పనులు ప్రారంభించకపోతే బ్లాక్‌లిస్ట్‌

21 Nov, 2023 01:22 IST|Sakshi

ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రభుత్వ పనులు నిర్ణీత సమయంలో చేపట్టని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం జిల్లాలో రోడ్లు, ప్రాధాన్యతా భవనాలు, జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత శాఖల ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ ద్వారా జాతీయ రహదారుల విభాగంలో 5 రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యి ఎల్‌.ఓ ఇచ్చిన 7 రోజులలోగా అగ్రిమెంట్‌ చేయాల్సిన కాంట్రాక్టర్లు 45 రోజులు పూర్తి కావస్తున్న అగ్రిమెంట్లు పూర్తిచేయకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని, నోటీసులకు స్పందించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచాలని ఆదేశించారు. అధిక ప్రాధాన్యత గల రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హెచ్చరించారు. అలసత్వం వహించే సిబ్బందికి ఇంక్రిమెంట్‌ నిలిపివేయాలని ఆదేశించారు. చేబ్రోలులో జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో ఉత్తమ సేవలందించిన గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్‌ అధికారి విజయరాజు, డ్వామా పీడీ రాము, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్‌, సూపరింటెండెండింగ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు