Photosynthesis : (ఛాయాచిత్రం చెప్పిన కథ) 

30 May, 2021 00:28 IST|Sakshi

పచ్చని ఆకు మీద ఆన. దాని పత్రహరితం మీద ఒట్టు.Photosynthesis అనే కిరణజన్య సంయోగక్రియ నడుచుకుంటూ వెళ్లే దృశ్యాన్ని నా కంటితో నేను తిలకించాను. నేను ఒక్కడినే కాదు. ఆంధ్ర దేశంలో ఒక కోటిమంది అబ్బురంగా చూసి ఉండవచ్చు. చూడనివాళ్లుంటే పై ఫొటోలో చూడవచ్చు. శ్రమజీవన సౌందర్యం సహజంగా, ప్రస్ఫుటంగా ఉట్టిపడే ఈ చిత్రం కెమెరా కంటికి చిక్కిన ‘సోషల్‌ ఫొటోసింథెసిస్‌’.

చెట్టు కొమ్మలూ, వాటి రెమ్మల్లోని ప్రతి ఆకూ ప్రకృతి నుంచి సూర్యకాంతినీ, గాలినీ, నీటినీ గ్రహిస్తాయి. వాటి సమ్మేళనం ఆకు అంతరంగంలో కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తుంది. ఫలితంగా పచ్చనాకు నిస్వనంలోంచి మానవా ళికి ప్రాణాధారమైన ప్రాణవాయువు పుడుతుంది. ప్రాణవాయువుకు తోబుట్టువుగా జనించే పిండి పదార్థాన్ని చెట్టు స్వీకరిస్తుంది. బదులుగా తన వంటి నిండా పువ్వుల్ని, కాయల్ని, పండ్లని ధరిస్తుంది. ఈ అలంకరణ తనకోసం కాదు. లోక కల్యాణం కోసం. పరోపకారార్థం ఇదం శరీరం అన్న సుభాషితానికి నిలువెత్తు చిరునామా పచ్చని చెట్టు.

అడుగు తీసి అడుగువేసే వైశాల్యంలో ప్రసరించే వెయ్యి వాట్ల సూర్యకాంతిలో ప్రకాశిస్తూ, నలభై ఐదు డిగ్రీల మహోగ్ర ఉష్ణంలో కాలిపోతూ, ఉరుములు– మెరుపుల సాయుధ వర్షంలో ప్రవహిస్తూ కోటీ ఇరవై లక్షల అడుగుల దూరాన్ని కాలినడకతో కొలిచిన సుదీర్ఘ ‘కిరణజన్య సంయోగక్రియ’కు దృశ్యరూపం ఈ ఛాయాచిత్రం. ఎంత సుదీర్ఘమంటే... శేషాచలం, నల్లమల అడవులు, తూరుపు కొండల అరణ్యాలు ఉమ్మడిగా స్వీకరించినంత సూర్యకాంతిని ఒకేఒక్క యాజ్ఞి కుడు స్వీకరించినంతకాలం. వర్షంలో ఆ అడవులు తడిసినంతకాలం. అంత కాంతినీ, నీటినీ, గాలినీ స్వీకరించిన ఒకేఒక్క ‘శక్తి’లో జరిగే ఫోటోసింథెసిస్‌ ఫలితం ఎట్లా ఉంటుంది? ఆంధ్రదేశంలో నివసించే ప్రజలకు సరిపోయేంత ప్రాణవాయువును, పువ్వుల్నీ, కాయల్నీ, పండ్లనీ సమకూర్చే విధంగా ఉంటుంది. పరోపకారార్థం ఇదం జీవితం అన్నది ఈ పచ్చనయ్య ఇచ్చిన సందేశం.
సుమారు పన్నెండేళ్ల కిందట నిండు జనసభలో ఇచ్చిన ఒకే ఒక్క మాట. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే పరమధర్మమనే విశ్వాసం. అందుకోసం పడిన ఆరాటం. అదొక పోరాటంగా మారుతున్నా మడమ తిప్పని ధీశక్తి. విశ్వసనీయతను నిలబెట్టుకునే దారిలో ఎదురుగా అధికారమనే ఎవరెస్టు. అధిగమించే బాటలో ఎన్నో అగాధాలూ, ప్రమాదకరమైన లోయలు... తొమ్మిదేళ్లపాటు కష్టాల కొలి మిలో కాల్చిన తర్వాత తనను తాను సానబెట్టుకున్న కోహినూర్‌ వజ్రం పాద యాత్రగా బయల్దేరింది. ఆ యాత్ర ఒక చరిత్ర. అడుగడుగునా కష్టజీవుల వెతలను ఆ యాత్రికుడు కథలు కథలుగా విన్నాడు. ఆ కథలకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాజకీయం లేదు.

ఏటేటా రైతెందుకు ఓడిపోతున్నాడో అర్థం చేసుకున్నాడు. అధికార పీఠం పైనున్నవారు ఏ సాయమందిస్తే పేదవర్గాల ఆత్మగౌరవం ఇనుమడిస్తుందో, ఆర్థిక వృద్ధికి అడుగులు పడతాయో అవగతమైంది. ఆకాశంలో అర్ధరాజ్యాన్ని అక్క చెల్లెమ్మలు పరిపాలించాలంటే ఏ విధాన నిర్ణయాలు తీసుకోవాలన్న అంశంపై మస్తిష్కంలో మథనం జరిగింది. అవ్వాతాతల మోముల్లో నిరంతరం నవ్వుల్ని ఎట్లా పూయించాలని తపనపడ్డాడు. ఆబాలగోపాలాన్ని హృదయానికి హత్తు కుంటూ, దారిపొడుగునా వారి గుండె సవ్వడులతో సంభాషిస్తూ వెళ్లిన ప్రజా నాయకునికి జనం జైకొట్టారు. చరిత్రాత్మక విజయాన్ని కానుకగా ఇచ్చారు.

విలువలతో కూడిన సరికొత్త తరం రాజకీయాలకు శ్రీకారం చుడుతూ ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు. దేశచరిత్రలో ఏ రాజకీయ నాయకునికి లేనంత విస్తృత జనసంపర్క అనుభవం అక్కరకొచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంటింటి గడప దాకా ప్రసరించింది. విద్య–వైద్యరంగాల్లో విప్లవశకం మొదలైంది. రైతుకు భరోసా ఏర్పడింది. అక్కచెల్లెమ్మల ఐక్య సంఘాలు కళకళలాడుతున్నాయి. అవ్వాతాతలను పలకరించడమంటే ఇప్పుడు బోసి నవ్వు లతో కరచాలనం చేయడమే.


అధికారంలోకి రాగానే కొంతకాలం ఆర్థిక మందగమనం అడ్డుతగిలింది. దాని వెనువెంటనే తరుముకుంటూ వచ్చిన కోవిడ్‌ మహమ్మారి గత 15 నెలలుగా తిష్టవేసి సవాళ్లు విసురుతున్నది. వీటిని మించి ప్రతిపక్షం ప్రయోగించిన ఎల్లో మహమ్మారి. గోబెల్స్‌ టు ది పవర్‌ ఆఫ్‌ థౌజండ్‌ గిగాబైట్ల సామర్థ్యంతో ఎల్లో మీడియా దుష్ప్రచార యుద్ధాన్ని ప్రారంభించింది. ఆధిపత్య వర్గాల దన్నుతో వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది. ప్రజా ప్రభుత్వం మీద వాటిని గురిపెడు తున్నది. ఇడుములెన్ని ఎదురవుతున్నా సరే, సంకల్ప పథం నుంచి ఈ రెండేళ్లలో ప్రభుత్వం పక్కకు జరగలేదు. ‘బారు ఫిరంగులు మోగినా... బాంబుల వర్షం కురిసినా, ఎత్తిన జెండా దించమోయ్‌’ అనే మార్చింగ్‌ సాంగ్‌ స్ఫూర్తితో సాగి పోతున్నది. అందుకే రెండేళ్ల పాలనకు జనం స్థానిక ఎన్నికల్లో తిరుగులేని మద్దతును ప్రకటించారు. ఆంధ్రరాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక పరివర్తన చరిత్రలో పైనున్న చిత్తరువు ఒక మేలిమలుపునకు గుర్తుగా నిలబడిపోతుంది.
 – మురళి

మరిన్ని వార్తలు