పత్తిలో లాభదాయకంగా అంతర పంటల సాగు

14 Dec, 2021 16:37 IST|Sakshi

3 ఎకరాల్లో పత్తి సాళ్ల మధ్య కంది, పెసర, వేరుశనగ, మిరప, ఉల్లితో పాటు కూరగాయల ప్రకృతి సాగు

30 క్వింటాళ్ల పత్తితోపాటు 4 క్వింటాళ్ల పెసలు, 4 క్వింటాళ్ల కందులు, 1 క్వింటా వేరుశనగ, కూరగాయల దిగుబడి

మూడెకరాలకు పెట్టుబడి రూ. 50 వేలు, నికరాదాయం రూ. 2.6 లక్షలు ∙ సన్నకారు రైతు మహేశ్వరరెడ్డి విజయగాథ 

తోటి రైతులు రసాయనాలు వాడి కేవలం పత్తిని ఎకరానికి 8 క్వింటాళ్లు పండిస్తుంటే.. వీరంరెడ్డి మహేశ్వరరెడ్డి (43) అనే రైతు ప్రకృతి వ్యవసాయంలో 10 క్వింటాళ్ల పత్తితో పాటు అదనంగా కూరగాయలు, పప్పుధాన్యాలను సాగు చేస్తూ అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందటంతోపాటు తెలివిగా భూసారాన్ని కూడా పెంచుకుంటున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన ఆయన పదో తరగతి తర్వాత వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టారు. తమ మూడెకరాల వర్షాధార రేగడి భూమిలో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి, ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ విశేషంగా రాణిస్తున్నారు. మహేశ్వరరెడ్డి పొలం ప్రకృతి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంగా మారిపోయింది. తరచూ ‘పొలంబడి’ నిర్వహిస్తున్నారు. 

మొదట ఏడాది ఒక ఎకరంలో పత్తితోపాటు జొన్న, శనగ అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశారు. ఈ ఏడాది 3 ఎకరాల భూమిలో 8 బీటీ పత్తి సాళ్లకు 1 కంది సాలు వేశారు. సాళ్ల మధ్య 3.5 అడుగుల దూరం ఉంటుంది. అంతర పంటలుగా వేరుశనగ, కంది,పెసర, మిరప, ఉల్లి, సొర. బీర, బెండ. గోంగూరు, పాలకూర, చుక్కకూర సాగు చేశారు. పెంచుకుంటున్న నాటు ఆవు పేడ, మూత్రంతో ద్రవ, ఘన జీవామృతాలను, కషాయాలను  తయారు చేసుకొని వాడుతున్నారు. 

పత్తి ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా పత్తి రూ. 8 వేలకు గ్రామంలోనే అమ్ముతున్నారు. పత్తి ద్వారా రూ. 2.40 లక్షల వరకు ఆదాయం వస్తోంది. 4 క్వింటాళ్ల పెసర దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 8 వేల చొప్పున రూ. 32 వేలకు అమ్మారు. కంది కాపును బట్టి నాలుగు క్వింటాళ్ల కందులు అవుతాయని, రూ. 25 వేల వరకు ఆదాయం రావచ్చని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ, మిరప కాయలు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా మరో రూ.10 వేల వరకు ఆదాయం వచ్చింది. మహేశ్వరరెడ్డితో పాటు తల్లి, భార్య కూడా రోజూ పని చేస్తారు. పత్తి తీతకు తప్ప కూలీలను పిలవరు. మూడు ఎకరాలకు కలిపి రూ. 50 వేల వరకు పెట్టుబడి అయ్యింది. రూ. 3.10 లక్షల ఆదాయంలో రూ. 2.60 లక్షల నికరాదాయం పొందటం విశేషం. 

సాధారణంగా పత్తి పంట పూర్తి అయిన తర్వాత కట్టెను కాల్చివేస్తారు. మహేశ్వరరెడ్డి ట్రాక్టర్‌కు అమర్చిన యంత్రం ద్వారా పత్తి కట్టెను 2 అంగుళాల ముక్కలుగా చేసి నేలపై ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ఆ తర్వాత దుక్కి చేసినప్పుడు అవి భూమిలో కలిసి కుళ్లి పొలానికి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఏటా ఎకరాకు 400 కిలోల ఘన జీవామృతం వినియోగిస్తారు. 15 రోజులకోసారి ఎకరానికి 500 లీటర్ల ద్రవ జీవామృతం పోస్తున్నారు. పత్తి కట్టె, ఘన, ద్రవ జీవామృతాలే భూమిని సారవంతం చేస్తూ సిరులు కురిపిస్తున్నాయని మహేశ్వరరెడ్డి సంతోషంగా చెబుతున్నారు. 

పంటలకు చీడపీడలు, పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఖర్చు లేని సమగ్ర సస్య రక్షణ మార్గాలు అనుసరిస్తుండటం విశేషం. పసుపు, తెలుపు, నీలం జిగురు అట్టలు ఎకరాకు 10–15 వరకు వినియోగిస్తున్నారు.  లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేశారు. పంగల కర్రలు పాతడం వల్ల వాటిపై పక్షులు వాలి పురుగులను తినేస్తున్నాయి. పొలం చుట్టూ మూడు వరుసలు ఎర పంటగా జొన్న వేశారు. అప్పుడప్పుడూ వేప గింజల కషాయలు, నీమాస్త్రం ఉపయోగిస్తుండటం వల్ల చీడపీడల బెడద లేకుండా పోయింది. పత్తి వంటి వాణిజ్య పంటను సైతం తక్కువ ఖర్చుతో సాగు చేస్తూ స్థిరంగా నికరాదాయం పెంచుకోవచ్చని నిరూపిస్తున్న మహేశ్వరరెడ్డి ఆదర్శ ప్రాయుడు. – జి.శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్‌) 

దిగుబడితోపాటు నికరాదాయమూ ఎక్కువే!
ప్రకృతి వ్యవసాయం మొదటి రెండేళ్లు దిగుబడి అంతంత మాత్రంగానే ఉన్నా తర్వాత మెరుగైంది. పత్తిలో అంతర పంటలు చాలా రకాలు వేస్తున్నాం. కుటుంబం అంతా పని చేస్తాం. కూరగాయలు, పప్పులు కూడా పండించుకొని తింటున్నాం. గత ఏడాది కాలం కలసి వచ్చి ఎకరానికి 14 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావటంతో జూలైలో విత్తటం వల్ల పత్తి ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే, ఈ ఏడాది పత్తి ధర బాగుండటం వల్ల ఆదాయం బాగుంది.

కెమికల్‌ వాడనందున పెసరకు మంచి రేటు వచ్చింది. మూడెకరాలకు రూ. 2.60 లక్షల వరకు నికరాదాయం వచ్చింది. భూసారం పెరిగింది. మట్టి మెత్తబడింది. కొద్ది పాటి వర్షం పడినా చాలా రోజుల పాటు బెట్టకు రాకుండా తేమ నిలుస్తోంది. రసాయనాలు వాడే మిగతా రైతులు  ఒక్క పత్తి పంటే వేస్తారు. వారికి ఖర్చు నా కన్నా రూ.5–6 వేలు ఎక్కువే అయ్యింది. ఎకరాకు 8 క్వింటాళ్ల పత్తి పండింది. ప్రకృతి వ్యవసాయం నా కుటుంబానికి ఎంతో సంతోషాన్నిస్తోంది. – వి.మహేశ్వరరెడ్డి (99488 43247), పెంచికలపాడు, గూడూరు మం., కర్నూలు జిల్లా  

ఎఫ్‌.పి.ఓ.ల ఆదాయ మార్గాలపై ఆన్‌లైన్‌ శిక్షణ
రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌.పి.ఓ.ల) పుస్తక నిర్వహణ, ఆదాయ మార్గాలపై ఎఫ్‌.పి.ఓ.ల నిర్వాహకులకు సికింద్రాబాద్‌కు చెందిన వాటర్‌ లైవ్‌లీహుడ్‌ ఫౌండేషన్‌ శిక్షణ ఇవ్వనుంది. 2022 జనవరి 28, 29 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ శిక్షణ పొందగోరే వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఫీజు, తదితర వివరాలకు.. ఫోన్‌: 93988 81341, వాట్సప్‌: 99124 22572.

18న పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
పుట్టగొడుగుల పెంపకంపై ఈ నెల 18 (శనివారం) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట దగ్గర గల నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో రైతునేస్తం ఫౌండేషన్‌ శిక్షణ ఇవ్వనుంది. రాజమండ్రికి చెందిన ప్రముఖ పుట్టగొడుగుల రైతు కొప్పుల శ్రీలక్ష్మి శిక్షణ ఇస్తారు. ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. ఫీజు, రిజిస్ట్రేషన్‌ తదితర వివరాలకు 98493 12629, 70939 73999. 

మరిన్ని వార్తలు