పియానో బామ్మ కొత్త ఆల్బమ్‌.. 107లో సిక్సర్‌

24 Sep, 2021 00:47 IST|Sakshi

వయసు ఏడుపదులు దాటిందంటే చాలామందికి అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమే అవుతుంటుంది. కొంతమంది మాత్రం ఆరోగ్యవంతమైన జీవనశైలితో హుషారుగా కనిపిస్తారు. ఫ్రెంచి దేశానికి చెందిన కొలెట్ట్‌ మేజ్‌ వయసు సెంచరీ దాటి ఏడేళ్లు అయ్యింది. అయినా పియానోపై రాగాలు పలికించడమే గాక ఏకంగా కొత్త ఆల్బమ్‌ను విడుదలచేసింది. 107 ఏళ్ల వయసులో డెబ్భై ఏళ్లకు పైబడ్డ కొడుకుతో కలిసి ఈ ఆల్బమ్‌ను విడుదల చేసింది కొలెట్ట్‌.

1914 జూన్‌ 16 న ఫ్రెంచ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కొలెట్ట్‌ మేజ్‌. నాలుగేళ్ల వయసులో ఒకరోజు కొలెట్ట్‌ వాళ్లింటికి పక్కింటి పిల్లలు వచ్చి పియానో వాయించడం ఆమె వినింది. అప్పటినుంచి ఆమెకు పియోను వాయించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో చిన్నతనంలో బాగా సంగీతం, పియానో వాయిస్తూ అదే లోకంగా గడిపేది. మ్యూజిక్‌ కోర్సు చేస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వద్దని వారించారు. అయినప్పటికీ కొలెట్ట్‌ ఎలాగైనా పియానో వాద్యకారిణి కావాలనుకుని..15 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ స్కూలులో పియానో నేర్చుకుని 16వ ఏట పియానో టీచర్‌గా చేరింది. అప్పటి నుంచి అనేక ఏళ్లపాటు పియానో టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కూడా కొలెట్ట్‌ పియానో వదల్లేదు.
 
ఆరో ఆల్బమ్‌..
 షూమాన్, క్లాడ్‌ డెబస్సీ మ్యూజిక్‌ను ఇష్టపడే కొలెట్‌. 84 ఏళ్ల వయసులో తొలిసారి ఆల్బమ్‌ విడుదల చేసిన కొలెట్ట్‌. తాజాగా 107 ఏళ్ల వయసులో ఆరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. గత పదిహేనేళ్లుగా రోజుకి ఎనిమిది గంటలు పియానో వాయించి వాటిని రికార్డు చేసి, సౌండ్‌ ఇంజినీర్‌ సాయంతో ఆల్బమ్‌లుగా మారుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలోనూ.. ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పియానో పై కీస్‌ ను ప్రెస్‌చేస్తూ సుమధుర సంగీతాన్ని అందిస్తోంది.  పియానో వాయించడం ద్వారా తనని తాను బిజీగా ఉంచుకుంటుంది.

సలాడ్‌ కన్నా ఆత్మీయ ఆహారం
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాద్యకారిణిగా పేరొందిన కొలెట్ట్‌ మేజ్‌... సలాడ్‌ తినడానికి పడే కష్టం కంటే పియానోను వాయించడం తేలిక అని చెబుతున్నారు. ‘‘సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన, భావోద్వేగాలతో కూడుకున్న మాధ్యమం. ప్రకృతి, భావోద్వేగాలు, ప్రేమ, కలలు, ఆశలు వంటి వాటన్నింటికి సంగీతమే ఆత్మీయ ఆహారంగా పనిచేస్తుంది. అందుకే నేను మ్యూజిక్‌ను కంపోజ్‌ చేయడానికి ఇష్టపడతాను’’ అని చెబుతోంది నవ్వుతూ.

మరిన్ని వార్తలు