాంగ్యాంగ్‌ సో సరస్సు పక్కనుంచి వెళ్లిపోతున్న చైనా సైనికులు, వెనక్కు తిరిగిన యుద్ధ ట్యాంకుల దృశ్యం భారత ప్రజలను ఆనందింపజేసి ఉంటుంది. గురువారం నాడు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన గొప్ప ఊరట కలిగించి ఉంటుంది. అరవయ్యేళ్ల కిందట చైనా తీసిన దొంగ దెబ్బ ఫలితంగా కుదేలైన ఇండియా వేలమైళ్ల వైశాల్యం గల భూభాగాన్ని కోల్పోయింది. ఆ గాయం ఇంకా కెలుకుతూనే ఉంది. అందుకే, గత సంవత్సరం జరిగిన ఘర్షణలో మన జవాన్లు చూపిన తెగువ, వీరోచిత ప్రతిఘటన భారతీయ మనస్సుల్ని రంజింపజేసింది. ఆరోజు తర్వాత చైనా సైనికులు పురోగమించలేదు కానీ, అక్కడే తిష్టవేశారు. ప్రతి ష్టంభన కొనసాగింది. సైనికాధికారుల స్థాయిలో అనేకరౌండ్ల చర్చలు జరిగాయి. పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌ చేసిన ప్రకటన ప్రకారం మన భూభాగం మనకే ఉంది. ఇంచు కూడా వదల్లేదు. అయినా చర్చలు ఫలప్రదమయ్యాయి. చైనా సైనికులు వెనక్కు వెళ్లిపోతారు. ప్రకటనకు తగ్గట్టుగానే మీడియాలో తిరోగమనం ఫొటోలు కన్పించాయి. రక్షణమంత్రి చెప్పిన మాటలే అక్షర సత్యాలైతే సంతోషించని భారతీయులెవరుంటారు? అమందా నంద కందళిత హృదయారవిందులమైతిమి ప్రభూ... ధన్యోస్మి! కాకపోతే ప్రతిపక్షం మాత్రం రాజ్‌నాథ్‌ ప్రకటనపై నిష్ఠూరా లాడింది. మన భూభాగాన్ని కొంత చైనాకు దఖలుపరిచి ఒప్పం దాన్ని కుదుర్చుకున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రతి పక్షం అన్న తర్వాత ఆరోపణలు చేయకుండా ఉంటుందా? నిజానిజాలు నిగ్గుతేలేంతవరకు ప్రభుత్వం చెప్పినమాటే విశ్వ సించి సంతోషించడం విధాయకం.

ఉత్తర సరిహద్దు ఘర్షణకు సంబంధించిన సమస్యను ఇలా మనం ‘విజయవంతంగా’ పరిష్కరించుకోవడానికి సరిగ్గా పది రోజుల ముందు ఈశాన్య సరిహద్దులకు ఆవల ఒక ఆసక్తిక రమైన పరిణామం జరిగింది. యాభయ్యేళ్ల సైనిక పాలన తర్వాత మయన్మార్‌లో ఏర్పడిన పరిమిత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్టుమని పదేళ్లయినా నిండకముందే మళ్లీ కూలిపోయింది. జన వరిలో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూచీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డీ పార్టీ అఖండ విజయం సాధించింది. ఫిబ్రవరి ఒకటో తేదీన నూతన పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావాలి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సరిగ్గా ఒక్క రోజు ముందు మయన్మార్‌ అధికారాన్ని సైన్యం హస్తగతం చేసు కుంది. సూచీతోపాటు అధికార పార్టీ ప్రముఖులను నిర్బం ధంలో ఉంచింది. జనాభాపరంగా ప్రపంచంలో రెండు అతిపెద్ద దేశాలైన ఇండియా – చైనాలకు మయన్మార్‌ సరిహద్దు దేశం. వాయవ్య దిశన 1,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును ఇండియాతో, ఈశాన్య దిక్కున వెయ్యి కిలోమీటర్ల సరిహద్దును చైనాతో మయన్మార్‌ పంచుకుంటుంది. పొరుగు దేశంలో జరిగిన ఈ ‘అనూహ్య’ పరిణామం భారత్, చైనాలపై ఏమైనా ప్రభావం చూపుతుందా? పరిణామం వెనుక చైనా హస్తం ఉండే అవకాశం ఉందా? ఉన్నట్లయితే, లద్దాఖ్‌ చర్చలకూ, మయన్మార్‌ తిరుగు బాటుకు మధ్యన కనిపించని లింకేదైనా ఉన్నదా? ఇత్యాది ప్రశ్నలు ఈ సందర్భంలో తలెత్తడం సహజం.

కాలం ఒకేవిధంగా ఉండదు. మలుపులు తిరగడం చరిత్ర సహజగుణం. ఒక్కో చారిత్రక విభాత సంధ్యలో ఒక్కో ప్రాంతపు వికాస కథ అంకురించడం మొదలవుతుంది. చరిత్ర కందిన మానవ కథను చాలాకాలంపాటు మధ్యధరా (మెడిట రేనియన్‌) తీరప్రాంతం శాసించింది. పర్షియన్, గ్రీకు, రోమన్, బైజాంటైన్‌ సామ్రాజ్యాలన్నీ ఈ ప్రాంతం కేంద్రంగా విస్తరించి నవే. మధ్యధరా యుగం తర్వాత ఆధునిక ప్రపంచ చరిత్రకు మూడు దశాబ్దాలపాటు సారథ్యం చేసిన ప్రాంతం ట్రాన్సట్లాం టిక్‌. అట్లాంటిక్‌ తీర ప్రాంతాలు (ముఖ్యంగా అమెరికా, ఐరోపా) దాదాపుగా గ్లోబ్‌ మొత్తాన్ని తమ ప్రభావంలోకి ప్రత్య క్షంగానో, పరోక్షంగానో తెచ్చుకోగలిగాయి. చరిత్ర కొత్త సహస్రాబ్ది (మిలీనియం)లోకి ప్రవేశించిన తరుణంలో తాను మరో మలుపు తీసుకుంటున్న సంకేతాలను వదిలింది. ఈ సంకేతాల ప్రకారం 21వ శతాబ్దం నుంచి ప్రపంచానికి నాయ కత్వం వహించే అవకాశం ఇండో–పసిఫిక్‌ ప్రాంతానికి దక్క నుందన్న అంచనాలు వెలువడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే సముద్ర మార్గ వాణిజ్యంలో మూడింట రెండొంతుల భాగం ఈ ప్రాంతంగుండానే సాగుతున్నది. మానవ వనరులకు, ఖనిజ సంపదకు, సముద్ర గర్భ నిక్షేపాలకు ఈ ప్రాంతం ఒక అక్షయ పాత్ర. ఆఫ్రికా తూర్పుతీరం నుంచి అమెరికా పశ్చిమ తీరం వరకు విస్తరించిన ఇండో–పసిఫిక్‌ రీజియన్‌లో ప్రధాన పాత్ర ధారులు: ఇండియా, చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా. ఇందులో అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు ప్రధానంగా పసిఫిక్‌ తీర దేశాలు. ఇండియా మాత్రమే హిందూ మహా సముద్ర (ఇండియన్‌ ఓషన్‌) తీరదేశం. ఆస్ట్రేలియా పశ్చిమ తీరం మాత్రమే ఈ విభాగంలోకి వస్తుంది. తన పేరు మీద ఒక మహాసముద్రాన్నే కలిగి వున్న దేశం ఇండియా ఒక్కటే. ఈ సువిశాల ప్రాంత చరిత్రలో, వాణిజ్యంలో ఇండియా పోషించిన ఆధిపత్య పాత్రకు లభించిన గుర్తింపు అది. హిందూ మహాసముద్ర తీరదేశాల్లో భారతీయ బౌద్ధం తలుపు తట్టని దేశం లేదు. మన రామాయణం ప్రవేశించని భాష లేదు.

ఇప్పుడు రెండు మహాసముద్రాలను కలిపి ఇండో– పసి ఫిక్‌గా పిలుచుకుంటున్న ప్రాంతంలో ఆధిపత్య పోరు ప్రధా నంగా అమెరికా–చైనాల మధ్య నెలకొంటున్నది. ఈ రెండు దేశాల మధ్యన మరో ప్రచ్ఛన్న యుద్ధం (cold war) ప్రారం భమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో మన ముందున్న ప్రత్యామ్నాయాలు రెండు. ఒకటి: చైనా వెనకాలో, అమెరికా వెనకాలో నంబర్‌ టూగా చేరిపోవడం. రెండు: మన గత వైభవానికి తగ్గట్టుగా ఇండియన్‌ ఓషన్‌ తీర దేశాలను, ముఖ్యంగా సార్క్, ఏసియాన్‌ కూటముల సభ్య దేశాలను వాటి వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణ ప్రాతిపదిక మీద సమీకరించి నాయకత్వం వహించడం. ప్రస్తుతానికైతే మనం అమెరికా వెనకాల చేరిపోతున్నట్టుగా పొరుగు దేశాలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే ఇరాన్‌ మన మిత్ర కూటమి నుంచి జారిపోయింది. చైనాకు చేరువైంది. రానున్న చరిత్రను ఇండో–పసిఫిక్‌ ప్రాంత వాణిజ్యం లిఖించబోతున్న పరిస్థితుల్లో కనీసం, హిందూ మహాసముద్ర ప్రాంతం వరకైనా ఇండియా ఒక గౌరవప్రదమైన పాత్ర పోషించడం అవసరం. ఈ నేప థ్యంలో మన పొరుగు దేశం, హిందూ మహాసముద్ర తీర దేశమైన మయన్మార్‌లో వచ్చిన రాజకీయ మార్పు వెనుక కారణాలపై ఇండియా దృష్టిపెట్టకుండా ఉండడం సాధ్యంకాదు.

భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరం ఢిల్లీ. దేశ వాణిజ్య నగరంగా పేరొందిన నగరం ముంబై. ప్రపంచ పటంపై ఈ రెండు నగరాలకు దాదాపుగా సెంటర్‌పాయింట్‌ నుంచి ఒక సరళరేఖను తూర్పుదిశగా గీస్తే అది మయన్మార్‌ మీదుగా వెళ్లి చైనాలో షాంఘై, హాంకాంగ్‌ల మధ్య నుంచి తీరం దాటుతుంది. ఢిల్లీకి దాదాపుగా అభిముఖంగా ఉండే షాంఘై చైనాలో అతిపెద్ద నగరం. రెండు నగరాల జనాభా కూడా మూడుకోట్లకు చేరు కుంటున్నది. ముంబైకి అభిముఖంగా ఉండే హాంకాంగ్‌ నగరం ప్రత్యేక హోదా అనుభవిస్తున్న వాణిజ్య నగరం. అంటే జనా భాకు జనాభా, వాణిజ్యానికి వాణిజ్యం ఎదురెదురుగా నిలబ డ్డాయన్నమాట. మనం గీసిన ఈ సరళరేఖ భూగోళంపై వుండే కర్కాటక రేఖ (Tropic cancer)కు కొద్ది దూరంలో సమాం తరంగా ఉంటుంది. ఈ రేఖ మీదుగానే సూర్యుడు తన దక్షిణ పథ ప్రయాణాన్ని (దక్షిణాయనం) ప్రారంభిస్తాడు. మన సమాంతరరేఖ మధ్యభాగంలో ఉన్న మయన్మార్‌ నుంచే భారత్‌  –చైనాల ఆధిపత్యయాత్ర మొదలవుతుందేమో చూడాలి. 

చైనా రేవు పట్టణాలన్నీ పసిఫిక్‌ మహాసముద్రంలో భాగం. అక్కడ బయల్దేరిన ఓడలు హిందూ మహాసముద్రం గుండా ప్రయాణించాలంటే దక్షిణ దిశలో బయల్దేరి ఇండో–చైనా ద్వీప కల్పాన్నీ మలయా ద్వీపకల్పాన్ని చుట్టుకుంటూ రెండువేల ఏడువందల నాటికల్‌ మైళ్లు ప్రయాణించి మలక్కా జలసంధిని దాటుకుంటూ అండ మాన్‌ సముద్రం ద్వారా ప్రవేశించాలి. ఈ దూరభారాన్ని తగ్గించుకోవడానికి మయన్మార్‌ తీరంలో ఒక రేవు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆ దేశంతో చైనా లోగడనే ఒప్పందం చేసుకున్నది. బంగాళాఖాతం తీరంలో వున్న క్యాప్యూలో ఈ పోర్టు ఏర్పాటవుతుంది. ఒప్పందం ప్రకారం ఈ పోర్టులో 85 శాతం వాటా చైనాకే ఉంటుంది. నామ్‌కేవాస్తే 15 శాతం మాత్రమే మయన్మార్‌ వాటా. ఇది ఏమాత్రం ప్రయోజనం కాదనీ, ఒప్పందాన్ని పునస్సమీక్షించి కనీసం 35 శాతమైనా మయన్మార్‌ తీసుకోవాలనే ప్రతిపాదన ఆంగ్‌సాన్‌ సూచీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వచ్చింది. ఈ ప్రతిపాదన చేసిన వ్యక్తి ఆ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన శాన్‌ టర్నెల్‌. ఆస్ట్రేలియా దేశస్తుడు. ఎన్నికల విజయం తర్వాత రెండోసారి ఏర్పడే ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. ఇంతలోనే సైనిక తిరుగుబాటు జరిగింది. సలహా ఇచ్చిన టర్నెల్‌ను కూడా జైల్లో పెట్టారు. క్యాప్యూ రేవు నుంచి భారతతీరంలోని విశాఖ, కలకత్తా పట్టణాలు కూతవేటు దూరంలో ఉంటాయి. మయన్మార్‌లో హఠాత్తుగా సైనిక తిరుగు బాటు ఎందుకు జరిగిందో కొంతమేరకైనా ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మనం చైనాతో అరివీరభయంకరంగా చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఆపరేషన్‌ మయన్మార్‌ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. ఇప్పుడు పసిఫిక్‌ దేశమైనా చైనా భూమార్గం ద్వారా దర్జాగా ప్రయాణించి క్యాప్యూ తీరం ద్వారా ఇండియన్‌ ఓషన్‌లోకి ప్రవేశించవచ్చు. ఇప్పుడు మయన్మార్‌ ఒక ఇండో – పసిఫిక్‌ చౌరస్తా.

ఇండియా – మయన్మార్, చైనా – మయన్మార్‌ల మధ్య బలీ యమైన చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలున్నాయి. ఇండియా, చైనా, టిబెట్‌ల నుంచి మూడు గిరిజన తెగలు బర్మా (మయన్మార్‌)లో ప్రవేశించాయనీ, వాటి మిశ్రమ తెగే అక్కడ మొదటి రాజ్యాన్ని ఏర్పాటు చేసిందని చరిత్రకారులు చెబు తారు. బుద్ధుడు జీవించి ఉన్నకాలంలోనే బౌద్ధం బర్మాకు చేరిందనే వాదన ఉంది. తర్వాత భారతీయ సంస్కృతీ సంప్ర దాయాలు, రామాయణం కూడా ప్రవేశించాయి. బ్రిటిష్‌ వాళ్లు ఆక్రమించుకున్న తర్వాత బర్మా బ్రిటిష్‌ ఇండియాకు అను బంధంగా మారిపోయింది. ఈకాలంలో భారత ప్రజలకు బర్మాతో సంబంధాలు బాగా పెరిగాయి. ఉపాధికోసం వ్యాపారం కోసం లక్షలమంది భారతీయులు బర్మాకు వలస పోయారు. ‘రంగమెళ్లి పోదామే నారాయణమ్మో... రంగూను పురము చూద్దామే నారాయణమ్మో’ అనే తెలుగు గ్రామ్‌ఫోన్‌ రికార్డు ఈ రంగూన్‌ వలసలకు ఒక సాక్ష్యం. చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి, మొట్టమొదటి భారత స్వాతంత్య్ర సమరయోధుడైన బహదూర్‌షా జాఫర్‌కు ఆయన అంత్యదశలో బ్రిటిష్‌ ప్రభుత్వం బర్మా ప్రవాస శిక్ష విధించింది. కవి, దేశభక్తుడు, సున్నిత మనస్కుడైన ఆ చక్రవర్తి మాతృదేశంలో తనను సమాధి చేయడానికి రెండు గజాల స్థలమైనా దొరకని అభాగ్యుడి నయ్యానంటూ రాసిన చివరి గజల్‌ సమాధి మీద రాసుకునే నివాళిగా మిగిలిపోయింది. స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన బాలగంగాధర తిలక్‌ బర్మాలోని మాండలే చెరసాలలో ఉన్న ప్పుడే ‘గీతా రహస్యం’ అనే గ్రంథాన్ని రచించారు. ఆంగ్‌సాన్‌ సూచీ విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే జరిగింది.

సైనిక పాలనపై భారత్‌ ఆచితూచి స్పందించింది. అమెరికా మాదిరిగా తీవ్రంగా వ్యవహరించలేదు. 1960లో తొలిసారి సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఇండియా గట్టిగా డిమాండ్‌ చేసింది. ఫలితంగా భౌగోళిక రాజకీయాల్లో కీలకమైన మయన్మార్‌ చాలాకాలం మనకు దూర మైంది. పి.వి. నరసింహారావు ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత మయన్మార్‌ పట్ల భారత వైఖరిలో మార్పు వచ్చింది. ‘లుక్‌ ఈస్ట్‌’ పాలసీతో మయన్మార్‌కు భారత్‌ చేరువైంది. మయన్మార్‌తో వాణిజ్యం చేస్తున్న దేశాల్లో ఇండియాది నాలుగో స్థానం. మయన్మార్‌ చేసుకుంటున్న వస్తు పరికరాల దిగుమతిలో థాయ్‌లాండ్‌ తర్వాత రెండోస్థానం ఇండియాదే. ఉత్తర సరి హద్దుల్లో గిరిజన తిరుగుబాట్లను అణచివేయడంలో మయ న్మార్‌కు భారత్‌ సహాయపడింది. మయన్మార్‌ సైనిక నాయకత్వం కూడా గత మూడు దశాబ్దా లుగా భారత్‌తో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నది. అంత ర్జాతీయ వేదికలపై అమెరికా, పశ్చిమ దేశాలు సైనిక నాయకత్వంపై ఆంక్షలకు, అభిశంసనలకు దిగినప్పుడు చైనా మద్దతు మయన్మార్‌కు అవసరమవుతుంది. ఈ సున్నిత వ్యవహారంలో భారతదేశానికి ప్రాప్తకాలజ్ఞత అవసరం. ఇండో–పసిఫిక్‌ చౌరస్తాలో భారత స్నేహ పతాకం కూడా ఎగురు తూనే ఉండాలి.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు