కళాకృతుల తయారీలో నైపుణ్యం సాధించాలి

28 Mar, 2023 00:38 IST|Sakshi
గిరిజన హస్త కళాకారులకు పనిముట్లు అందజేస్తున్న దృశ్యం

బుట్టాయగూడెం: గిరిజన హస్త కళాకారులకు వివిధ కళాకృతుల తయారీపై నైపుణ్యం సాధించేలా శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఆర్థికాభివృద్ధి చెందేలా కృషి చేస్తామని హస్తకళా అభివృద్ధి అధికారి ఎమ్‌.సులోచన అన్నారు. ఐటీడిఏ పరిధిలోని గిరిజన గ్రామాల్లో సుమారు 100 మంది గిరిజన హస్త కళాకారులకు సోమవారం కేఆర్‌పురం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హస్త కళాకృతుల తయారీకి వినియోగించే పనిముట్ల కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ హస్తకళల తయారీపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి వారు మరింత నైపుణ్యం సాధించేలా శిక్షణలు ఇస్తామన్నారు. వెదురు, నూలుదారం, లేసులతో అల్లికలు, ఖాళీ కాగితపు అట్టలతోపాటు అందుబాటులో ఉన్న వివిధ వస్తువులతో రకరకాల గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులు తయారు చేసేలా శిక్షణలు ఇచ్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర హస్తకళాభివృద్ధి కమిషన్‌, టెక్స్‌టైల్స్‌, మంత్రిత్వశాఖ ద్వారా ఏపీ ఇండస్ట్రియల్‌, టెక్నికల్‌ కన్సల్టెన్సీ సంస్థ(అపిట్కో) ఆధ్వర్యంలో ఈ శిక్షణలు ఇచ్చి గిరిజన కళాకారులను మరింత ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వెలుగు ఏపీడీ ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ శిక్షణలు పొందిన గిరిజన కళాకారులు వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అర్హులైన వారికి అవసరమైతే వెలుగు ద్వారా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. షేడ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పీడీ సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉండే వెదురు తయారీ కళాకారులకు నాణ్యమైన పనిముట్లు ఇవ్వడం ద్వారా సమయం ఆదాయం అవ్వడంతో పాటు వెదురు కళాకృతులు కూడా ఎక్కువగా తయారు చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో కేఆర్‌పురం సర్పంచ్‌ ఉయికే బొజ్జి, ఎంపీటీసీ సభ్యులు గాలి దుర్గారావుతో పాటు పలువురు హస్తకళాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు