మీరిచ్చిందే.. మీ బిడ్డ ధైర్యం

18 Nov, 2023 04:43 IST|Sakshi

నూజివీడు సభలో ముఖ్యమంత్రి జగన్‌

తోడేళ్లన్నీ ఏకమైనా సింహం ఒంటరిగానే వస్తుంది

గజదొంగల ముఠా, దత్తపుత్రుడి అబద్ధాలను నమ్మకండి

ఎన్నికల్లో కేజీ బంగారం, ఇంటికో బెంజ్‌ కారు ఇస్తామంటారు

2014లో వాళ్లు ఏం చెప్పారో.. తర్వాత ఏం చేశారో గుర్తు చేసుకోండి

చంద్రబాబు ఎన్నడూ ప్రజలకు మంచి చేసి సీఎం కుర్చీలో కూర్చోలేదు

బాబు పాలనలో ప్రాంతాలకు, సమాజంలో మనుషులకు తీవ్ర అన్యాయం

మిగతా సామాజిక వర్గాలంటే ఆయనకు ఎంత చులకనో గుర్తు తెచ్చుకోండి

ఏమాత్రం కమిట్‌మెంట్‌ లేని వ్యక్తి ఎవరికి మేలు చేయగలుగుతాడు?

మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీ బిడ్డ ఎవరికీ భయపడడు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోడు. మీ బిడ్డ పొత్తు ప్రజలతోనే. ఎన్నికలు సమీపిస్తుండటంతో గజదొంగల ముఠా, దత్తపుత్రుడు అంతా ఏకమై ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తు­న్నారు’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ సీఎం చంద్రబాబు ఏనాడూ ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రాలేదని, వంచనతోనే పదవి దక్కించుకున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

ఆ అన్యాయాలను గుర్తు తెచ్చుకోండి..
గత ముఖ్యమంత్రి (చంద్రబాబు నాయుడు) మాది­రిగా తన వర్గం, తన వాళ్లు, గజదొంగల ముఠా, దత్తపుత్రుడి కోసం ప్రజలందరి ప్రయోజనా­లను తాకట్టు పెడితే సామాజిక అన్యాయం జరు­గుతుంది. గజదొంగల ముఠా, జన్మభూమి కమిటీల కోసం దోచు­కోవాలని భావించే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చుంటే ఏం న్యాయం చేస్తాడో మనమంతా చూశాం. రైతులు, అక్క చెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఎంత అన్యాయం చేశాడో చూశాం. 2014 నుంచి 2019 వరకు ఆ ఐదేళ్లలో ప్రత్యక్ష సాక్షులుగా అవన్నీ గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. 

ప్రాంతాలకు, సమాజంలో మనుషులకు అన్యాయం చేసిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు గురించి మరో రెండు మాటలు కూడా చెబుతా. చంద్రబాబు ఎన్నడూ ప్రజలకు మంచి చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదు. ఆయన తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో లేక చేసిన మంచి పనుల వల్లనో ఏనాడూ సీఎం కాలేదు. ఆ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కూతుర్ని ఇచ్చిన మామ ఎన్టీ రామా­రావుకు వెన్నుపోటు పొడిచి మొట్టమొదటి­సారి సీఎం అయ్యాడు. 

రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యమా అని సీఎం అయ్యాడు. రైతన్న­లకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మ­లకు రుణమాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని, జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 2014లో మూడోసారి సీఎం అయ్యాడు. ఆ తర్వాత రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలను కూడా వదలకుండా ఎంత మోసం చేశాడో చూసిన ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు గూబ గుయ్‌మనిపించేలా 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు. 

అలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్మగలరా?
మిగతా సామాజిక వర్గాలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఆయన పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నా. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..? అని ఆయన అన్న మాటలను గుర్తు తెచ్చుకోండి. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్‌! అంటూ బెదిరించిన వైనాన్ని గుర్తు తెచ్చుకోండి. 

ఇదే పెద్దమనిషికి అక్క చెల్లెమ్మల మీద ఉన్న చులకన భావనను కూడా గుర్తు తెచ్చుకోండి. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా..? అంటూ చులకనగా వ్యాఖ్యానించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అసలు సమాజం మీద ప్రేమ గానీ రైతుల పట్ల గౌరవం గానీ అక్కచెల్లెమ్మల సాధికారత, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కమిట్‌మెంట్‌ గానీ లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు? ఎప్పుడైనా మేలు చేశాడా? ఇలాంటి వారిని అసలు నమ్మగలరా? 

విజ్ఞతతో ఆలోచించండి..
రాబోయే రోజుల్లో ఆయన అబద్ధాలు, మోసాలు ఎక్కువ అవుతాయి. ఆయనకు తోడు గజదొంగల ముఠా! ఆ ముఠాకు తోడు దత్త పుత్రుడు ఏకమవుతారు. వీరందరూ కలసి ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తారు. ప్రతి ఇంటికీ బంగారం, బెంజ్‌ కారు కూడా ఇస్తామంటారు. వాటిని విని మోసపోకండి. ఆ అబద్ధాలను నమ్మకండి. గతంలో ఇదే పెద్ద మనుషులిద్దరూ కలిసి వచ్చి 2014లో ఏం చెప్పారు? వాటిని అమలు చేశారా లేదా? అని ఆలోచించి విజ్ఞతతో అడుగులు ముందుకు వేయాలి. 

తోడేళ్లంతా ఏకమైనా.. ఒంటరిగానే సింహం
వీళ్ల మాదిరిగా నాకు అబద్ధాలు చెప్పడం చేతకాదు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు కుట్రలు, కుతంత్రాలు చేయడం తెలియదు. మీ బిడ్డ మోసం చేయడు, అబద్ధాలు ఆడడు. ఇది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. మీ బిడ్డకు వారి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి సపోర్టు లేదు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అని మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు.. మీ బిడ్డ పొత్తు కేవలం మీతోనే ఉంటుంది. తోడేళ్లు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒంటరిగానే నడుచుకుంటూ వస్తుంది. 

మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ ధైర్యం మీ దగ్గర నుంచే వచ్చింది. నేను దేవుడిని నమ్ముతా. మీ ఆశీస్సుల మీద ఆధారపడతా. ఇవే మీ బిడ్డకు ధైర్యాన్ని ఇస్తాయి. సీఎం సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు మిథున్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్, కృష్ణా, ఏలూరు జిల్లాల ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప అప్పారావు,  తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, సామినేని ఉదయభాను, జెడ్పీ చైర్‌పర్సన్లు ఘంటా పద్మశ్రీ, ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. 

నూజివీడులో పల్ప్‌ యూనిట్, ప్రాసెసింగ్‌ ప్లాంట్‌
ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు కోరినట్లుగా 16 వార్డు సచివాలయాల పరిధిలో పనులకు ఒక్కో సచివాలయానికి రూ.కోటి చొప్పున రూ.16 కోట్లు కేటాయిస్తున్నాం. రూ.275 కోట్లతో మ్యాంగో పల్ప్‌ యూనిట్, ప్రాసెసింగ్‌ ప్లాంట్‌కు త్వరలో పునాది రాయి వేయబోతున్నాం. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. 

మరిన్ని వార్తలు