సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

14 Nov, 2023 01:04 IST|Sakshi
17న నూజివీడు రానున్న సీఎం జగన్‌

నూజివీడు: నూజివీడులో ఈ నెల 17న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు సోమవారం పరిశీలించారు. మైలవరం రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. విస్సన్నపేట రోడ్డులోని ముఖ్యమంత్రి సభను నిర్వహించే మామిడి పరిశోధన స్థానం పక్కనే ఉన్న సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని కూర్చునేందుకు కనీసం 20 వేల కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయాన్ని కల్పించాలన్నారు. పార్కింగ్‌ స్థలాల నుంచి సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం అన్నవరం క్రికెట్‌ గ్రౌండ్‌ సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 400 నుంచి 500 బస్సులలో ప్రజలు సభకు వస్తున్నందున బస్సులన్నీ ఆగేందుకు ఎంపిక చేసిన స్థలంలోని పొదలను, పిచ్చి చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించే పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో విస్సన్నపేట వైపు నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మళ్లించాలన్నారు. పట్టణంలోని మైలవరం రోడ్డులోని హెలిప్యాడ్‌ వద్ద నుంచి సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక బస్సులో వస్తారని.. పెద్దగాంధీబొమ్మ సెంటర్‌ వద్ద నుంచి బైపాస్‌ రోడ్డు వరకు ఎక్కడా కూడా గుంతలు లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సబ్‌కలెక్టర్‌ ఆదర్ష్‌ రాజీంద్రన్‌, డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు