క్షయ నివారణలో జాతీయ అవార్డు

28 Mar, 2023 00:38 IST|Sakshi
కాళ్లకూరు వెంకన్న ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహిస్తున్న దృశ్యం

ఏలూరు(మెట్రో): క్షయవ్యాధి రహిత దిశగా పురోగతి సాధించినందుకు ఏలూరు జిల్లా జాతీయ అవార్డు పొందడం ఆనందదాయకమని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణలో ఏలూరు జిల్లా బంగారు పతకం పొందిన సందర్బంగా సోమవారం కలెక్టరేట్‌ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా క్షయ నివారణ అధికారి జి.రత్నకుమారిని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సత్కరించి అభినందించారు. సంబంధిత వైద్యాధికారులను, సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో క్షయ విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విషయంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. 2025 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా అంతం చేసే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, డీఎంహెచ్‌ఓ డా.డి.ఆశ, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

కాళ్లకూరు వెంకన్న ఆదాయం రూ.14.55 లక్షలు

కాళ్ల: కాళ్లకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామికి హుండీల ద్వారా రూ.14,55,589 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈఓ చాగంటి సురేష్‌ నాయుడు తెలిపారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ దండు వెంకట కృష్ణంరాజు, భీమవరం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఈఓ కృష్ణంరాజు, ధర్మకర్తలు, భక్తుల సమక్షంలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 66 రోజులకు హుండీ ఆదాయం లెక్కించినట్లు ఆయన తెలిపారు. ఏలూరుపాడు జ్ఞానానంద పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు, మహిళా భక్త బృందం సభ్యులు, గ్రామ పెద్దలు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

ఇంటర్‌ పరీక్షలకు 33,752 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్‌ థియరీ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఫిజిక్స్‌–2, ఎకనామిక్స్‌–2 పరీక్షలకు 106 కేంద్రాల్లో మొత్తం 34870 మంది విద్యార్థులకు 33752 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 39 కేంద్రాల్లో 11,176 మంది జనరల్‌ విద్యార్థులకు గాను 10813 మంది హాజరు కాగా, 1618 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 1481 మంది హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 52 కేంద్రాల్లో 15,583 మంది జనరల్‌ విద్యార్థులకు 15,194 మంది హాజరు కాగా 389 మంది గైర్హాజరయ్యారు. 1544 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 1438 మంది హాజరు కాగా 106 మంది గైర్హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో 15 కేంద్రాల్లో 4,270 మంది జనరల్‌ విద్యార్థులకు 4,189 మంది హాజరు కాగా 81 మంది గైర్హాజరయ్యారు. 679 ఒకేషనల్‌ విద్యార్థులకు 637 మంది హాజరు కాగా 42 మంది గైర్హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా యండగండి కేంద్రంలో పిప్పర జూనియర్‌ కళాశాలకు చెందిన ఒక విద్యార్థి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా స్క్వాడ్‌ పట్టుకున్నారని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.చంద్రశేఖర బాబు తెలిపారు.

హుండీ లెక్కింపు

నరసాపురం రూరల్‌: ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 41 రోజులకు రూ.10,60,400 ఆదాయం లభించినట్టు ఈవో డి.రామృక్ణంరాజు తెలిపారు.

>
మరిన్ని వార్తలు