Bomb Cyclone 2022: తీరం దాటని తుపాను బాంబు

27 Dec, 2022 00:16 IST|Sakshi

చలి... నీళ్ళు కాదు మనుషులే నిలువునా గడ్డకట్టే చలి. మైనస్‌ 8 నుంచి మైనస్‌ 48 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతతో ఇళ్ళను కప్పేసిన హిమపాతం. గింయుమనే ఈదురుగాలులు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేరు... వెచ్చగా ఇంట్లో ఉందామంటే కనీసం కరెంట్‌ లేదు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా విహార యాత్రలకు వెళదామంటే, మంచుతో హైవేలు మూత బడ్డాయి. వేల కొద్దీ సర్వీసులు రద్దయి, విమానాలు నడవడం లేదు.

తీవ్ర మంచు తుపాను రకమైన ‘బాంబు సైక్లోన్‌’ దెబ్బతో అమెరికాలోని అనేక రాష్ట్రాలు, కెనడాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. సర్వసాధారణంగా సమశీతోష్ణంగా ఉండే అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనివిని ఎరుగని స్థితి. ఇప్పటికి మరణాల సంఖ్య యాభై లోపే అంటున్నా, మోకాలి లోతు మంచులో కూరుకుపోయిన ఇళ్ళూ వాకిళ్ళనూ శుభ్రం చేసి, విద్యుత్‌ సరఫరాను సక్రమంగా, అందరికీ అందుబాటులోకి తెచ్చేలోగా ఇంటాబయటా ఇరుక్కుపోయిన మరెందరికి ప్రాణం మీదకు వస్తుందో చెప్పలేం. 

అత్యవసర వాహనాలు సైతం కదలడానికి కష్టమవుతున్న ప్రాణాంతక రోడ్లతో మరో వారం పరిస్థితులు ఇలానే ఉంటాయన్న వార్తలు భీతి గొల్పుతున్నాయి. కెనడా సరిహద్దు నుంచి మెక్సికో సరిహద్దు వరకు 3 వేల కిలోమీటర్ల పైగా ఇదే దుర్భర వాతావరణం. అమెరికా జనాభాలో 60 శాతం మందికి ఏదో రకమైన ఇబ్బందులు. న్యూయార్క్‌ రాష్ట్రం బఫలో నగరం మంచు తుపాను గాలులు, హిమపాతంతో స్తంభించిపోయింది. నయాగరా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 43 అంగుళాల ఎత్తున మంచు పేరుకుంది. మరిగే నీటిని గాలిలోకి విసిరితే, తక్షణమే మంచుగడ్డగా మారుతున్న పరిస్థితి చూశాక, ఇది ‘తరానికి ఒకసారి వచ్చే’ మంచు తుపానని ఎందుకన్నదీ అర్థమవుతుంది.  
అట్లాంటిక్‌ మహాసముద్ర తుపానులు, చక్రవాతాల సీజన్‌ అమెరికాకు కొత్త కాదు.

ఉష్ణమండల ప్రాంతాల్లో వేడెక్కిన సముద్ర జలాల వల్ల వేసవిలో చక్రవాతాలు ఏర్పడతాయి. ఆ తుపానులు తెచ్చే వరదల జలవిలయం ఒక ఎల్తైతే, తాజాగా విరుచుకుపడ్డ శీతకాలపు మంచు తుపాను మరో ఎత్తు. 24 గంటల్లో 24 మిల్లీ బార్స్, అంతకన్నా ఎక్కువగా వాతావరణ పీడనం ఒక్కసారిగా చకచకా పడిపోయి, బలమైన తుపానుగా మారితే ‘బాంబు సైక్లోన్‌’ అంటారు.

బాంబు పేలినట్టు పీడనం హఠాత్తుగా పడిపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని అలా పిలుస్తారు. ఈదురుగాలులు, కన్ను పొడుచుకున్నా కనిపించని తీవ్ర హిమపాతం ఈ తుపానుతో అనూహ్య పరిణామాలు. ఒంటిపై ఏమీ లేకుండా 5 నిమిషాలుంటే, మనిషి మొద్దుబారి పోతాడు. ఇవెంత ప్రమాదకరమో చెప్పేందుకు 1980లో శాస్త్రవేత్తలు బాంబు సైక్లోన్‌ అనే మాట సృష్టించారు.   

ఇలియట్‌ అని పేరుపెట్టిన తాజా మంచు తుపాను దెబ్బకు ఒక దశలో 17 లక్షల మందికి పైగా విద్యుత్‌ సరఫరా లేక ఇక్కట్ల పాలయ్యారు. సోమవారానికి ఆ సంఖ్య 2 లక్షల లోపు నకు రావడం ఒకింత సాంత్వన.  2021లో టెక్సాస్‌లో భీకర హిమపాతంతో పవర్‌గ్రిడ్‌ విఫలమై, 200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్న విషాదం లాంటివి పునరావృతం కాకపోవడం ఊరట. అమెరికాలో 13.5 కోట్ల మందిని కడగండ్ల పాల్జేసిన మంచు తుపానుతో పంటలు, పశువులు, చివరకు రైల్వేలైన్లు దెబ్బ తినిపోతున్నాయి. నిరుడు ఇలాగే శీతకాలపు మంచులో రైతులు తమ పశువులకు దాణా, నీళ్ళు అందించలేక తిప్పలు పడ్డారు. ఈసారి నిన్నటి దాకా దుర్భిక్షంతో అల్లాడిన పంటలకు ఇది కొత్త దెబ్బ. ఈ తుపానుండేది కొద్ది రోజులైనా, ఆహారధరలు పెరగడం సహా ప్రభావం దీర్ఘకాలికమే. 

మరోపక్క వారం రోజులుగా ఉత్తర జపాన్‌లో శీతకాలపు సగటుకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ మంచు కురిసి, ప్రాణహాని జరిగింది. అమెరికా లానే జపాన్‌లోనూ రైళ్ళు, విమాన సేవల రద్దు, కరెంట్‌ కష్టాలు. ఇవన్నీ ఇప్పుడు మేలుకొలుపులు. ప్రకృతిపై మనం సాగించిన తీవ్ర విధ్వంసానికి అనుభవిస్తున్న ఫలితాలు. పర్యావరణ మార్పులు మనపై చూపుతున్న ఆగ్రహానికి ప్రతీకలు.

అరుదుగా వస్తాయనే బాంబు సైక్లోన్లు ఆ మధ్య 2019లో, మూడేళ్ళకే మరోసారి ఇప్పుడూ రావడం గమనార్హం. ఆందోళనకరం ఏమిటంటే, పర్యావరణ మార్పుల పుణ్యమా అని భవిష్యత్తులో మరిన్ని బాంబు సైక్లోన్లు వస్తాయట. ఒక్క బఫలో నగరంలోనే∙1976 నాటి రికార్డ్‌కు రెట్టింపు హిమపాతం గత శుక్రవారం జరిగింది. 1878 తర్వాత గత 144 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. ఇవన్నీ పదే పదే మనకు చెబుతున్నది ఒక్కటే... ఇక ఆలస్యం చేస్తే ప్రపంచానికి ముప్పు. 

ఇప్పటికే ఋతువులు గతులు తప్పాయి. ఈ ఏడాది బ్రిటన్, యూరప్‌లలో కనివిని ఎరుగని వడగాడ్పులు, సతతం పారే నదులు ఎండిపోవడం చూశాం. ఎండ, వాన, చలి – ప్రతిదీ గరిష్ఠానికి చేరుతున్న కాలంలోకి వచ్చేశాం. మనం చేస్తున్న ప్రకృతి విధ్వంసం, విడుదల చేస్తున్న గ్రీన్‌హౌస్‌ వాయువులే ఇప్పుడు శాపాలయ్యాయి. నామమాత్ర ‘కాప్‌’ సదస్సుల లాంటివి పెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలిస్తే ఉపయోగం లేదు. అగ్రరాజ్యాల అలక్ష్యం సహా అనేక కారణాలతో పర్యావరణ పరిరక్షణకు పెట్టుకున్న లక్ష్యాలను ప్రపంచం చేరుకున్న దాఖలాలూ లేవు.

పర్యావరణ పరిరక్షణ బాధ్యత వర్ధమాన దేశాలదేనని తప్పించుకోజూస్తే కష్టమే. ప్రకృతి హెచ్చరికల్ని విస్మరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదు. అగ్రరాజ్యంలో తాజా మంచు తుపాను బీభత్సం అచ్చంగా జగత్ప్రళయ సినిమాల్లోని దృశ్యాల్లా ఉన్నాయని పలువురి వ్యాఖ్య. ఇకనైనా కళ్ళు తెరవకుంటే భూతాపోన్నతితో వచ్చేది అచ్చంగా ప్రళయమేనని గుర్తించాలి. ప్రపంచ దేశాలన్నీ తగు చర్యలకు నడుం బిగించాలి.   

మరిన్ని వార్తలు