ముంచుకొస్తున్న రెన్యువల్‌ గడువు

27 Mar, 2023 00:40 IST|Sakshi
● ఐదేళ్లకోసారి ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల రెన్యువల్‌ తప్పనిసరి ● ఈ నెల 31 లోగా ఆన్‌లైన్‌లో చేయించుకోకపోతే క్రిమినల్‌ చర్యలు ● జిల్లాలో 363 ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు

భీమవరం(ప్రకాశం చౌక్‌): పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌ల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్‌ చేయించుకోవడం ఐదేళ్లకోసారి తప్పనిసరి. దీనిలో భాగంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సంస్థలకు సంబంధించి ఈనెల 31వ తేదీ లోగా రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంది. ఇందుకోసం భీమవరంలోని జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సిబ్బంది ఆన్‌లైన్‌లో రెన్యువల్‌ చేస్తున్నారు. 2020 సెప్టెంబరు 20 వరకు రెన్యువల్‌ ప్రక్రియ కాగితాలపైనే జరగగా, 2022 సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి ఈ ప్రక్రియను ప్రభుత్వం ఆన్‌లైన్‌ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో మ్యాన్యువల్‌గా రెన్యువల్‌ చేయించుకున్న వారు ఆ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌ చేసుకొవాలని వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఈ పత్రాలు అవసరం : ఆస్పత్రి లేదా క్లినిక్‌, ల్యాబ్‌కు సంబంధించి భవనం ప్లాన్‌, ఫైర్‌, సెల్ఫ్‌ ఆఫిడవిట్‌, నోటరీ, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, వైద్యుల వివరాలు, బెడ్‌ల వివరాలు, సొంత భవనం అయితే పన్ను కట్టిన రశీదు, సౌకర్యాలు తదితర వాటిని రెన్యువల్‌ చేసే సమయంలో సమర్పించాలి.

రెన్యువల్‌ చేయించకపోతే.. ఐదేళ్ల రెన్యువల్‌ గడువు ముగిసి తిరిగి రెన్యువల్‌ చేయకుండా వైద్య సేవలు అందిస్తే సదరు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌ల యాజమాన్యాలపై అధికారులు ఏపీఎంసీఈ చట్టం ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక రెన్యువల్‌ చేయించుకోకుండా వైద్య సేవలు అందించినప్పుడు రోగులకు చికిత్స వికటిస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు.

రెన్యువల్‌ ఫీజు వివరాలు

ఆస్పత్రి బెడ్‌ల సంఖ్య ఫీజు (రూ.లలో)

నర్సింగ్‌ హోమ్‌ 0–20 3,750

21–50 7,500

51–100 10,000

101–200 15,000

200పైన 37,500

సాధారణ క్లినిక్‌ 1,250

పాలి క్లినిక్‌ 2,500

ల్యాబ్‌/స్కానింగ్‌ సెంటర్‌/

ఫిజయోథెరపి/సాధారణ ల్యాబ్‌ 2,500

పరికరాలు ఎక్కువగా ఉంటే 10,000

ఫిజియోథెరపి యూనిట్‌ 3,750

ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్‌ 25,000

జెనిటిక్‌ కౌన్సెలింగ్‌ స్కానింగ్‌ సెంటర్‌ 35,000

జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌ల వివరాలు

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు తదితర 363 రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు ఉన్నాయి. వీటిలో ఆస్పత్రులు 211, ల్యాబ్‌లు 106, క్లినిక్‌లు 46 ఉన్నాయి. ఇవి కాక స్కానింగ్‌ సెంటర్లు మరో 121 వరకు ఉన్నాయి.

ఈ నెలాఖరులోగా రెన్యువల్‌ చేసుకోవాలి

జిల్లాలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌ల రిజిస్ట్రేషన్లను ఈ నెలాఖరులోగా రెన్యువల్‌ చేయించుకోవాలి. రెన్యువల్‌ చేయకుండా వైద్య సేవలు అందిస్తే చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. అన్ని పత్రాలు అందుబాటులో ఉంచుకుని ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే రెన్యువల్‌ చేసుకోవాలి. రెన్యువల్‌కు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ కార్యాలయంలో సిబ్బందిని అడిగి తెలుసుకోవాలి.

– డాక్టర్‌ డి.మహేశ్వరరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ, భీమవరం

>
మరిన్ని వార్తలు