బాబుకు దురద ఎందుకు? : కొట్టు సత్యనారాయణ

22 Dec, 2023 13:20 IST|Sakshi
తాడేపల్లిగూడెంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ సత్తు రూపాయలే..

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

ఏలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అభ్యర్థుల ఎంపికలో చేర్పులు మార్పులు చేసుకుంటే చంద్రబాబుకు ఎందుకు దురదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఇద్దరూ సత్తు రూపాయలేనని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలకు అనుగుణంగా వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారని చెప్పారు. జగన్‌ ఎత్తుగడలు చూసి చంద్రబాబు, పవన్‌లకు గంగవెర్రులెత్తుతుందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎవరిని పెట్టుకోవాలనేది జగన్‌ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా విభజించారని అన్నారు. దానికి అనుగుణంగానే జిల్లాలు మారుతాయని, మార్పులు చేర్పులు ఉంటాయని కొట్టు తెలిపారు. సొంతంగా పోటీ చేసే సత్తాలేక 25 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్ల కోసం చంద్రబాబుకు పవన్‌కల్యాణ్‌ మోకరిల్లాడని దుయ్యబాట్టారు. చంద్రబాబు కూడా తనకు అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా వారికి టిక్కెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు.

అభ్యర్థులను పెట్టలేని దుస్థితిలో టీడీపీ, జనసేన
అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టలేని దుస్థితిలో టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయన్నారు. తమ పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రం 2024లో జరిగే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి మార్పులు, చేర్పులు చేస్తున్నారన్నారు. వాటిని తాము స్వాగతిస్తున్నామని మంత్రి కొట్టు చెప్పారు.

పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీ పరంగా ఏ మార్పులు చేయాలో ఎలా నూరుశాతం ఓట్లు సాధించాలో జగన్‌కు తెలుసన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఎవరిని పోటీకి పెట్టాలో తెలియక తెదేపా, జనసేన అయోమయంలో ఉన్నాయన్నారు. జగన్‌ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఎన్నికల సమయంలో అక్కడక్కడా చేర్పులు, మార్పులు సహజమన్నారు.

తెదేపా, జనసేన పార్టీలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పట్ల ఇష్టానుసారం మాట్లాడటం గురువింద గింజ మాదిరిగా ఉందన్నారు. చంద్రబాబు కుప్పం నుంచి చంద్రగిరికి ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వంగలపూడి వనితను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు తీసుకువచ్చి ఎందుకు పోటీ చేయించారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అండగా నిలుస్తుందనే లక్ష్యంతో జగన్‌ మార్పులు చేర్పులు చేసుకుంటున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
ఇవి కూడా చ‌ద‌వండి: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు : మజ్జి శ్రీనివాసరావు

>
మరిన్ని వార్తలు