How To Manage StressStress: పేరెంట్స్‌, టీచర్స్‌ వల్ల యాంగ్జయిటీకి గురవుతున్న స్టూడెంట్స్‌

22 Sep, 2023 16:43 IST|Sakshi

కిషోర్‌ చాలా తెలివైన విద్యార్థి. టెన్త్‌ ్త క్లాస్‌లో 10జీపీఏతో పాసయ్యాడు. దాంతో ఒక కార్పొరేట్‌ కాలేజీవాళ్లు ఫ్రీ సీట్‌ ఇచ్చారు, హాస్టల్‌తో సహా. కానీ హాస్టల్‌కి వెళ్లాక కిషోర్‌ జీవితమే మారిపోయింది. పొద్దున్నే ఐదు గంటలకు లేస్తే బెడ్‌ ఎక్కేసరికి రాత్రి 11 గంటలవుతుంది. ప్రతిరోజూ ఇదే పరిస్థితి. మరోవైపు ఫ్రీ సీట్‌ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి. మార్కులు తగ్గితే ఫ్రీ సీట్‌ కేన్సిల్‌ చేస్తారని, ఫీజు మొత్తం చెల్లించాల్సి వస్తుందని పేరెంట్స్‌ ఒత్తిడి. ఈ మధ్యకాలంలో కాలేజీలో మోటివేషన్‌ క్లాస్‌ పెట్టించారు. ఆ స్పీకర్‌ చెప్పినట్లు తాను సాధించలేకపోతే ఎలా? అంటూ కిషోర్‌లో ఒత్తిడి మరింత పెరిగింది.

ఒకరోజు కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని హుటాహుటిన హాస్పిటల్లో చేర్పించి పేరెంట్స్‌కి  ఫోన్‌ చేసింది. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినా కిషోర్‌ అనారోగ్యానికి కారణం తెలియలేదు, ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గడం లేదు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న శిరీషది మరో రకమైన సమస్య. రెగ్యులర్‌ స్లిప్‌ టెస్టులతో ఎలాంటి సమస్యా లేదు.

ఫైనల్‌ ఎగ్జామ్‌ అనేసరికి తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది. హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టెన్త్‌ క్లాస్‌లో అలాగే హాస్పిటల్‌ నుంచి వెళ్లి పరీక్షలు రాసి 8జీపీఏతో గట్టెక్కింది. ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ అదే సమస్య. ఇప్పుడు ఇంటర్మీడియట్‌ సెకండియర్‌లోనూ అదే సమస్య ఎదురవుతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. నీట్‌ పరీక్ష సమయంలో ఇలా జ్వరం వస్తే ఏం చేయాలని కంగారు పడుతున్నారు. 

కిషోర్, శిరీష అంత సీరియస్‌ కాకపోయినా చాలామంది విద్యార్థులకు పరీక్షలంటే కొద్దిపాటి ఆందోళన లేదా భయం ఉంటుంది. దీన్నే టెస్ట్‌ యాంగ్జయిటీ అంటారు. తాను పరీక్షల్లో సరిగా పెర్ఫార్మ్‌ చేయలేనేమో, ఫెయిల్‌ అవుతానేమోనని స్టూడెంట్స్‌ ఆందోళన చెందుతుంటారు. ఒక మోతాదు వరకు టెస్ట్‌ యాంగ్జయిటీ ఉండటం మంచిదే. అది పరీక్షలకు సిద్ధమయ్యేలా చేస్తుంది. మోతాదు మించితేనే రకరకాల సమస్యలకు దారి తీస్తుంది.

విద్యార్థుల్లో టెస్ట్‌ యాంగ్జయిటీకి ప్రధాన కారణం తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి. పరీక్షల్లో తప్పితే లేదా మంచి మార్కులు రాకపోతే భవిష్యత్తు ఉండదని పదేపదే చెప్పడం వల్ల కొంతమంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సరిగా ప్రిపేర్‌ కాకపోవడం లేదా గత పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడం వల్ల కూడా పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. ఆ పరీక్షలు తప్పించుకునేందుకు మనసు రకరకాల వేషాలు వేస్తుంది. అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. 


టెస్ట్‌ యాంగ్జయిటీ లక్షణాలు: విద్యార్థుల్లో టెస్ట్‌ యాంగ్జయిటీ అనేది రకరకాల రూపాల్లో కనిపిస్తుంది. శారీరక, భావోద్వేగ, కాగ్నిటివ్‌ లక్షణాలుంటాయి. 
శారీరక లక్షణాలు:  తలనొప్పి, కడుపునొప్పి, జ్వరం, విపరీతమైన చెమట, ఊపిరి ఆడకపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, తలతిరగడం, స్పృహ తప్పి పడిపోవడం. 
భావోద్వేగ లక్షణాలు: ఒత్తిడి, భయం, నిస్సహాయత, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, గతంలో పరీక్ష తప్పిన ఘటనలు పదే పదే గుర్తుకు రావడం, పరీక్ష తప్పితే తల్లిదండ్రుల ప్రవర్తన గురించిన ఆలోచనలు, ఫ్రెండ్స్‌ ఎలా ఎగతాళి చేస్తారోననే భయం. 
ప్రవర్తనా/అభిజ్ఞా లక్షణాలు: ఏకాగ్రత లోపించడం, వాయిదా వేయడం, ఇతరులతో పోల్చుకుని ఆత్మన్యూనతగా ఫీలవ్వడం. 

టెస్ట్‌ యాంగ్జయిటీని ఎలా తగ్గించాలి?
∙పరీక్షలకు ముందు.. బాగా చదవడానికి వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. చదవాల్సిన సిలబస్‌ను చిన్నచిన్న భాగాలుగా చేసుకుంటే త్వరగా నేర్చుకోవచ్చు, ఒత్తిడి తగ్గుతుంది 
∙చాలామంది విద్యార్థులకు ఎలా చదివితే గుర్తుంటాయో తెలియకే బోల్తాపడుతుంటారు. అందువల్ల ముందుగా ఎఫెక్టివ్‌ స్టడీ స్ట్రాటజీస్‌ నేర్చుకుని, వాటి ప్రకారం చదువుకోవాలి.
∙కాఫీ, టీలు మానేసి సమయానికి తినడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఒత్తిడి నుంచి శరీరాన్ని, మనస్సును కాపాడుకునేందుకు జాకబ్సన్‌ ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్‌ ఎక్సర్సైజ్‌ రోజూ ప్రాక్టీస్‌ చేయండి.
పరీక్షకు ముందురోజు నైట్‌ అవుట్‌ చేయకుండా, కచ్చితంగా 7–9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి.
మీ ఆందోళన మరింత పెరగకుండా ఉండేందుకు పరీక్ష సెంటర్‌కి.. ముందే చేరుకుని మీ సీట్లో కూర్చోండి ∙పరీక్షకు ముందు ఐదు నిమిషాలు దీర్ఘంగా  శ్వాస తీసుకోండి. ఐదు నిమిషాలు రిలాక్సేషన్‌ ఎక్సర్సైజ్‌ ప్రాక్టీస్‌ చేయండి 
∙మిమ్నల్ని మీరు గ్రౌండింగ్‌ చేసుకోండి. మీ చుట్టూ ఉన్నవారికన్నా మీరు మెరుగైనవారని విజువలైజ్‌ చేసుకోండి.
గతంలో మీరు బాగా పెర్ఫార్మ్‌ చేసిన పరీక్షలను గుర్తు చేసుకోండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. హాయిగా, ప్రశాంతంగా పరీక్ష రాయండి. 
టెస్ట్‌ యాంగ్జయిటీని తగ్గించుకోవాలంటే అత్యంత ముఖ్యమైంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మద్దతు. రిజల్ట్స్‌ కోసం విద్యార్థిపై ఒత్తిడి పెంచకుండా, బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ని ఇస్తే చాలని భరోసానివ్వాలి. సమస్య తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించాలి. 

మరిన్ని వార్తలు