ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?!

19 May, 2021 00:07 IST|Sakshi

‘‘దీనిని నేనెలా ఆపగలను! నాకింకా పదేళ్లే. ఎప్పుడేం జరుగుతుందోనని నాకు భయంగా ఉంటోంది. ఎవరూ ఇలా కాకుండా ఆపలేరా?’’ అని గాజాలోని ఒక పాలస్తీనా బాలిక కన్నీటితో ప్రశ్నిస్తున్న వీడియో క్లిప్‌ ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. జాతులు సృష్టిస్తున్న విధ్వంసంలో ఛిద్రమౌతున్న బాల్యానికి ప్రతీకలా ఉన్న ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?!

నదీన్‌ అబ్దెల్‌ తయూఫ్‌ పాలస్తీనా బాలిక. గాజాలో ఉంటోంది ఆమె కుటుంబం. గాజాపై ఇజ్రాయిల్‌ ప్రారంభించిన ప్రతీకార దాడుల్లో నదీన్‌ కుటుంబానికి తృటిలో మృత్యువు తప్పింది. ఉలిక్కిపడి ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి పరుగెత్తింది నదీన్‌. అదృష్టం ఆమెను ఎంతసేపు వెన్నంటి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం అంటే.. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, బంధువులు, చుట్టపక్కల ఇళ్లవాళ్లు, స్కూల్‌ టీచర్‌లు, స్కూల్లో ఫ్రెండ్స్‌.. వీళ్లందరితో కలిసి ఉండటం! రోజూ ఒకర్నొకరు చూసుకుంటూ, పలకరించుకుంటూ, సహాయాలు చేసుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ, టీచర్స్‌ని డౌట్స్‌ అడుగుతూ, ఇంటికి ఫ్రెండ్స్‌ని తెచ్చుకుంటూ, ఫ్రెండ్స్‌ ఇళ్లకు తను వెళుతూ.. ఇవన్నీ అదృష్టాలే. 


అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. ఏ క్షణమైనా గాజాలో బాంబులు పడొచ్చు. అంటే ఏ క్షణమైనా ప్రాణాలను లేదంటే ఆప్తుల్ని కోల్పోవచ్చు. ఐదు రోజుల క్రితం ఇజ్రాయిల్‌–పాలస్తీనాల మధ్య ఘర్షణ మొదలైంది. ఘర్షణ అనడం చిన్నమాట. యుద్దం అనాలి. గగన తలం నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. ఇజ్రాయిల్‌ గాజా మీద వేస్తోందా, గాజా ఇజ్రాయిల్‌ మీద వేస్తోందా అని కాదు నదీన్‌ ప్రశ్న! ‘‘దీన్నెవరూ ఆపలేరా? నేను చిన్నదాన్ని. పదేళ్లు నాకు. నేనేం చేయగలను?’’ అని మనసును కలచివేసేలా ఏడుస్తూ అడుగుతోంది. కాస్త జ్ఞానం కలిగినవాళ్లకు అది అడగడంలా అనిపించదు. మరి! నిలదీసినట్లుగా ఉంటుంది. 
∙∙ 
అవును! వీడియో క్లిప్‌లో నదీన్‌ అలా అడగడం.. ‘మీరు మనుషులేనా?’ అని అడిగినట్లుగానే ఉంటుంది మనసుతో చూడగలిగిన వారెవరికైనా! ‘మిడిల్‌ ఈస్ట్‌ ఐ’ అనే మీడియా సంస్థ ప్రతినిధి గాజాలోని శిథిలాల పక్కన నిశ్చేష్టురాలైన నిలుచుని ఉన్న నదీన్‌ని పలకరించినప్పుడు ఆమె అడిగిన ప్రతి మాటా ఒక శతఘ్ని గర్జించినట్లే ఉంది. ఆమె చెంపలపై జారిన ప్రతి కన్నీటి బిందువు ఉప్పొంగిన ఒక దుఃఖ సముద్రంలానే ఉంది! 1.19 నిముషాల ఆ వీడియో క్లిప్‌ మే 15 న ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ అయితే ఇప్పటి వరకు కోటీ ముప్పై లక్షల మందికి పైగా వీక్షించారు.


‘‘ఎప్పుడూ నాకు ఏదో జరగబోతున్నట్లే ఉంటుంది. ఎందుకో తెలీదు. ఇదంతా చూడండి. ఎలా కుప్పకూలి ఉందో. నేనేమీ చేయలేకపోతున్నాను. పోనీ, నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారో చెప్పండి. ఈ సమస్యని పరిష్కరించాలనా?! పదేళ్ల పిల్లని. ఏమాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు డాక్టర్‌ అవాలని ఉంది. లేదా ఇంకేదైనా. నా ప్రజలకు సహాయం చేయాలని ఉంది. ఇలా ఉంటే మరి చేయగలనా? భయమేస్తోంది. కానీ మరీ ఎక్కువగా కాదు. నా ప్రజలకు కోసం ఏదైనా చేయగలను. కానీ ఏం చెయ్యాలి? ఇదిగో ఇలా భవంతులు నిలువునా కూలి ఉండటం చూసి రోజూ ఏడుస్తున్నాను. నాకనిపిస్తుంటుంది. ఇలా జరగడం అవసరమా అని! ఏమిటీ కర్మ అని కూడా. ఇవన్నీ లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ‘వాళ్లు మనల్ని ద్వేషిస్తారు. అందుకే ఇవన్నీ చేస్తున్నారు’ అని ఇంట్లో అంటున్నారు. మేమంటే వాళ్లకు ఇష్టం ఉండదట. నా చుట్టూ ఉన్న ఈ పిల్లల్ని చూడండి. అంతా పసివాళ్లు. వాళ్లపైన మిస్సయిల్స్‌ వేసి చంపేస్తారా! అది కరెక్టు కాదు. అది కరెక్టు కాదు’’ అని నదీన్‌ కన్నీళ్లతో అనడం వీడియోను చూసే వాళ్ల చేత కంట తడి పెట్టించేలా ఉంది.  

ట్విట్టర్‌లో నదీన్‌ మాట్లాడుతున్న క్లిప్‌ను చూసి షెల్లీ నాట్‌ అనే ఒక తల్లి స్పందించింది. ‘‘నాకు 11 ఏళ్ల కూతురు ఉంది. నదీన్‌ ముఖంలోని ఆవేదన నా గుండెను బద్దలు చేసింది. పరిస్థితులు ఆమెను వయసుకు మించి పెద్దదాన్ని చేసినట్లుగా అనిపిస్తోంది. ఆమె బాల్యం ఛిద్రమైపోయింది’’ అమె ట్వీట్‌ చేశారు. 
‘‘ప్రపంచాధినేతలారా ఎక్కడున్నారు? అకస్మాత్తుగా మీ అందరికీ అంధత్వం వచ్చేసిందా?’’ అని ఇంకొకరు..
‘‘ఈ చిన్నారి మాటల్ని విన్నాక మనుషులుగా మనం విఫలమయ్యాం అనిపించింది’’
‘‘నా గుండె ముక్కలైపోయింది. ఎంత అవివేకమైన, స్వార్థం నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం..’’ అనీ స్పందనలు వచ్చాయి. 
బ్యారీ మలోన్‌ అనే ట్విటిజెన్‌.. ‘‘దేవుడా.. ఆ చిన్నారికి నీ దీవెనలివ్వు’’ అని వేడుకున్నాడు.
నదీన్‌ టీచర్‌ ఝీద్‌ కూడా ట్వీట్‌ చేశారు. ‘‘తను నా స్టూడెంట్‌. తన చుట్టు పక్కల ఏం జరిగిందో ప్రెస్‌ అడుగుతుంటే చెబుతోంది. దేవుడి దయవల్ల నదీన్, ఆమె కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. అయితే తనింకా షాక్‌ నుంచి తేరుకోలేదు’’ అని రాశారు. 
నదీన్‌లానే షాక్‌ నుంచి తేరుకోని బాలలు, మహిళలు, వృద్ధులు గాజాలో ఎంతో మంది ఉండి ఉంటారు. ఇది ఎలా మొదలైనా కానీ, చిన్నారుల హరివిల్లుల లోకంలో నిప్పురవ్వలు కురిపించకుండా అంతమైపోవాలి. మనుషులుగా మనం.. పిల్లల పూలతోటలో తిరిగి మొలకెత్తాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు