తాలిబాన్‌ – 2.0

22 Aug, 2021 02:27 IST|Sakshi

జనతంత్రం

ఆసియా ఖండానికి అఫ్గానిస్తాన్‌ ఒక పెద్ద జంక్షన్‌ వంటిది. ఈ దేశానికి సముద్రతీరం లేదు. చుట్టూ భూభాగమే. ఉత్తర దిక్కున ఉన్న ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, తజకిస్తాన్‌లు సెంట్రల్‌ ఆసియా దేశాలు. ఐరోపా ఖండానికి ప్రవేశ ద్వారాలు. ఈశాన్య భాగాన చైనాతోనూ ఓ యాభై కిలోమీటర్ల సరిహద్దు బంధం ఈ దేశానికి ఉన్నది. చైనాకు పక్కలో బల్లెంలా మారిన విగర్‌ ముస్లిం తీవ్రవాదుల సొంత రాష్ట్రం షింజియాంగ్‌ అఫ్గానిస్తాన్‌కు చైనా సరిహద్దు. షింజియాంగ్, టిబెట్‌లను దాటితే తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాన్ని తాకవచ్చు. పడమటి సరిహద్దు ఇరాన్‌ గుండా ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్‌ దేశాలను చేరుకోవచ్చు. పర్షియన్‌ గల్ఫ్‌ దాటితే చేరువలోనే అరేబియా ద్వీపకల్పం. తూర్పు నుంచి దక్షిణ సరిహద్దు వరకు విస్తరించిన పాకిస్తాన్‌ భూభాగం ద్వారా ఇండియా సహా దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాలు దగ్గర అవుతాయి.

ప్రపంచంలో అతిఎత్తయిన నాలుగు పర్వత శ్రేణుల్లో మూడు అఫ్గాన్‌ భూభాగాన్ని తాకుతాయి. మరొకటి కూతవేటు దూరంలో ఉండే హిమాలయ పర్వతశ్రేణి. పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న గిల్గిట్‌–బాల్టిస్తాన్‌ కూడా తూర్పు అఫ్గాన్‌కు సరిహద్దు ప్రాంతమే. భారత అధికారిక మ్యాప్‌ ప్రకారం మన దేశానికి కూడా అది సరిహద్దే. హిమాలయ శ్రేణులు ఇక్కడ ప్రారంభమై టిబెట్‌–భారత్‌ సరిహద్దుగా తూర్పువైపునకు వ్యాపించాయి. కారాకోరం శ్రేణులు అఫ్గాన్‌కు ఈశాన్యంలో తజకిస్తాన్‌ సరిహద్దుల్లో ప్రారంభమవుతాయి. హిందూకుష్‌ పర్వతాలు ఈ దేశాన్ని ఉత్తర – దక్షిణాలుగా విడదీస్తే పామిర్‌ కనుమలు ఉత్తర సరిహద్దుగా ఆవరించి ఉన్నాయి. చరిత్ర ప్రసిద్ధమైన చైనా సిల్క్‌ రోడ్డు ఈ కనుమల నుంచే ఐరోపాను కలుపుతుంది.

ఆసియా జంక్షన్‌ మాత్రమే కాదు... అపారమైన సహజ నిక్షేపాలకు అఫ్గానిస్తాన్‌ ఆలవాలం కూడా! పర్వత ప్రాంతం కావడం వల్ల ప్రజలు సహజంగానే దృఢకాయులు, స్వతంత్ర పిపాసులు. అనేక గిరిజన తెగల నిలయం ఈ దేశం. ఈ తెగలు వేటికవే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఈ తెగల కామన్‌ ఎజెండా – ఇస్లామ్‌ ఒక్కటే. పదికి పైగా ప్రధాన తెగలున్నాయి. వీటిలో సగం మంగోల్, సెంట్రల్‌ ఏసియా తెగలు. ప్రధానమైన తెగ పష్తూన్‌. దేశ జనాభాలో వీరి సంఖ్య 42 శాతం. ఈ తెగ ప్రజలు ప్రధానంగా దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో పాక్‌ సరిహద్దు భూభాగంలో ఉంటారు. వాయవ్య పాకిస్తాన్‌ పఠాన్‌లదీ, వీరిదీ ఒకే జాతి. తాలిబాన్‌ పుట్టింది ఈ తెగ నుంచే!

కాబూల్‌ మళ్లీ తాలిబాన్ల వశమైందన్న వార్త వెలువడిన తర్వాత వారికి వ్యతిరేకంగా తుపాకులుపేల్చిన రాష్ట్రం పంజ్‌షీర్‌. ఈ ప్రజలది తజిక్‌ తెగ. పంజ్‌షీర్‌ అంటే ఐదు సింహాలని అర్థమట. (ఈ మాటలో పాంచ్, షేర్‌ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి). ఈ ఐదు సింహాల లోయ... సింహం లాంటి ఒక యోధుడికి కూడా జన్మనిచ్చింది. అతని పేరు అహ్మద్‌షా మసూద్‌. ఇంజనీరింగ్‌ చదివిన మసూద్‌ సోవియట్‌ యూనియన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టాడు. సోవియట్‌ సైన్యాన్ని గడగడలాడించిన గెరిల్లా కమాండర్‌గా పేరుపొందాడు. సోవియట్‌ ఉపసంహరణ అనంతరం ఏర్పడిన ముజాహిదీన్ల ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేశాడు. 1996లో కాబూల్‌ తాలిబాన్ల వశమైన తర్వాత వారి ఛాందస మత వైఖరితో మసూద్‌ విభేదించాడు. తాలిబాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టాడు. సెంట్రల్‌ ఏసియా తెగలను సమీకరించి, నార్తెర్న్‌ అలయెన్స్‌ను స్థాపించాడు. తాలిబాన్ల కాలంలో పదిశాతం అఫ్గాన్‌ భూభాగాన్ని మసూద్‌ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తాలిబాన్ల తోబుట్టువైన అల్‌ఖాయిదా కుట్రపూరితంగా ఆత్మాహుతి దళాలను ప్రయోగించి మసూద్‌ను చంపించింది. మసూద్‌ హత్య జరిగిన రెండు రోజులకే న్యూయార్క్‌పై సెప్టెంబర్‌ 11 దాడి జరిగింది. ఫలితంగా ‘నాటో’ సేనలు రంగప్రవేశం చేసి, మసూద్‌ సైన్యం సహకారంతోనే తాలిబాన్లను తరిమివేశాయి.

ఇప్పుడు మళ్లీ పంజ్‌షీర్‌ లోయ నుంచే తాలిబాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు గంటలు మోగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగవలసిందే. ఇంకా తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్పడలేదు. అధ్యక్షుడు ఎవరవుతారో  స్పష్టత రాలేదు. ముల్లా ఉమర్‌తో కలిసి తాలిబాన్‌ను స్థాపించిన వారిలో ఒకడైన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరు ప్రముఖంగా వినబడుతున్నది. శనివారం నాడే ఆయన కాబూల్‌కు చేరుకున్నారు. వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు ప్రారంభించారు. తాలిబాన్లు, జీహాదీలకే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతి పక్షాలను కలుపుకొని ఒక విశాల వేదికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో బరాదర్‌ ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. పష్తూన్‌ పెత్తనం కాకుండా అన్ని తెగల మధ్య సమభావం సాధించే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. బరాదర్‌ (ఇంగ్లిష్‌ బ్రదర్‌కు పష్తూన్‌ అర్థం) సోదర భావాన్ని తాలిబాన్‌ తీవ్రవాద శక్తులు, స్థానిక జీహాదీలు ఏమేరకు ఆమోదిస్తారో చూడాలి. అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ప్రయత్నాలు ఫలిస్తే పంజ్‌షీర్‌ లోయ సమర శంఖారావం చేయకపోవచ్చు.

ఎవరిపైనా కక్షసాధింపు చర్యలుండవనీ, మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చుననీ ఒకపక్క తాలిబాన్‌ అధికార ప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరోపక్క అక్కడక్కడా కొన్ని దుందుడుకు శక్తులు ఆగడాలకు దిగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అగ్ర నాయకత్వంలో సామరస్యపూర్వక ధోరణి సమ్మిళిత ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు భావన నిజమే అయితే, అది క్షేత్రస్థాయికి ఇంకడానికి కొంత సమయం పట్టవచ్చు. పాత అలవాట్లు, ఆలోచనా ధోరణి మారడానికి నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి రావచ్చు. ఈలోగానే పాశ్చాత్య మీడియా గగ్గోలు మాత్రం తారస్థాయికి చేరింది. తాలిబాన్లు అనే రాక్షసులు కోరలూ, కొమ్ములూ మొలిపించుకొని పేగులు మెడలో వేసుకొని నడివీధుల్లో భీకర నాట్యం చేస్తున్నారనే ధోరణిలో మీడియా ప్రొజెక్షన్‌ జరుగుతున్నది. తాలిబాన్లకూ, అఫ్గానిస్తాన్‌కూ సంబంధం లేని వీడియోలు సోషల్‌ మీడియాలో కలవరం కలగజేస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి సైన్యాన్ని ఉపసంహరించినందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మీద దుమ్మెత్తిపోసే నెటిజన్లకూ కొదవ లేదు.

అసలు ఈ బైడెన్‌ అనే వ్యక్తి ఎవరు? అమెరికాకు ఉన్న హక్కేమిటి? అఫ్గానిస్తాన్‌ ఆంతరంగిక వ్యవహారాలతో వారికి పనేమిటి? అనే ప్రశ్నలు ప్రధాన స్రవంతి మీడియాలో కానీ, సోషల్‌ మీడియాలో కానీ చూద్దామన్నా కనిపించడం లేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ భూప్రపంచంలోని ప్రతి దేశానికీ దాని పరిధిలో సార్వభౌమాధికార హక్కు ఉన్నది. అమెరికా భూభాగంపై అమెరికాకు ఎంత సార్వభౌమాధికారం ఉన్నదో భూటాన్‌ భూభాగంపై ఆ దేశానికి అంతే అధికారం ఉన్నది. దేశం చిన్నదయినా, పెద్దదయినా న్యాయం ఒకటే. ఏ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఆ దేశవాసులే తీర్పరులు. సొంత దేశ వ్యవహారాలను సరిదిద్దుకునే నేర్పు, చొరవ అఫ్గానిస్తాన్‌ ప్రజలకు ఉన్నాయి. శతాబ్దాల తరబడి ఇది రుజువవుతూనే ఉన్నది.

మనకు తెలిసిన రెండు సహస్రాబ్దుల చరిత్రలో ఎన్నడూ ఏ సూపర్‌ పవర్‌కూ అఫ్గానిస్తాన్‌ పూర్తిగా తలవంచలేదు. పర్షియన్‌ చక్రవర్తి డరియస్‌ కూడా ఈ దేశాన్ని పూర్తిగా పాదాక్రాంతం చేసుకోలేకపోయాడు. డరియస్‌ను ఓడించిన అలెగ్జాండర్‌ ద గ్రేట్‌కు కూడా పూర్ణ అఫ్గాన్‌ దక్కలేదు. వలసవాద యుగంలో గ్రేట్‌ బ్రిటన్‌ ఎన్ని యుద్ధాలు చేసినా సంపూర్ణ ఆధిపత్యం సాధించలేకపోయింది. అయినా అఫ్గానిస్తాన్‌ క్షేత్ర ప్రాధాన్యత, దాని సహజ నిక్షేపాల సంపద సూపర్‌ పవర్స్‌ను ఊరిస్తూనే వస్తున్నది. చరిత్రలో జగద్విజేతలయినవారూ, కావాలనుకున్నవారూ దానిపై కన్నేస్తూనే ఉన్నారు.

తన కీలుబొమ్మయిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడే మిషతో సోవియట్‌ యూనియన్‌ 1979లో అఫ్గానిస్తాన్‌పై దురాక్రమణ యుద్ధాన్ని ప్రారంభించింది. లక్షలాది మంది సైన్యాన్ని మోహరించింది. పదేళ్లు యుద్ధం చేసింది. ఆరోజుల్లో పదిహేను బిలియన్ల రూబుళ్లను ఖర్చు చేసింది. ఇరవై వేలమంది రష్యన్లు చనిపోయారు. ఇరవై లక్షలమంది అఫ్గాన్‌ పౌరులు చనిపోయారు. ముప్ఫై ఐదు లక్షలమంది శరణార్థులయ్యారు. అయినా పదేళ్ల తర్వాత రష్యా తోకముడవక తప్పలేదు. ఆ యుద్ధ భారాన్ని పరాజయ భారాన్ని మోయలేక సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలింది. సోవియట్‌లో అంతర్భాగంగా ఉన్న 14 రిపబ్లిక్‌లు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. పది తూర్పు యూరప్‌ దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కుప్పకూలాయి. బెర్లిన్‌ గోడ బద్దలైంది. అదీ అఫ్గాన్‌ దెబ్బ.

బిన్‌ లాడెన్‌ను వేటాడే వంకతో అమెరికా ‘నాటో’ సపరివారంగా 2001లో అఫ్గాన్‌లో ప్రవేశించింది. ఇరవయ్యేళ్లు అక్కడ తిష్ఠ వేసింది. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు అక్కడ ఖర్చుపెట్టవలసి వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతకు రెట్టింపు ఉండొచ్చని అనధికార అంచనా. వేలాదిమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. జరిగిన నష్టంపై పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇంకో ఇరవయ్యేళ్లున్నా మనం చేయగలిగిందేమీ లేదని బైడెన్‌ ప్రకటించవలసి వచ్చింది. రష్యా, అమెరికాలు వరసగా చేతులు కాల్చుకున్నాయి. ఇక చైనా వంతు. తాలిబాన్లకు అత్యంత నమ్మకమైన మిత్రుడు పాకిస్తాన్‌. పాకిస్తాన్‌తో చైనాకు విశ్వసనీయమైన మైత్రీబంధం ఉన్నది. తాలిబాన్‌లు దేశంలో రాజకీయ సుస్థిరతను సాధించగలిగినట్లయితే పాక్‌ ప్రోద్బలంతో చైనా మిత్రబృందంలో అఫ్గానిస్తాన్‌ చేరవచ్చు. వాణిజ్యపరంగా కూడా చైనా ఉపయోగపడుతుంది. సెంట్రల్‌ ఆసియా, దక్షిణాసియా, పశ్చిమాసియాల్లో ప్రభావం చూపగలిగే విధంగా చైనా–రష్యా–పాకిస్తాన్‌ – అఫ్గానిస్తాన్‌ – ఇరాన్‌ కూటమి ఉండాలని చైనా ఆశిస్తున్నది.

మరి భారత్‌ సంగతేమిటి? ఇరవయ్యేళ్ల కిందటి తరహా తాలిబాన్‌ 1.0 ప్రభుత్వం మనకు ప్రమాదకరం. తాలిబాన్‌ 2.0లో గుణాత్మకమైన మార్పు వస్తే స్వాగతించవలసిందే. మన విదేశాంగ విధానం అమెరికా – చైనా సంబంధాల కోణంలో ఉండకూడదు. దాన్ని భారత్‌ అవసరాల దృష్ట్యానే నిర్ధారించుకోవాలి. అఫ్గాన్‌తో భారత్‌కు ప్రాచీన సాంస్కృతిక బంధమే కాకుండా తాజాగా ఆర్థిక సంబంధాలు కూడా బలపడ్డాయి. కౌరవ మాత గాంధారిది కాందహార్‌ అని మనవాళ్లు చెబుతున్నారు. గాంధారమే కాందహార్‌గా రూపాంతరం చెందిందనే వాదన ఉన్నది. గాంధార దేశమనే మాటకు సుగంధాలు వెదజల్లే ప్రదేశమని అర్థమట. తాలిబాన్‌ 2.0లో నిజంగానే నిఖిల జగతి ఆశిస్తున్న మార్పు ఉంటుందా అన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

పష్తూన్‌ భాషలో తాలిబ్‌ అంటే విద్యార్థి అని అర్థం. తాలిబాన్‌ అంటే విద్యార్థుల సమూహం లేదా సంఘం అని అర్థం. అఫ్గానిస్తాన్‌లో సోవియట్‌ దురాక్రమణ తర్వాత దక్షిణ ప్రాంతంలోని పష్తూన్‌ తెగ ప్రజలు లక్షల సంఖ్యలో పాకిస్తాన్‌కు శరణార్థులుగా వెళ్లిపోయారు. వారి పిల్లలకోసం అఫ్గాన్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ మదర్సాలను తెరిచింది. అంతర్జాతీయంగా ఇస్లామిక్‌ తీవ్రవాదం ప్రబలుతున్న సమయం అది. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ తీవ్రవాదులను ఉత్పత్తి చేస్తున్న సమయం. మదర్సాలలో చదివే ఒక తరం అఫ్గాన్‌ విద్యార్థులను అతి ఛాందసవాదులుగా మార్చి ముల్లా ఉమర్‌ నేతృత్వంలో ఒక మిలిటరీ సమూహంగా తీర్చిదిద్దారు. సోవియట్ల నిష్క్రమణ తర్వాత ఏర్పడిన అంతర్యుద్ధ పరిస్థితుల్లో తాలిబాన్‌ బలపడింది. దేశంలో 40 శాతానికి పైగా ఉన్న పష్తూన్ల పూర్తి మద్దతు వీరికి లభించింది. ఫలితంగా 1996లో అధికారంలోకి వచ్చారు. ఇస్లామిక్‌ చట్టం పేరుతో వీరు అమలుచేసిన సాంఘిక విధానాలు, శిక్షలను ప్రపంచమంతా ఖండించింది. మహిళలను అక్షరాలా వంటింటి బానిసలుగా మార్చివేశారు. ఒసామా బిన్‌ లాడెన్‌ వంటి తీవ్రవాదులకు దేశాన్ని డెన్‌గా మార్చారు. అందుకే తాలిబాన్‌లంటే ప్రజలకు బెదురు.

ఇరవయ్యేళ్లలో ప్రపంచ పరిణామాలు చాలా జరిగాయి. ఇప్పుడు తాలిబాన్‌ నేతలు విద్యార్థులు కాదు. సంస్థ పేరుకే విద్యార్థి సంఘం. విద్యార్థులు ఎవరూ ఇందులో లేరు. ఇరవయ్యేళ్లూ అదొక సైన్యంగా పనిచేసింది. ఇప్పుడు రాజకీయ పార్టీగా పరివర్తన చెందే క్రమంలో ఉన్నది. అన్ని రాజకీయ స్రవంతులనూ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలు ఉన్నట్టు బహిరంగంగానే తాలిబాన్‌ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ప్రపంచం హర్షిస్తుంది. తాలిబాన్‌ 1.0 మాదిరిగా వ్యవహరించే భౌతిక పరిస్థితులు ఇప్పుడు లేవు. మహిళలు బాగా చదువుకున్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారు. జనసామాన్యం అభివృద్ధిని కోరుకుంటున్నది. స్వేచ్ఛనూ, స్వాతంత్య్రాన్ని, అభ్యుదయాన్ని వారు కోరుకుంటున్నారు. ఈ మార్పును తాలిబాన్లు గుర్తించకుండా గతంలో మాదిరిగానే ప్రవర్తిస్తే బుద్ధిచెప్పే సాహసం అఫ్గాన్‌ ప్రజలకు ఉన్నది. ఈ రెండు రోజుల్లోనే అది వెల్లడైంది. అవసరమైతే మరోసారి సమరశంఖం పూరించడానికి పంజ్‌షీర్‌లు సిద్ధంగా ఉన్నవి. దేశాల స్వాతంత్య్రాన్ని, జాతుల స్వయం నిర్ణయాధికారాన్నీ గుర్తించి, గౌరవించడం ప్రజాస్వామిక శక్తుల కనీస ధర్మం.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు