బెంగాల్‌పై నెత్తుటి మరక

26 Mar, 2022 00:37 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌లో మరోసారి రక్త చరిత్ర పునరావృతమైంది. ఈనెల 21 రాత్రి అక్కడి బీర్‌భూమ్‌ జిల్లాలోని రామ్‌పూర్‌హట్‌లో సాయుధులైన వందమంది దుండగులు చెలరేగి, ఇళ్లకు నిప్పంటించి ఎనిమిది నిండు ప్రాణాలు బలిగొన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాణాలతో ఉన్నవారు బతుకు జీవుడా అనుకుంటూ ఆ గ్రామం వదిలిపోయారు. దారుణాతి దారుణ హింస పశ్చిమ బెంగాల్‌కు కొత్తగాదు.

ఎవరు అధికారంలో ఉన్నా ఇది తప్పడం లేదు. అక్కడ పార్టీల్లో ఏర్పడే అంతర్గత కలహాలు, పార్టీల మధ్య రాజుకునే ఆధిపత్య సమరాలు తరచూ హింసకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. నాటు బాంబుల వాడకం రివాజైంది. ముఖ్యంగా బీర్‌భూమ్‌ జిల్లా అందుకు పెట్టింది పేరు. గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారన్న భయాందోళనలతో ఇళ్లలో తలదాచుకున్నవారిని బయటకు లాగి గొడ్డళ్లతో తీవ్రంగా గాయపరిచి, ఆ తర్వాత వారిని లోపలికి నెట్టి, ఆ ఇళ్లకు నిప్పంటించారని వస్తున్న కథనాలు వింటే ఒళ్లు గగుర్పొడు స్తుంది. అసలు అక్కడ అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేస్తోందా... శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రాథమిక కర్తవ్యమన్న సంగతి దానికి గుర్తుందా అన్న సంశయం కలుగుతుంది. హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న తృణమూల్‌ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ గ్రామానికి వెళ్లారు.

బాధిత కుటుంబాలతో మాట్లాడాక ఆమె ఆదేశించడంతో స్థానిక తృణమూల్‌ నాయకుడు అనారుల్‌ హుస్సేన్‌ను అదుపులోనికి తీసుకున్నారు. మారణకాండ సంగతి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ప్రస్తుతానికి అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సూత్ర ధారి కూడా అతగాడేనా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం తాపీ పనిచేసుకుని బతుకీడ్చిన హుస్సేన్‌ ఇప్పుడు ఖరీదైన మోటార్‌ బైక్‌లు, కార్లు, ఐఫోన్‌లతో... కళ్లు చెదిరే రెండంతస్తుల భవంతితో దర్జాగా ఉన్నాడంటే ఆ ప్రాంతంలో ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నదో ఊహించడం కష్టమేమీ కాదు.

తృణమూల్‌ అంతర్గత కలహాల పర్యవసానంగా అంతకుముందు రోజు ఒక నాయకుడు హత్యకు గురికాగా, అందుకు ప్రతీకారంగా ఈ మారణకాండ జరిగింది. హత్య సంగతి తెలిసినా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నదన్న ఆలోచన పోలీసులకు కలగలేదు. పైగా రాత్రి 9.35కు ఈ రాక్షసకాండ సంగతి తెలిస్తే పది గంటల ప్రాంతంలోగానీ పోలీసులు అక్కడికి చేరుకోలేదు. పోలీస్‌ స్టేషన్‌ అక్కడికి కేవలం కిలోమీటర్‌ దూరంలో ఉంది. అంతేకాదు... స్వయంగా మమతా బెనర్జీ ఆదేశించేవరకూ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకోలేదంటే వారి నిర్వాకమేమిటో అర్థమవుతుంది. 

జనరంజక విధానాలతో, మెరుగైన హామీలతో ప్రజల మనసులు గెల్చుకుని అధికారంలోకి రావాలని విపక్షాలు ఆలోచించడం లేదు. ప్రజానుకూల విధానాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మాత్రమే తిరిగి గద్దెనెక్కడం సాధ్యమవుతుందని పాలకులు ఆలోచించడం లేదు. నయానో భయానో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకునే స్థానిక పెత్తందార్ల అండతో గెలుపు శాశ్వతం చేసుకోవచ్చు నని భావించే ధోరణులు పుట్టుకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అదే సమస్య. ఇంతక్రితం పాలించినవారితో విసుగెత్తి తృణమూల్‌ను గెలిపిస్తే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు మింగేవాడు వచ్చిన తీరుగా అక్కడ పల్లెల్లో కొత్త పెత్తందార్ల హవా మొదలైంది. తమకెదురు తిరిగినవారిని నక్సలైట్ల పేరుమీదనో, మరే ఇతర పార్టీ పేరుమీదనో కేసుల్లో ఇరికించడం సర్వసాధారణంగా మారింది.

స్థానికంగా దొరికే వనరులను దోచుకుంటున్న క్రమంలో పంపకాల్లో తేడా రావడం వల్లనో, ఆ దోపిడీని ప్రశ్నించడం వల్లనో కక్షలు బయల్దేరుతున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఆగ్రహం కలుగుతుందన్న కారణంతో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా ఇదే తరహాలో ఆధిపత్య పోరు నడిచేది. అది తరచూ హింసాకాండకు దారితీసేది. దీన్నంతటినీ సమూలంగా మారుస్తానని, పల్లెసీమలు ప్రశాంతంగా మనుగడ సాగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మమత అధికారంలోకి వచ్చారు. కానీ జరిగింది వేరు. పల్లెటూళ్లలో గూండాల ప్రాబల్యం పెరిగింది. సాధారణ పౌరుల బతుకులు పెనం మీంచి పొయ్యిలో పడిన తీరుగా మారాయి.

ఇప్పుడంతా అయ్యాక ఈ విషాద ఘటనకు కారకులని భావిస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా ఉన్న ఆయుధాలను పదిరోజుల్లోగా స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అన్నిచోట్లా గాలింపు మొదలైంది. గ్రామం విడిచి వెళ్లిపోయినవారు వెనక్కొస్తున్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్రం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అన్ని వివరాలనూ సీబీఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

కానీ అంతటితో ఆగకూడదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దారుణ విషాద ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలకు ఉపక్రమించాలి. మారుమూల ప్రాంతాలవరకూ విస్తరించి ఉండే పోలీసు, నిఘా వ్యవస్థల మొద్దు నిద్రను వదిలిం చేలా సమూల ప్రక్షాళన చేయాలి. హింసకు పాల్పడేవారికి రాజకీయ ప్రాపకం లభించబోదన్న సందేశం వెళ్లాలి. ఇలాంటి ఉదంతాలు తన పాలనకు మచ్చ తీసుకురావడమే కాదు... అంతర్జాతీయంగా మన దేశానికి అప్రదిష్ట తెస్తాయని మమత గుర్తించాలి.

మరిన్ని వార్తలు