అస్పైర్‌.. ఆవిష్కరణలకు ఇన్‌స్పైర్‌

5 Sep, 2021 01:51 IST|Sakshi

రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ ఐటీఐలు ఈ పథకం కింద ఎంపిక  

ఒక్కోదానిలో రూ.50 లక్షలతో లైవ్లీవుడ్‌ బిజినెస్‌ ఇంక్యుబేటర్ల ఏర్పాటు 

వీటి ద్వారా వినూత్న కార్యక్రమాలు, ఆవిష్కరణల రూపకల్పన 

సమీప పరిశ్రమలతో అవగాహన, కార్యక్రమాల విస్తరణకు వెసులుబాటు  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన అస్పైర్‌(ఏ స్కీమ్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్, రూరల్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) ప్రభుత్వ పారిశ్రామికశిక్షణ సంస్థ(ఐటీఐ)లకు బాసటగా నిలవనుంది. గ్రామీణ యువతను సరికొత్త ఆవిష్కరణల బాటపట్టించడమే ఈ పథకం ఉద్దేశం. దీని కింద ఎంపికైన ఐటీఐలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది ఇక్కడ శిక్షణ పొందుతున్నవారికి సరికొత్త కార్యక్రమాలను పరిచయం చేయనుంది.

అస్పై ర్‌ కింద సిరిసిల్ల, వనపర్తి, ఖమ్మం, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్‌ ప్రభుత్వ ఐటీఐలు ఎంపికయ్యాయి. ఒక్కో ఐటీఐ ఖాతాలోకి రూ.50 లక్షల చొప్పున కేంద్రం జమ చేసింది. ఈ నిధులతో ఐటీఐల్లో లైవ్లీవుడ్‌ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌(ఎల్‌బీఐ)లను కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ ఐటీఐలు సమీపంలోని పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని స్థానిక నేపథ్యంతో కూడిన సరికొత్త ఆవిష్కరణలు చేయనున్నాయి. త్వరలో మరిన్ని ఐటీఐలు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశముంది.

సిరిసిల్ల ఐటీఐ: ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఎల్‌బీఐ ప్రధానంగా చేనేత పరిశ్రమ ఆధారంగా పనిచేయనుంది. ఈ పరిశ్రమ ఉత్పత్తులు, మార్కెట్‌ సవాళ్లు, లక్ష్యాలు తదితర అంశాలను అధిగమించి ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది. 

వనపర్తి ఐటీఐ: స్థానిక రైతులకు సులభతర వ్యవసాయం, మార్కెటింగ్‌ అంశాలపై ఐటీఐ పనిచేయనుంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విత్తనోత్పత్తి, ఎరువులు, విత్తనాల తయారీపై దృష్టి పెట్టనుంది. 

ఖమ్మం ఐటీఐ: వెదురుకు ప్రసిద్ధమైన ఖమ్మం ప్రాంతంలో వెదురు దిగుబడుల ప్రాసెసింగ్‌తోపాటు వీటిపై ఆధారపడిన చేతివృత్తిదారులకు మెరుగైన వసతులు సమకూర్చేదిశగా ఈ ఐటీఐ పనిచేయనుంది. 

నిజామాబాద్‌ ఐటీఐ: వ్యవసాయ రంగానికి కేంద్రంగా ఉన్న నిజామాబాద్‌ ప్రాంత రైతాంగం కోసం శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పుట్టగొడుగుల పెంపకం తదితర వాటిపై ఈ ఐటీఐలోని ఎల్‌బీఐ పనిచేయనుంది. 

మేడ్చల్‌ ఐటీఐ: నగరానికి చేరువలోని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. వీటిపై మరింత అవగాహన కలిగించడం, స్థానిక యువతకు ప్రాసెసింగ్‌ రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచడం, వీటికి అనుబంధంగా శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి వాటిని ఈ ఎల్‌బీఐ పర్యవేక్షిస్తుంది. 

కరీంనగర్‌ ఐటీఐ: ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నప్పటికీ, కుటీర పరిశ్రమల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుపై ఎల్‌బీఐ పనిచేస్తుంది. ఫుట్‌వేర్, ఆర్నమెంట్, అత్తరు పరిశ్రమలను ప్రోత్సహించే కార్యాచరణతో ముందుకు 
వెళ్లనుంది. 

పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు 
అస్పైర్‌ పథకం అమలుతోపాటు ఎల్‌బీఐల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర సలహాకమిటీ, పాలకమండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి సలహా కమిటీకి కార్మికమంత్రి చైర్మన్‌గా, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సభ్యుడిగా, కమిషనర్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ మెంబర్‌ కన్వీనర్‌గా, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్‌ జనరల్, ఉపాధి, శిక్షణ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సభ్యులుగా కొనసాగుతారు.

పాలక మండలి(గవర్నింగ్‌ బాడీ) చైర్మన్‌గా ఉపాధి శిక్షణా విభాగం కమిషనర్, కొనసాగుతారు. ఈ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా, ఎన్‌ఎస్‌ఐసీ చీఫ్‌ మేనేజర్, ఎంఎస్‌ఎంఈ ప్రతినిధి, ఉపాధి, శిక్షణ డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిణి ఉత్తర్వులు జారీ చేశారు.    

మరిన్ని వార్తలు