ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా!

26 Jun, 2022 00:17 IST|Sakshi

జనతంత్రం

స్వతంత్ర భారతదేశం అమృతోత్సవాలు జరుపుకొంటున్న సంవత్సరమిది. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వించదగిన కొన్ని మధుర క్షణాలను కూడా ఈ యేడు మోసుకొస్తున్నది. ఈ దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి హోదా! ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడా హోదా మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళకు దక్కబోతున్నది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత హోదా కలిగిన పదవులేవీ దేశంలో 12 కోట్ల జనాభా కలిగిన షెడ్యూల్డ్‌ తెగలకు ఇంతవరకూ దక్కలేదు. పీఏ సంగ్మా కొంతకాలం లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కారణంగా ఎస్‌.టీ. గుర్తింపు లభించిందే తప్ప స్వతహాగా గిరిజన జీవితంలోంచి వచ్చినవాడు కాదు.

అధిక జనాభా కలిగిన ప్రధాన గిరిజన తెగల్లో ఒకటైన సంతాల్‌ తెగకు చెందిన ద్రౌపదీ ముర్మూ ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. 1857 నాటి సిపాయి తిరుగుబాటును మనం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తిస్తున్నాం. కానీ అంతకంటే ముందే అక్కడక్కడ విడివిడిగా జరిగిన ప్రతిఘటనా పోరాటాలు ఇప్పటికీ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తూనే ఉన్నాయి. కట్టబొమ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాలపై సినిమాలు కూడా వచ్చాయి.

ఆ కోవలోనిదే, అంతకంటే విస్తృతమైనది, ప్రభావవంతమైనది సంతాల్‌ తిరుగుబాటు. 1855లో సంతాల్‌ గిరిజనులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపారు. స్వతంత్ర భారతావని తొలి పారిశ్రామిక ప్రస్థానంలో ముందువరసలో నడిచిన కార్మికుల్లో సంతాల్‌ గిరిజనులున్నారు. అసన్‌సోల్, బీర్భూమ్‌ బొగ్గు బావుల్లోకి ప్ర«థమంగా దిగిన వారిలో, రూర్కేలా, జెమ్‌షెడ్‌పూర్‌లలో ఉక్కును మండించిన అగ్రగామి దళంలో అత్యధికులు సంతాల్‌ గిరిజనులే. ఇన్నేళ్లకైనా వారి త్యాగాలను దేశం గుర్తించి గౌరవించిందని భావించి ముర్మూ ఎంపికను స్వాగతించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుంది.

ప్రతిపక్ష శిబిరానికి రాజకీయ కారణాలుంటాయి కనుక, వారూ పోటీ అభ్యర్థిని రంగంలోకి దించారు. ప్రజాస్వామ్యంలో అది వారికి ఉన్న స్వేచ్ఛ, హక్కు. ఎవరూ కాదనలేరు. పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీలో 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తేనే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 48 శాతం ఓట్లున్నాయి. కొన్ని చిన్నాచితకా పార్టీలను సమీకరించి మెజారిటీ ఓట్లు సాధించడం బీజేపీ పెద్దలకు కష్టమేమీ కాదు.

ఆ అవసరం లేకుండా ఇప్పటికే రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు ముర్మూ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి. ఒరిస్సా రాష్ట్ర మహిళ కనుక బీజేడీ అధినేత, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మద్దతిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ ఐడియాలజీలో సామాజిక న్యాయం ఒక ముఖ్యాంశం. కనుక ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్దతు తెలిపారు. బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముర్మూకే తన ఓటని చెప్పారు. ముందుముందు మరికొన్ని పార్టీలు  కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉన్నది. వారు బీజేపీ అగ్రనేతల ఫోన్‌ కాల్‌ కోసం ఎదురుచూస్తూ, నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నిక, మహారాష్ట్ర సంక్షోభం... వగైరా బర్నింగ్‌ టాపిక్‌లకు దీటైన ఒక రాజకీయ కలకలాన్ని సృష్టించవలసిన అగత్యం ఈ సందర్భంగా ఎల్లో మీడియాకు ఏర్పడింది. చంద్రబాబు అవసరమే ఎల్లో మీడియా అగత్యం. ఆయన ఆలోచన, మనసులోని మాట ముందుగా ఎల్లో మీడియా ద్వారా జనంలోకి వస్తుంది. సదరు ఆలోచనకు జనం నుంచి వ్యతిరేకత రాకపోతే ఇక విజృంభిస్తారు. వస్తే మాత్రం తాత్కాలికంగా కొంతకాలం సద్దుమణుగుతారు. అదును కోసం వేచి చూస్తారు.

ఇంగ్లిష్‌ మీడియం విషయంలో జరిగిందదే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ముందు ఎల్లో మీడియాను ఉసిగొలిపారు. జనంలో వ్యతిరేకత కనబడటంతో చంద్రబాబు తాత్కాలికంగా సర్దుకున్నారు. కొంతకాలం తర్వాత విశాఖపట్నం జిల్లాలో రోడ్డుపక్కనున్న జన సమూహంతో ముచ్చటిస్తూ మరోసారి మనసులోని మాటను బయటపెట్టారు. మఖం మీద గుద్దినంత స్పష్టంగా జనం వ్యతిరేకించడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. బలహీనవర్గాల అభ్యున్నతి పట్ల, సాధికారత పట్ల ఆయనే స్వయంగా తన వ్యతిరేకతను పలుమార్లు బయట పెట్టుకున్న వ్యక్తి కనుక, పేదపిల్లలకు ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకించడంలో ఎప్పటికీ తగ్గరు.

గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయడాన్ని ఆయన గానీ, ఎల్లో మీడియా గానీ బహిరంగంగా వ్యతిరేకించడం కష్టం. కానీ ద్రౌపదీ ముర్మూ అభ్యర్థిత్వం పట్ల ఈ కూటమి అసహనం స్పష్టంగా బయటకు వచ్చింది. ఉపరాçష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా గట్టిగా కోరుకున్న విషయం వాస్తవం. తప్పేమీ కాదు. ఆయన తెలుగువాడు కనుక, ఆయన రాష్ట్రపతి అయితే బాగుంటుందనుకోవడంలో ఏ దోషమూ లేదు. తెలుగుదేశం వారే కాదు.

తెలుగువాళ్లందరూ సంతోషిస్తారు. కానీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవలసింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ తన జాతీయ అవసరాల కోసం, వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. అది సహజం. కానీ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడానికి ఒక గిరిజన మహిళను మొట్టమొదటిసారిగా, అదీ ఆజాదీ అమృత మహోత్సవ సందర్భంలో ఎంపిక చేయడం స్వాగతించవలసిన విషయం. రాజకీయ ఎజెం డాలను పక్కన పెట్టి మద్దతు ఇవ్వవలసిన సందర్భం.

కానీ ముర్మూ అభ్యర్థిత్వం పట్ల ఎల్లో ముఠా ఒక్క మాటయినా మాట్లాడకుండా, వెంకయ్యనాయుడును ఎంపిక చేయకపోవడం తెలుగు జాతిని అవమానించడమే అనే పాటను అందుకున్నది. అభ్యర్థి ఎంపికకు ఒకటి రెండు రోజుల ముందు ‘ఆయన అత్యున్నత పదవిలో ఉండాలని దేశం కోరుకుంటున్నట్టు’ ప్రత్యేక కథనాలు ఎల్లో మీడియాలో వచ్చాయి. ఎంపిక రోజున ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. ‘యోగా డే’లో పాల్గొన్నారు.

వెంటనే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడంతో ఎల్లో ఛానల్స్‌లో కూడా హడావిడి మొదలైంది. ‘రాష్ట్రపతిగా మన వెంకయ్య’ అంటూ ప్రత్యేక చర్చాగోష్ఠులు నడిపారు. చివరకు ద్రౌపదీ ముర్మూను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఒక యాంకరైతే దక్షిణ భారతదేశం విడిపోవడం తప్ప మరో మార్గం లేదన్నట్టుగా మాట్లాడారు. వెంకయ్యను రాష్ట్రపతిని చేయకపోవడం వల్ల దక్షిణ భారతదేశం విడిపోవాలనే ఆలోచన చాలామందిలో వచ్చేసినట్టు ఆయన కనిపెట్టేశాడు.

మరో చానల్‌ తన విచిత్ర కథనాన్ని నడిపింది. ఈ కథనం ప్రకారం రాష్ట్రపతి ఎంపికలో బీజేపీ బుర్ర లేకుండా వ్యవహరించింది. వెంకయ్యను ఎంపిక చేసి వుంటే తెలంగాణ ఎన్నికల్లో ఆయన సామాజికవర్గం వాళ్లు బీజేపీకి సహకరించే వారు. వారి మద్దతు లేకుండా తెలంగాణలో బీజేపీ ఎట్లా గెలుస్తుంది? గోల్డెన్‌ ఛాన్స్‌ను బీజేపీ మిస్‌ చేసుకుంది... ఇలా సాగిందా కథనం. తెల్లారేసరికల్లా ఆ రెండు పత్రికల్లో విషాద కథనాలు... వెంకయ్యను మోసం చేశారు.

వెంకయ్య ఎంత చేశారు మోదీకి! ఆయన ప్రధాని కావడానికి మన వెంకయ్యే కారణం. మోదీకి కృతజ్ఞత లేదు... ఇదీ సారాంశం. అంతా ఎల్లో మీడియా హడావిడే తప్ప రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి వెంకయ్య నాయుడు ఎక్కడా ఎవరితో మాట్లాడింది కూడా లేదు. ముర్మూ అభ్యర్థిత్వం గురించి తెలిసో తెలియదో కానీ, పార్టీ అవసరాల గురించీ, ఆలోచనల గురించీ ఆయనకు తెలిసే ఉంటుంది. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే తన ఆశీస్సుల కోసం వచ్చిన ముర్మూను సాదరంగా ఆహ్వానించారు. ఆయన ముఖంలో ఎక్కడా అసంతృప్తి ఛాయలు కనబడలేదు.

కనిపించిన అసంతృప్తి ఛాయలు, విషాద ఛాయలన్నీ ఎల్లో మీడియాలోనే! ఎల్లో మీడియా అంటే చంద్రబాబు చేతిలోని మైకు తప్ప మరొకటి కాదు. కనుక ఎల్లో మీడియా విషాదమే చంద్రబాబు విషాదం. చంద్రబాబు విషాదమే తెలుగుదేశం పార్టీ విషాదం. అసలెందుకింత విషాదం? కోస్తా జిల్లాల్లోని ఒక బలమైన సామాజిక వర్గానికి ఈ ఎల్లో ముఠా తనను తాను వ్యాన్‌గార్డ్‌గా  భావించుకుంటున్నది. ‘మీ రక్షకులం మేమే’నని సదరు సామాజిక వర్గాన్ని ఈ ముఠా భ్రమింపజేస్తున్నది.

నిజానికి అనేక దశాబ్దాల కిందనే కృషితో, క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చిన సామాజిక వర్గమది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, అభ్యుదయవాదులు, హేతువాదులు, క్రాంతి కారులు ఆ వర్గం నుంచి వచ్చారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత క్రమంగా అక్కడక్కడా కుక్కమూతి పిందెలు పడటం ప్రారంభమైంది. ఈ కుక్కమూతి పిందెలన్నీ కలిసే ఎల్లో సిండికేట్‌గా ఒక ముఠా ఏర్పాటైంది. ప్రగతిశీల సామాజిక వర్గంగా సంపాదించుకున్న ప్రతిష్ఠను ఈ ముఠా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పీల్చి పిప్పిచేస్తున్నదని చాలామంది ప్రముఖులు ఇప్పుడు వాపోతున్నారు.

వెంకయ్యనాయుడు ఈ ఎల్లో పార్టీతో సంబంధం లేని వేరే పార్టీకి జాతీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ వల్లనే తాను ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెప్పు కుంటారు. ఆయన ఎల్లో ముఠా కబ్జా చేసిన సామాజిక వర్గంలో పుట్టినవారే. కనుక, ఆయన అత్యున్నత పదవిలో ఉంటే మన పార్టీని కష్టకాలంలో ఆదుకుంటారనేది ఎల్లో ముఠా తలపోత. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీతో మొదటి నుంచి బీజేపీకి బద్ధవిరోధం.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్షంగా ఉందన్న ఉద్దేశంతో కాబోలు, చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వెంకయ్యనాయుడు ఢిల్లీ స్థాయిలో సహకరించి ఉంటారు. అందువల్ల ఆయన రాష్ట్రపతి కావాలని ఎల్లో ముఠా గట్టిగానే కోరుకున్నది. అయితే రాష్ట్రంలో ఆయన సొంత పార్టీ నేతలెవ్వరూ కూడా ముర్మూ ఎంపికను వ్యతిరేకించలేదు. పైగా స్వాగతించారు. ఎల్లో ముఠా కోరుకున్నట్టు ఏ ఉద్యమమూ జరగలేదు. ఎవరూ వీధుల్లోకి రాలేదు. పైగా ఎల్లో మీడియా ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఆశాభంగం చెందిన ఎల్లో మీడియా కొత్త ఎత్తు వేసింది.

తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ముర్మూ ఎంపికను వైఎస్సార్‌సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం బేరాలాడకుండానే ముర్మూకు మద్దతు తెలపడమేమిటని ఎల్లో గ్యాంగ్‌ ఒక వాదాన్ని లేవ దీసింది. ఇదా సందర్భం? ఒక అద్భుతమైన చరిత్ర పురుడు పోసుకోబోయే వేళ భ్రూణహత్యకు పురిగొల్పుతున్నది ఈ ముఠా. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే ఏ శక్తులు కుయుక్తులు పన్నాయో ఆ శక్తులన్నీ ఇప్పుడు ‘బేరాల’ పాట పాడుతున్నాయి. బేరాల ముసుగేసుకొని బీరాలుపోతున్న ఈ ప్రగతి నిరోధకుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనించకుండా ఉండరు.

సరిగ్గా కేంద్రంలో ఇవే పరిస్థితులు ఉండి, జగన్‌ గారి స్థానంలో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముర్మూ ఎంపిక తర్వాత ఎల్లో మీడియా కథనాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని ఒక ప్రకటన విడుదల చేస్తే లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు వస్తాయి. అందులో కనీసం 90 శాతం మంది సరైన సమాధానమే రాస్తారు. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడే కథనాన్ని ఎలా రాస్తుందో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. ‘మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీకి చంద్రబాబు ఈ సలహా ఇచ్చారు. ద్రౌపది ముర్మూను ఎంపిక చేయాలని గట్టిగా చెప్పారు.

అందుకు ప్రధాని అంగీకరించారు. వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేత ముస్లిం మైనారిటీకి చెందిన అబ్దుల్‌ కలామ్‌ను బాబే నిలబెట్టించారు. ఇప్పుడు గిరిజన మహిళను సూచించి బాబు మరో ఘనకార్యం చేశారు’ అని రాసి ఉండేవారు. ఎనీ డౌట్‌? ఎల్లో మీడియా ప్రచారం వల్ల నిజంగానే కలామ్‌ను బాబే సూచించారని చాలామంది భ్రమపడ్డారు. ములాయంసింగ్‌ యాదవ్‌ చేసిన సూచనకు అంగీకరించి వాజ్‌పేయి కలామ్‌ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారని చాలాకాలం తర్వాత గానీ బయటకు రాలేదు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు