యూనివర్సిటీల్లో  ప్రొఫెసర్లు ఏరీ?

5 Sep, 2021 01:27 IST|Sakshi

విశ్వవిద్యాలయాలను వేధిస్తున్న అధ్యాపకుల కొరత

11 యూనివర్సిటీల్లో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీ

968 మందితోనే బోధన.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శలు

ఇదే పరిస్థితి కొనసాగితే యూజీసీ గుర్తింపు కోల్పోయే ప్రమాదం!  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో ఏకంగా 1,869 ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం బోధనా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లే లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల ఖాళీలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 65 శాతం ఖాళీలున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయి, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వర్సిటీల ఉనికికే ప్రమాదం... 
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పదేళ్లుగా అధ్యాపకుల నియామకం ప్రహసనంగా మారిందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆపై కుంటి సాకులతో వాయిదా వేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో కాలం వెళ్లదీసినా ఆశించిన ఫలితాలు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ముఖ్య భూమిక పోషించే పరిశోధనలు సైతం ప్రొఫెసర్ల కొరతతో ముందుకు సాగడం లేదు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) రెగ్యులర్‌ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్య 157కాగా ఇంకా 238 ఖాళీలున్నాయి. అలాగే 129 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లుంటే ఇంకా 781 ఖాళీలున్నాయి. వర్సిటీల్లో 682 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పనిచేస్తుంటే మరో 850 ఖాళీలున్నాయి. మొత్తంగా 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి సర్కార్‌ మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపినా ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. 

ఇదీ దుస్థితి... 
శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్‌జీయూకేటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సి టీ, పొట్టి శ్రీరాములు తె లుగు యూనివర్సిటీ (మొ త్తం ఆరు)ల్లో ఒక్క ప్రొఫె సర్‌ కూడా లేరు. శాతవాహన, ఆర్‌జీయూకేటీ, బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీల్లో ఒక్క అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒకే ఒక్క అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉన్నారు.  


రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్‌ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  
ఉస్మానియా వర్సిటీలో సగానికిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా కాకతీయ యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్‌ ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. 
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఉన్నది ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లే. 

మరిన్ని వార్తలు