దీపనిర్వాణ గంధం

18 Jul, 2021 00:27 IST|Sakshi

జనతంత్రం

‘‘పోగాలము దాపురించినవారు దీపనిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని కనలేరు. మిత్ర వాక్యమును వినలేరు’’ అని పెద్దలు చెబుతారు. ఒక వ్యక్తి కాల ధర్మం చెందడానికి కొంతకాలం ముందునుంచే చూపు మంద గిస్తుంది కనుక అరుంధతీ నక్షత్రాన్ని చూడలేడు. వినికిడి శక్తిని కోల్పోతారు కనుక మిత్ర వాక్యమును వినలేడు. నాసికా పటిమ కూడా తగ్గుతుంది కాబట్టి దీపం ఆరిపోయేటప్పటి వాసనను పసిగట్టలేడు. ప్రతి మనిషీ జీవిత చరమాంకంలో ఈ పరిణా మాలకు లోనుకావడం సహజం. కానీ ఆ వయసు రాకముందే ఉద్దేశపూర్వకంగా నిజానిజాలను కనడానికి, హితోక్తులను విన డానికి నిరాకరించే వారికి సైతం పోగాలము దాపురిస్తుందని కూడా అర్థం తీసుకోవాలి. ఈ హితవచనం వ్యక్తులకే కాదు వ్యవస్థలక్కూడా వర్తిస్తుంది.

చిన్నయసూరి ‘పంచతంత్రం’లోని పైవాక్య సారాంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నిద్ర పట్టనీయడం లేదు. వారి నాసికలకు దీప నిర్వాణ గంధం సోకుతున్నది. పార్టీ ఎక్కువకాలం బతికే అవకాశం లేదన్న అభిప్రాయం కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల స్థాయి వరకు బలపడుతున్నది. ఆమధ్య తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో వైరల్‌ అయింది. ‘పార్టీ లేదు... బొక్కా లేద’ంటూ నిస్పృహతో ఆయన మాట్లాడారు. ఇప్పుడయితే ఆ పార్టీలో అడుగుకో అచ్చెన్న. ఈమధ్యనే ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూడా జగన్‌మోహన్‌రెడ్డి గారి పార్టీయే గెలుస్తుందని జోస్యం చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన ఓ గుంటూరు నాయకుడు తన సన్నిహితులతో ఈమధ్య తన ఆవేదన పంచుకున్నారట. ‘ఈ పార్టీ పని అయిపోయినట్టే. కరోనా కాలం ముగిసేంతవరకు విశ్రాంతి తీసుకుందాం. ఆ తరువాత ఎంట్రీ దొరికితే వైసీపీ, లేకపోతే బీజేపీ. ఇదే మన తక్షణ కర్తవ్యమ’న్నట్టుగా చెప్పుకొచ్చారట. తాజాగా ఉత్తరాంధ్ర పార్టీ నాయకురాలు శోభా హైమవతి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తెలుగు మహిళ ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ బాటలో ఇంకా చాలామందే ఉన్నారు గానీ ఫిరాయింపులకు వైసీపీ గేట్లు తెరవకపోవడం వల్లనే ఆగిపోయారనే అభిప్రాయం వుంది.

ఈమధ్య కృష్ణా నదీ జలాల వినియోగంపై తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ నేతల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పొరుగు రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య వివాదాలుండేవి. ఇప్పుడు కృష్ణానదే సరిహద్దుగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలంలో ‘తలాపునే పారుతోంది గోదావరి’ అని పాడే వారు... అయినా ఆ నీళ్లు తమ గొంతు తడపడం లేదనే అర్థంలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు గోదావరి జలాలు తెలంగాణ అంతటా గలగలా పారుతున్నాయి. కృష్ణా బేసిన్‌ను సైతం చీల్చుకుంటూ వెళ్లి బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. చీలిక తర్వాత కొత్త రాష్ట్రంలోని అత్యధిక భౌగోళిక ప్రాంతానికి ‘తలాపునే పారుతోంది కృష్ణానది’. ఆ నీళ్లు తమ గొంతు తడపాలనీ, పెన్నా బేసిన్‌ను సైతం చీల్చుకుంటూ వెళ్లి బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలనే సెంటిమెంట్‌ రేకెత్తడం సహజం. హేతుబద్ధమైన పరిష్కారంతో రెండు రాష్ట్రాల వివాదాలకు చెక్‌ పెట్టడం అసాధ్యమేమీ కాదు. ఇక్కడ ఆలోచించవలసినది తెలుగుదేశం పార్టీకి దాపురించిన పోగాలం గురించే. నదీజలాల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఒక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఒక్క తాటిపైకి రావడాన్ని మనం ఇంతకాలంగా చూస్తూ వచ్చాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని తామూ వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు శాసనసభ్యులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. దీనిపై సదరు ఎమ్మెల్యేల సన్నిహితులు, పార్టీ నాయకులూ వారిని నిలదీశారట. ‘మాకే పాపం తెలియదు, రాయించి పంపిన లేఖపై మాచేత బల వంతంగా సంతకాలు పెట్టించా’రని ఎమ్మెల్యేలు వాపోయారట. ఆత్మహత్యా సదృశ్యమైన ఈ ‘బ్రిలియంట్‌ ఐడియా’ ఎవరిదని ఆరా తీసినప్పుడు వినిపించిన పేరు చినబాబు.

ఇప్పుడా చినబాబే తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారి కూర్చున్నారు. ఆ పార్టీ సీనియర్‌ నాయక శ్రేణుల్లో దాదాపుగా అందరూ లోకేశ్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రెండు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించడమే గాక, అపరిమితమైన అధికారాన్ని చలాయించి, అధికార యంత్రాంగాన్ని కనుసైగలతో శాసించి, రాజధాని ప్రాంతంలో ఏరికోరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని కూడా ఓటమిపాలు కావడాన్ని నాయకులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఇంతటి అసమర్థ నాయకుడిని నెత్తిన పెట్టుకొని వైసీపీతో ఎట్లా పోరాడగలమని వారు సరాసరి అధినేతనే ప్రశ్నిస్తున్నారట. అధినేత మాత్రం తన వారసుడికే పార్టీ పగ్గాలను సైతం అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఆయన కలలు ఫలించి మొన్నటి ఎన్నికల్లో గెలిచి వుంటే ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేశ్‌బాబు చేతిలో పెట్టి ఉండేవారట. ఓటమి వల్ల పెద్ద గండం నుంచి గట్టెక్కామన్న భావన సీనియర్‌ నేతల మాటల్లో ధ్వనిస్తున్నది.

సీనియర్లకు బాబు మనసు తెలుసు గనుకనే ఇటీవల జరుగుతున్న సభల్లో కొంతమంది చేత జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారు. లోకేశ్‌ నాయకత్వంపై తమ నిరసనను కొందరు నేతలు ఆరకంగా వ్యక్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఈ పరిణామాలన్నీ ముదరక ముందే లోకేశ్‌కు మరింత క్రియాశీలక పాత్రను అప్పగించాలని బాబుపై ఒత్తిడి పెరుగుతున్నది. చంద్రబాబు తెరచాటుకే పరిమితమై లోకేశ్‌ను తెరముందు నిలబెట్టాలని ఆయన తరఫు లాబీయిస్టుల ప్రతి పాదన. ఇటువంటి ఆలోచనల్ని సీనియర్‌ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వారిని సంతృప్తిపరచడానికి కీలక నిర్ణయాలన్నీ ఇకమీదట తానే తీసుకుంటానని బాబు వారికి మాటిచ్చారట.

దాదాపు ఇదే సమయంలో లోకేశ్‌బాబు తన సతీమణితో కలిసి వేరే ఇంట్లోకి మారిపోయారట. జూబ్లీహిల్స్‌లోని తమ పాత నివాసగృహం స్థానంలో కొత్తది మరింత విస్తరించి, చినబాబు అభిరుచి మేరకు ఐదారేళ్ల కిందనే విలాసవంతంగా నిర్మించారు. తల్లిదండ్రులతో కలిసి లోకేశ్‌ దంపతులు అక్కడే ఉండేవారు. ఇప్పుడాయన కొండాపూర్‌లో ఆరేడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్‌హౌస్‌లోకి మారిపోయారట. ఐటీ హబ్‌కు కేంద్రస్థానంగా ఉన్న కొండాపూర్‌ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ స్థలాన్ని లోకేశ్‌కు ఆయన నాయనమ్మ కీర్తిశేషులు అమ్మణ్ణమ్మ గారు బహూకరించారట. తన రెండెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆర్జించిన ఆదాయంతోనే అమ్మణ్ణమ్మ గారు మనవడికి ఇంత పెద్ద బహుమతిని ఇవ్వడం విశేషమే. ఇప్పుడు లోకేశ్‌ దంపతులు అక్కడే ఉంటున్నారని టీడీపీ శ్రేణుల ద్వారా తెలుస్తున్న సమాచారం. కొడుకూ - కోడలూ తల్లిదండ్రుల దగ్గరే ఉండాలనీ, వేరే కాపురం పెట్టగూడదనీ రూలేమీ లేదు. అది తప్పుపట్ట వలసిన విషయం కూడా కాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఇది కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీనియర్ల మాటకు చంద్రబాబు కొంత మేరకైనా చెవి ఒగ్గడం చినబాబుకు నచ్చలేదని ప్రచారం జరుగు తున్నది. కొత్త ఇంట్లో కొంతకాలంపాటు ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించినట్టు కనిపించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క బర్త్‌డే సందర్భంగా ట్విట్టర్‌ వేదికపై లోకేశ్‌ ఆమెను అభినందించారు. ‘‘నిరంతరం ప్రజాసమస్యలపై గొంతెత్తుతూ, ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ సాయం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న సీతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఇంకా మరికొన్ని ప్రశంసలను ఆయన కురిపించారు. ఎవరికైనా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే గతంలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా ఇన్ని ప్రశంసలతో కూడిన ట్వీట్‌ను లోకేశ్‌ చేశారా లేదా అన్నదే సందేహం.

నాయకత్వ సమస్యతోపాటు మనుగడ సమస్య కూడా తెలుగుదేశం పార్టీకి సవాల్‌ విసురుతున్నది. ఇప్పుడు ఆ పార్టీ రంగు, రుచి, వాసన కోల్పోయింది. అంటే పార్టీని మృత్యుకళ ఆవహించింది. తెలుగుదేశం పార్టీ ఆశయాలేమిటి? లక్ష్యాలే మిటి? ఐడియాలజీ ఏమిటి? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సహస్రాబ్ది ఆరంభం నుంచీ సంక్షేమ ఎజెండాకు ప్రాధాన్యత పెరిగింది. దేశంలో, రాష్ట్రాల్లో అధికారం లోకి వచ్చిన ప్రతి పార్టీ తరతమ భేదాలతో సంక్షేమ కార్య క్రమాలను అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఐడియాలజీ అనేది కొంత సంక్లిష్టంగా మారినప్ప టికీ, ఆయా పార్టీల దీర్ఘకాలిక వ్యూహాలు, లక్ష్యాలను బట్టి, వివిధ అంశాలపై వాటి విధానాలను బట్టి ఆయా పార్టీల సైద్ధాంతికతను అంచనా వేయవచ్చు. కాంగ్రెస్‌ పార్టీది పద మూడు దశాబ్దాల చరిత్ర. చారిత్రక సందర్భాలను బట్టి దాని లక్ష్యాలు మారుతూ వచ్చాయి. లాహోర్‌ కాంగ్రెస్‌లో ‘పూర్ణ స్వరాజ్‌’, ఆవడి సభలో సోషలిస్టు తరహా సమాజం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్కరణలు... ఇలా ఎన్ని మార్పులకు లోనైనా ఆ పార్టీ ప్రవాహంలో అంతర్వాహినిగా దాని లౌకిక స్వభావం కొనసాగుతూనే వచ్చింది. భారతీయ జనతా పార్టీ తెరిచిన పుస్తకం. హిందూ సమాజ ఔన్నత్యమే లక్ష్యమైన పునా దులపై నిర్మితమైన కన్జర్వేటివ్‌ డెమోక్రటిక్‌ పార్టీ అది. సోషలిస్టు సమాజ స్థాపనే కమ్యూనిస్టు పార్టీల ఆశయం. ద్రవిడ సంస్కృతీ సమాజ ఔన్నత్యాలే డీఎంకేల సిద్ధాంతం. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్‌కు సమగ్రాభివృద్ధితో కూడిన బంగారు తెలంగాణ లక్ష్యం. అన్నివర్గాల సంక్షేమం, బలహీనవర్గాలు - మహిళల సాధికారత, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అనే అంశాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫోకస్‌ కనిపిస్తున్నది. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఏమని చెప్పాలి? ఏమీ చెప్పలేని స్థితికి చంద్ర బాబు నాయకత్వంలో ఆ పార్టీ దిగజారింది. ఒక రాజకీయ పార్టీ స్వభావాన్ని ఆ పార్టీ కోల్పోయింది.

ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు దాని జెండా తెలుగుజాతి ఆత్మగౌరవం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఎజెండా జన సంక్షేమం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధానం తలకిందులైంది. అదే సమయంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బలపడుతున్న కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ, క్రోనీ క్యాపిటలిజానికి విత్తనాలు చల్లుతూ ఆయన కాలం గడిపారు. సంక్షేమం అటకెక్కింది. రాజకీయాల్లోకి ధన ప్రభావాన్ని జొప్పించి, నీతిమంతులను దూరం పెట్టారు. ఒకరకమైన దళారీ రాజకీయ వ్యవస్థను సృష్టించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మరింత సంకుచితంగా ఆయన మారిపోయారు. తానూ, తన కుటుంబం, తాను పోషించిన బినామీ కోటరి ప్రయోజనాలే పరమావధిగా ఐదేళ్లూ పాలించారు. ‘కోటరీకి కరెన్సీ - ప్రజలకు గ్రాఫిక్స్‌’గా గడిచాయా రోజులు. ఇందులో ఆశయాలనూ, సిద్ధాంతాలను ఎక్కడ వెదకాలి! మేనిఫెస్టోను అమలుచేయలేదు కనుక దానిని విశ్లేషించలేము. చివరి రోజుల్లో ఓట్ల కొను గోలుకు అధికారికంగా డబ్బులు పంచారు కనుక సంక్షేమంగా చెప్పలేము. అందుకే ఆ పార్టీ రంగూ, రుచీ, వాసన కోల్పోయింది. రాజకీయ పార్టీ లక్షణాలు మరుగునపడి ఒక సమూహంగా మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడది దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించే స్థితిలో లేదు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేకపోతున్నది. మిత్ర వాక్యమును వినలేకున్నది. మన పూర్వీకులు చెప్పినట్టు పోగాలము దాపురించిన లక్షణాలు గోచరించుచున్నవి.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు