ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు

15 Nov, 2020 10:37 IST|Sakshi

టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్‌ విద్యను పర్యవేక్షించే.. ఆల్‌ ఇండియా కౌన్సెల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ).. బీటెక్‌ స్థాయిలో సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది.  ఆ వివరాలు... 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు..మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్‌ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవం తమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్‌లైన్‌ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్‌ లాంటి కోర్సులో పలు   అవసరాలకు అనుగుణంగా శిక్షణన అందిస్తున్నాయి. తాజాగా ఆల్‌ ఇండియా కౌన్సెల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)  ఇంజనీరింగ్‌ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్‌ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 
  
డేటా సైన్స్‌ 
నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్‌ విద్యలో డేటాసైన్స్‌ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు.  రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్‌. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో  ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు.

డేటా విశ్లేషణ: డేటాసైన్స్‌.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్‌లెర్నింగ్‌ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్‌ –సప్లయ్‌ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్‌ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్‌ను ప్రస్తుత డిమాండ్‌తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్‌ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్‌ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. 

కోర్సు స్వరూపం: డేటాసైన్స్‌ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్‌ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్‌ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. 
వేతనాలు: డేటాసైన్స్‌ వి«భాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. 

సైబర్‌ సెక్యూరిటీ 
నేటి డిజిటల్‌ యుగంలో ఇంటర్నెట్‌ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్‌ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్‌ సెక్యూరిటీ. 

కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌కు సంబంధించి సైబర్‌ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్‌ ప్రిన్సిపుల్స్, సిస్టమ్‌ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు.
జాబ్‌ ప్రొఫైల్‌: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్‌ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్,  వంటి  సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది.
వేతనాలు : సంస్థను బట్టి సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది.

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ 
ఇంజనీరింగ్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ. సైబర్‌ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా  ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా  నిర్వహించేందుకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 

బ్లాక్‌ చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్‌ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్‌ నెట్‌వర్క్‌ ఇది.  దీని ద్వారా  ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు. 

కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్‌చైన్‌టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం,ఎథెరియం,బిట్‌ కాయిన్‌ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది.
జాబ్‌ ప్రొఫైల్‌: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్‌చైన్‌ డెవలపర్, బ్లాక్‌చైన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, బ్లాక్‌చైన్‌ ఎస్‌ఐ పార్టనర్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్, బిట్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్‌చైన్‌ ప్రిన్సిçపల్‌  ప్రోగ్రామ్‌ మేనేజర్, బిజినెస్‌ అనలిటిక్స్‌ అసోసియేట్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. 
వేతనాలు: బ్లాక్‌చైన్‌ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్‌ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్‌ రికగ్నిషన్, విజువల్‌ పర్సెప్షన్, లాజిక్‌ అండ్‌ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్‌లోను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానం కీలకం. 

కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్‌ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు.
జాబ్‌ ప్రొఫైల్‌ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు  డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్‌ డేటాసైంటిస్ట్, కంప్యూటర్‌ విజన్‌ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. 
వేతనాలు : ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగా లు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. 

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ 
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్‌కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్‌ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి.

ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్‌ నగరం గా మారడానికి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుçషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్‌ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి  పనిచేయడాన్ని ఇంటర్నెట్‌ ఆఫ్‌ «థింగ్స్‌ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్‌తో అనుసం« దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా  పూర్తిచేస్తాయి. 

కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్‌ ఇన్‌ ఐఓటీ అండ్‌ అప్లికేషన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  
జాబ్‌ ప్రొఫైల్‌: ఇంజనీరింగ్‌లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్‌ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్, సిటిజన్‌ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. 

బిజినెస్‌ అనలిటిక్స్‌ 
ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్‌ అనలిటిక్స్‌ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్‌ అనలిటిక్స్‌ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్‌ అనలిటిక్స్‌కు బాగా డిమాండ్‌ ఏర్పడింది.

పని తీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్‌ çపరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్‌ అనలిటిక్స్‌. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్‌ అనలిటిక్స్‌ ఉపయోగపడుతుంది. 

కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్‌ బిగ్‌ డేటా అనలిటిక్స్‌ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్‌హౌసింగ్, డేటా విజువలైజేషన్‌ అధ్యయనం చేస్తారు.  ఈ కోర్సు కూడా డేటా సైన్స్‌కు అనుబంధంగా ఉంటుంది.
జాబ్‌ ప్రొఫైల్‌ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్‌ అనలిటిక్స్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
వేతనాలు: బిజినెస్‌ అనలిటిక్స్‌ నిపుణులకు  నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల  వరకూ లభిస్తుంది.

బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌
బయోమెడికల్‌ ఇంజనీంగ్‌ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్‌ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్‌ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్‌ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్‌.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సును రూపొందించారు.  

కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్‌లకు సాంకేతికతను అన్వయించి మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ను తయారు చేసేదే.. బయోమె డికల్‌ ఇంజనీరింగ్‌. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందు కు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్‌ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా.  
జాబ్‌ ప్రొఫైల్‌: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్‌ టెక్నిషియన్, బయో మెడికల్‌ ఇంజనీర్, బయో కెమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తారు. 
ఉద్యోగాలు: మెడికల్‌ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్‌స్ట్రుమెంట్‌ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్‌ సెంటర్స్, ఇన్‌స్టాలెషన్‌ యూనిట్‌లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  
వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు     రూ.30వేల నుంచి రూ.50వేల  వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది. 

మరిన్ని వార్తలు