గోదావరిలో ఘనంగా అమ్మవార్ల తెప్పోత్సవం

28 Mar, 2023 00:38 IST|Sakshi
యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తెప్పోత్సవం కోసం ఏర్పాట్లు

యలమంచిలి: దొడ్డిపట్ల గ్రామ దేవతలు మాణిక్యాలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్లకు ఉగాది సందర్భంగా జాతర ఉత్సవాలలో ఆదివారం రాత్రి వశిష్ట గోదావరి నదిలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పులు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు, శ్రీ చక్రానికి వశిష్ట గోదావరి నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల ఆలయాలను విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉగాది రోజున ప్రారంభమైన ఉత్సవాలు ఐదు రోజులపాటు జరిగాయి. భక్తులు ఈ ఐదు రోజులు అమ్మవార్లకు చలివిడి, పానకాలు సమర్పించారు. ఆలయ అర్చకులు చేబ్రోలు సుబ్బరాయశర్మ బ్రహ్మత్వంలో అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

మరిన్ని వార్తలు