చెరువు తవ్వకాలపై అటవీ శాఖ దాడులు

27 Mar, 2023 00:40 IST|Sakshi
పైడిచింతపాడులో సీజ్‌ చేసిన పొక్లెయిన్‌

ఏలూరు రూరల్‌: అభయారణ్యంలో చెరువు అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. ఏలూరు మండలం పైడిచింతపాడు పరిధిలో కొందరు వ్యక్తులు శనివారం రాత్రి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పొక్లెయిన్‌, బ్లేడ్‌ ట్రాక్టర్లతో చెరువు తవ్వకాలు చేస్తున్నారు. పైడిచింతపాడు పరిసరాల్లో సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణం కల్గిన ఈ చెరువును ఏడాది క్రితం తవ్వగా, అప్పట్లో అధికారులు అడ్డుకుని, చెరువు గట్లు తొలగించి పలువురిపై కేసులు నమోదు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే చెరువుకు గట్లు వేసే పనులు చేస్తుండటాన్ని తెలుసుకున్న అధికారులు, సిబ్బంది తవ్వకాలను ఆదివారం అడ్డుకున్నారు. అక్రమార్కులు పారిపోయారని, రెండు పొక్లెయిన్లు సీజ్‌ చేశామని అటవీ శాఖ రేంజర్‌ ఎస్వీ కుమార్‌ చెప్పారు. అభయారణ్యంలో తవ్వకాలు చేపట్టే అక్రమార్కులను ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

యువకుడిపై పోక్సో కేసు

నరసాపురం రూరల్‌: ప్రేమపేరుతో బాలికను వంచించి పలుమార్లు అత్యాచారం చేసిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.విశ్వనాథ్‌ ఆదివారం చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వేములదీవి తూర్పు పంచాయతీ సరుదుకొడపకు చెందిన ఒడుగు లక్ష్మణప్రసాద్‌, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

17 మంది జూదరుల అరెస్టు

కాళ్ల: పెదఅమిరం శివారులో కోడి పందేల స్థావరంపై దాడి చేసి 17 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆకివీడు సీఐ గీతారామకృష్ణ చెప్పారు. నిందితుల నుంచి రూ.64,830 నగదు, 5 కోళ్లు, ఒక కారు, 4 బైక్‌లు, 14 సెల్‌ ఫోన్లు, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు