బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

28 Mar, 2023 00:40 IST|Sakshi

ఏలూరు టౌన్‌/కామవరపుకోట: జిల్లాలోని టి.నరసాపురం మండలం తెడ్లెం గ్రామానికి చెందిన బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి చంపుతామంటూ బెదిరించిన కేసులో ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్‌.ఉమాసునంద సోమవారం తుదితీర్పు వెలువరించారు. కామవరపుకోట మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన కోట నవీన్‌, అదే గ్రామానికి చెందిన తాళ్లూరి రాజశేఖర్‌ అలియాస్‌ సొంగ తంబి అలియాస్‌ తాళ్లూరి తంబి అనే ఇద్దరికీ జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చారు.

బాలికను నమ్మించి..

ఏడో తరగతి చదివిన తెడ్లెం గ్రామానికి చెందిన బాలిక కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. 2016వ సంవత్సరంలో బాలిక నాన్నమ్మ గ్రామం గుంటుపల్లికి వెళ్లి అదేరోజు రాత్రి సుమారు 7.55 గంటలకు తన స్వగ్రామం వెళుతోంది. మార్గమధ్యంలో బాలికకు బంధువులైన గుంటుపల్లికి చెందిన నవీన్‌, తంబిలు ‘మీ నాన్నవద్దకు పంపుతాం’ అని నమ్మించారు. మద్యం సేవించి ఉన్న వారిద్దరూ బాలిక అరవకుండా ఆమె నోటిలో చున్నీ పెట్టి సమీపంలోని పాకలోకి తీసుకెళ్లారు. తెల్లవారుజాము వరకు ఆమైపె పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. కొన్ని రోజులకు బాలిక పరిస్థితిపై అమ్మమ్మకు అనుమానం వచ్చి ఆరా తీయగా విషయం బయటపడింది. ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించగా బాలిక గర్భిణిగా నిర్థారించారు. తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నాటి ఎస్సై జి.విశ్వనాధం కేసు నమోదు చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు కేసు విచారణ పూర్తిచేసి కేసు చార్జిషీటును కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తేతలి శశిధర్‌రెడ్డి సాక్షాలను కోర్టువారికి నివేదించి ముద్దాయిలకు జీవితఖైదు విధించటంలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ పి.బాలసురేష్‌బాబు, దిశా పోలీస్‌స్టేషన్‌ ఏలూరు సీఐ కె.ఇంద్రశ్రీనివాస్‌, తడికలపూడి ఎస్సై కె.వెంకన్న, కోర్టు హెచ్‌సీ కె.కొండలరావును ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అభినందించారు.

మరిన్ని వార్తలు