ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?!

27 Mar, 2021 20:03 IST|Sakshi

బీటెక్‌లో చేరేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఐచ్ఛికమే: ఏఐసీటీఈ

జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిర్ణయం

మ్యాథ్స్, ఫిజిక్స్‌ లేకుండా రాణించడం కష్టమే అంటున్న నిపుణులు

బీటెక్‌లో చేరాలంటే..ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ గ్రూప్‌ సబ్జెక్ట్‌లుగా.. ఉత్తీర్ణత సాధించాలనే అర్హత నిబంధన ఉన్న సంగతి తెలిసిందే! అందుకే..ఇంజనీరింగ్‌ లక్ష్యంగా చేసుకున్న లక్షల మంది విద్యార్థులు.. ఇంటర్‌ ఎంపీసీలో చేరుతుంటారు! ఆ అర్హత ఆధారంగా సదరు సబ్జెక్ట్‌లతో నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లో.. విజయం సాధిస్తేనే ప్రస్తుతం బీటెక్‌లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది! కానీ..తాజాగా ఏఐసీటీఈ(అఖిల భారత సాంకేతిక విద్యా మండలి)..  ఇక నుంచి బీటెక్‌లో చేరాలంటే..‘ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ చదవడం తప్పనిసరికాదు’ అనేలా ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది! ఈ నేపథ్యంలో..  బీటెక్‌లో చేరేందుకు ఏఐసీటీఈ తాజాగా పేర్కొన్న అర్హతలు.. వాటì తో కలిగే సానుకూల, ప్రతికూల ప్రభావంపై విశ్లేషణాత్మక కథనం.. 

‘చిన్న ఇల్లు కట్టాలన్నా.. లేదా కొత్తగా ఒక రహదారి నిర్మించాలన్నా.. సివిల్‌ ఇంజనీర్లకు ఫిజిక్స్‌ నైపుణ్యాలు ఎంతో అవసరం. సదరు నిర్మాణం చేపట్టే ప్రదేశంలో సాంద్రత, పటిష్టత వంటివి తెలుసుకోవాలంటే.. ఫిజిక్స్‌ నైపుణ్యాలతోనే సాధ్యం. ఈ స్కిల్స్‌ లేకుండా.. సివిల్‌ ఇంజనీరింగ్‌లో రాణించడం కష్టమే. ఒకవేళ ఫిజిక్స్‌ లేకుండా.. సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివినా.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తడం ఖాయం’ 
– ఇది బీటెక్‌లో ఫిజిక్స్‌ నైపుణ్యాలపై విద్యావేత్తల అభిప్రాయం.

‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో... ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొంటున్న ఏఐ, ఎంఎల్, ఐఓటీ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్‌.. ఇలా ఎందులోనైనా ప్రతిభ చూపాలంటే.. మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలు తప్పనిసరి. కోడింగ్, ప్రోగ్రామింగ్‌లను రూపొందించేందుకు అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కాలిక్యులస్‌ వంటి వాటిలో బలమైన పునాది ఉండాలి’ 
–ఇది బీటెక్‌ ప్రవేశాల్లో మ్యాథమెటిక్స్‌ను ఐచ్ఛికం చేయడంపై నిపుణుల అభిప్రాయం.

...ఇలా ..ఒక్క సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అనే కాదు. ఇంజనీరింగ్‌లో సర్క్యూట్‌ బ్రాంచ్‌లుగా పిలిచే ఈసీఈ, ఈఈఈ, ఐటీ.. అదే విధంగా కోర్‌ బ్రాంచ్‌లుగా పేర్కొనే మెకానికల్, సివిల్‌.. అన్నింటిలోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ సిద్ధాంతాల ఆధారంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఇంజనీరింగ్‌ స్వరూపం ఉంటుంది.  రోబోటిక్స్‌.. ఫిజిక్స్‌ సూ త్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇంజనీ రింగ్‌లో ప్రవేశానికి ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లను చదవడం తప్పనిసరికాదనే ప్రకటన చర్చనీయాంశమైంది.

14 సబ్జెక్టుల జాబితా
ఏఐసీటీఈ తాజాగా 2021–22 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సుల అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌ బుక్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌ బుక్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాల ప్రకారం–బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశానికి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరిగా చదివుండాలనే నిబంధన తొలగించింది. అంతేకాకుండా.. 14 సబ్జెక్ట్‌లతో జాబి తా పేర్కొని.. ఈ సబ్జెక్ట్‌లలో ఏవైనా మూడు చదివితే.. బీటెక్‌లో ప్రవేశించేందుకు అర్హులేనని పేర్కొంది. అవి.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,  కెమిస్ట్రీ,  కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ,  బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్, బయోటెక్నా లజీ, టెక్నికల్‌ ఒకేషనల్‌ సబ్జెక్ట్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్, బిజినెస్‌ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌.   అయితే ఆయా రాష్ట్రాలు, యూనివర్సిటీలు బీటెక్‌ ప్రవేశాల్లో అర్హతలకు సంబంధించి తమ  ఈ 14 సబ్జెక్టుల  ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని.. అర్హతల విషయంలో యూనివర్సిటీలకు, రాష్ట్రాలకు సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. 

ఆ సబ్జెక్ట్‌లు ఇంటర్‌లో? 
ఏఐసీటీఈ పేర్కొన్న  14 సబ్జెక్ట్‌లు ఆయా రాష్ట్రాల బోర్డ్‌ల ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. వాస్తవానికి ప్రస్తుతం చాలా రాష్ట్రాలు తమ సొంత కరిక్యులంతో ఇంటర్మీ డియెట్‌ తత్సమాన కోర్సులను బోధిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ ఔత్సాహిక అభ్యర్థుల కోసం ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ అందిస్తున్నాయి. దీంతో ఏఐసీటీఈ తాజా నిర్ణయం పూర్తిగా సీబీఎస్‌ఈ +2 కరిక్యులంను దృష్టిలో పెట్టుకొని∙తీసు కున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఏఐసీటీఈ బీటెక్‌ ప్రవేశ అర్హతలు.. ముఖ్యాంశాలు
► ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ చదవకపోయినా బీటెక్‌లో చేరే అవకాశం.
►బీటెక్‌ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్‌ కోర్సుల ద్వారా ఫిజిక్స్, మ్యాథ్స్‌ నైపుణ్యాలు అందించొచ్చని సూచన.
►ఫిజిక్స్, మ్యాథ్స్‌లో పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఇంజనీరింగ్‌లో రాణించడం కష్టమంటున్న నిపుణులు.
► ఇంజనీరింగ్‌లోని దాదాపు అన్ని బ్రాంచ్‌లలోనూ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సిద్ధాంతాల ఆధారంగానే పట్టు సాధించాల్సిన ఆవశ్యకత.
►భవిష్యత్తులో జాబ్‌ మార్కెట్‌లో, ఉన్నత విద్య, విదేశీ విద్య పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం.
► రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ కోణంలోనూ సైన్స్‌ రంగంలో పరిశోధనలు చేసే విషయంలో ఇబ్బందులు.  

టెస్ట్‌ల ద్వారానే ప్రవేశాలు
అర్హతల విషయంలో పలు మార్పులు చేసిన ఏఐసీటీఈ.. ప్రవేశాలు ఖరారు చేసేందుకు మాత్రం తప్పనిసరిగా ఎంట్రన్స్‌ టెస్ట్‌లు నిర్వహించాలని పేర్కొంది. వాటిల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకు, మెరిట్‌ ఆధారంగానే బీటెక్‌లో ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. 

సొంతంగా ఎంట్రన్స్‌లు
ప్రస్తుతం దేశంలోని ఆయా రాష్ట్రాలు ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం సొంత ఎంట్రన్స్‌ టెస్ట్‌లు నిర్వహించి.. అందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు అర్హత ఇంటర్‌ తత్సమాన కోర్సులో ఎంపీసీ ఉత్తీర్ణత. ఏఐసీటీఈ  ఆయా రాష్ట్రాల విచక్షణ మేరకే తమ సూచనలు పాటించొచ్చని పేర్కొంది. సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే రాష్ట్రాలు అర్హతల విషయంలో స్వీయ నిబంధనలు రూపొందించొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లకు ఇంటర్‌ ఎంపీసీ ఉత్తీర్ణత నిబంధన కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.  ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. ఈ ఏడాది  ఏఐసీటీఈ సంస్కరణలు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. ఇప్పటికే తేదీలు ప్రకటిం చినందున ఎంసెట్‌నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 

బ్రిడ్జ్‌ కోర్సులతో కష్టమే
బీటెక్‌లో చేరడానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌లను  ఐచ్ఛికం అని పేర్కొ న్న ఏఐసీటీఈ.. విద్యార్థులు వాటికి సంబంధించిన బేసిక్‌ నైపు ణ్యాలు పొందేందుకు బీటెక్‌/బీఈ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్‌ కోర్సులు నిర్వహించొచ్చని సిఫార్సు చేసింది. ఈ బ్రిడ్జ్‌ కోర్సు లతో సదరు నైపుణ్యాలు లభిస్తాయా అంటే? కాదనే సమా ధానం వినిపిస్తోంది. వీటివల్ల ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాల కాన్సెప్ట్‌లపై అవగాహన లభిస్తుందే తప్ప.. పూర్తి స్థాయి పట్టు సాధించడం కష్టమంటున్నారు. ఇంజనీరింగ్‌కు పునాదిగా భావించే మ్యాథ్స్‌లోని కాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ సహా పలు కీలకమైన టాపి క్స్‌ను; అదే విధంగా ఫిజిక్స్‌లో మ్యాగ్నటిజం, ఎలక్ట్రో మ్యా గ్నటిజం, థర్మో డైనమిక్స్, మెకానిక్స్‌ తదితర 20కు పైగా టాపి క్స్‌ను ఇంటర్‌లో రెండేళ్ల పాటు అభ్యసిస్తే తప్ప విద్యా ర్థులకు వాటిపై అవగాహన రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకట్రెండు సెమిస్టర్లలో నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సు ద్వారా అవస రమైన నైపుణ్యాలు లభించడం కష్టమే అంటున్నారు నిపుణులు. 

భవిష్యత్తులో సమస్యలు
మ్యాథ్స్, ఫిజిక్స్‌పై పట్టు లేకుండా.. బీటెక్‌ పూర్తిచేసిన విద్యా ర్థులు.. పరిశోధనలు, ఆవిష్కరణల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారనే వాదన వినిపిస్తోంది. పర్యవసానంగా దేశంలో ఆర్‌ అండ్‌ డీ  కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముంది. పీజీ స్థాయిలో.. సర్క్యూట్, కోర్‌ బ్రాంచ్‌ల విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్‌పై అవగాహన లేకుంటే రాణించడం కష్టమే అంటున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్, మ్యాథ్స్‌ లేకుండా.. బీటెక్‌ పూర్తి చేసి.. ఎంటెక్‌లో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్, ఆర్‌ఎఫ్‌ సిగ్నల్స్‌ వంటి సబ్జెక్ట్‌లలో రాణించడం ఎంతో కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

విదేశీ విద్యకు 
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంఎస్‌ కోర్సుల్లో చేరాలంటే.. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ వరకూ.. మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లు చదివుండాలనే నిబంధన  ఉంది. అంతేకాకుండా ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణిక టెస్ట్‌గా పరిగణించే జీఆర్‌ఈలోనూ మ్యాథమెటిక్స్‌ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. మరికొన్ని విదేశీ యూనివర్సిటీలు.. జీఆర్‌ఈ సబ్జెక్ట్‌ టెస్ట్‌లను కూడా అర్హతగా పేర్కొంటున్నాయి. వీటికి సంబంధించి విద్యార్థులు పీజీ స్థాయిలో తాము చదవాల నుకుంటున్న స్పెషలైజేషన్స్‌కు అనుగుణంగా ఈ సబ్జెక్ట్‌ టెస్ట్‌లలో స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మ్యాథ మెటిక్స్‌ సంబంధిత కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు.. జీఆర్‌ఈ మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ టెస్ట్‌లో స్కోర్‌ సాధించాలి. ఈ సబ్జెక్ట్‌ టెస్ట్‌లో కాలిక్యులస్, అల్జీబ్రా, డిస్క్రీట్‌ మ్యాథమెటిక్స్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నైపుణ్యాలు పొందాలంటే.. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ స్థాయిలో వీటిని అభ్యసిస్తేనే సాధ్యమనేది నిపుణుల అభిప్రాయం.

జాబ్‌ మార్కెట్‌ 
మ్యాథ్స్, ఫిజిక్స్‌ లేకుండా.. బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్‌ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కష్టమేనని అభిప్రాయం నెలకొంది. ఉదాహరణకు.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆటోమేషన్‌ ఆధారిత కార్యకలాపాలు సాగుతున్నాయి. రోబో టిక్స్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, కోడింగ్, 3–డి డిజైన్‌ ప్రింటింగ్‌ వంటి వాటికి ప్రధాన్యం పెరుగుతోంది. ఈ విభాగాల్లో రాణించాలంటే.. ప్రోగ్రామింగ్, కోడింగ్‌ స్కిల్స్‌ కీలకం అవుతున్నాయి. వీటికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో పట్టుతో పాటు అప్లికేషన్‌ నైపుణ్యాలు తప్పనిసరి. ఇలాంటి నైపుణ్యాలు ఇంటర్‌లో పూర్తి స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివిన వారికే లభిస్తాయని సబ్జెక్ట్‌ నిపుణులు అంటున్నారు.

జేఈఈ పరిస్థితి
ఏఐసీటీఈ తాజా నిర్ణయం అన్ని వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులో తెచ్చే ఉద్దేశమే అయినప్పటికీ.. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్టులైన జేఈఈ–మెయిన్స్, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లకు అర్హత నిబం ధనల విషయంలో సూచనలు చేయకపోవడం గమనార్హం. ఎన్‌ఐటీలు, ఐఐటీలు.. మ్యాథ్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ  తప్పనిసరి చేస్తూ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. కాబట్టి  ఇంజనీ రింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు.. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో  ఎంపీసీనే ఎంచుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు