రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

21 Nov, 2023 01:22 IST|Sakshi

ఆగిరిపల్లి: పోతవరప్పాడు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆగిరిపల్లి ఎస్సై నంబూరు చంటిబాబు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 20 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి మూడు రోజుల నుంచి మతిస్థిమితం లేక చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారన్నారు. పోతవరప్పాడు వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బస్సులో చోరీపై కేసు నమోదు

ఏలూరు టౌన్‌: బస్సులో ఓ ప్రయాణికురాలి బ్యాగ్‌ నుంచి బంగారు ఆభరణాల చోరీకి గురికాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ పోలీసులు తెలిపారు. లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన కంచన భవానీ మచిలీపట్టణంలోని తన అత్త ఇంటి నుంచి ఈనెల 15న బస్సులో తన స్వగ్రామమైన వేములపల్లి బయలుదేరారు. ఏలూరు పాత బస్టాండ్‌లో బస్సు దిగి, జంగారెడ్డిగూడెం వెళ్లే బస్సు ఎక్కారు. అయితే బస్సు ఎక్కుతున్న క్రమంలో మహిళకు ఎదురుగా మరోకరి చెయ్యి బ్యాగ్‌కు తగిలింది. బస్సు ఎక్కిన అనంతరం మహిళ తన బ్యాగ్‌ను పరిశీలించగా 6 కాసుల బంగారు ఆభరణాలు, నాలుగు తులాల వెండి వస్తువులు, కొంత నగదు కనిపించలేదు. ఎవరో అపహరించారని గుర్తించిన బాధితురాలు సోమవారం ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు

ఏలూరు టౌన్‌: ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి ఒక బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమెను పట్టించుకోకపోవడంతో బాధితురాలు ఏలూరు టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. ఏలూరులో గన్‌బజార్‌కు చెందిన ఒక మహిళతో దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గోవాడ నాగాంజనేయులు గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. వారికి ఒక బిడ్డ కూడా జన్మించింది. ఇల్లు కడుతున్నానని ఆమె వద్ద నుంచి రూ.3 లక్షలు నగదును తీసుకున్నాడు. కట్టిన ఇంట్లోకి ఆమెను, ఆమె బిడ్డను ఇంట్లోకి తీసుకువెళ్ళకుండా మానసికంగా బాధించటంతో ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నాగాంజనేయులుపై పోలీసులు చీటింగ్‌ కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు