మూడ్స్‌ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్‌! 

12 Dec, 2021 16:57 IST|Sakshi

‘బార్‌’ కంటే ‘చాకోబార్‌’ మేలనీ... ‘ఆల్కహాల్‌’ ఆరోగ్యానికి చేటు కాగా... దానికి భిన్నంగా ‘చాకో’హాలికులు (పరిమితంగానే) కావడం హెల్త్‌కే కాదు... మంచి మూడ్స్‌కీ మంచిదంటున్నారు పరిశోధకులు. డార్క్‌ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనీ, వాటితో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలినా... ఇప్పుడు దక్షిణ–కొరియన్‌ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తాజాగా మరెన్నో విషయాలు వెల్లడయ్యాయి. చాకోలెట్‌లో ఉండే పదార్థాలు మన జీర్ణవ్యవస్థలో నెలవై ఉండే... మనకు మేలు చేసే సూక్ష్మజీవుల (మైక్రోబ్స్‌)పై చూపే ప్రభావం వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా మారతామని అంశం వాళ్ల పరిశోధనల్లో వెల్లడైంది.

అంతేకాదు... 85 శాతం డార్క్‌ చాక్లెట్‌ మోతాదులతో... ఒకింత తక్కువ పాళ్లలో చక్కెర కలిగి ఉన్న 30 గ్రాముల చాక్లెట్‌ను రోజూ మూడు సార్లు చొప్పున తీసుకుంటే... మనుషుల మూడ్స్‌ బోలెడంత బాగుపడి... మనుషులు చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారనీ, అది పూర్తి (ఓవర్‌ ఆల్‌) ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు. డార్క్‌ చాక్లెట్‌లోని ‘కోకో’లో ఫైబర్, ఐరన్‌తో పాటు  ఫైటోకెమికల్స్‌ క్యాన్సర్లు, మతిమరపు (డిమెన్షియా), ఆర్థరైటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి అనేక సమస్యలను సమర్థంగా నివారిస్తాయనీ దక్షిణకొరియాలోని సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎకాలజీలోని ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ విభాగం  నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఇప్పటివరకూ సానుకూల  భావోద్వేగాలకూ చాక్లెట్‌కు ఉన్న సంబంధాల గురించి పరిమితంగానే తెలిసినా... ఈ తాజా పరిశోధనలతో అవి మూడ్స్‌ను ఎంతగా ప్రభావితం చేస్తాయన్న సంగతులు మరింత విపులంగా తెలిశాయంటున్నారు పరిశోధకులు.

కొంత పరిమిత మోతాదుల్లో రోజూ మూడుసార్లు చాక్లెట్స్‌ ఇస్తూ ఇందులో పాల్గొన్న అభ్యర్థుల ‘పాజిటివ్‌ అండ్‌ నెగెటివ్‌ ఎఫెక్ట్‌ షెడ్యూల్‌’ (పీఏఎన్‌ఏఎస్‌)ను పరిశీలించి, వారి ఫీలింగ్స్‌ను తెలపాలంటూ నిర్వాహకులు కోరారు. అప్పుడు అభ్యర్థుల నుంచి వెల్లడైన అంశాలను చూసినప్పుడు ‘సైకలాజికల్‌ స్కేల్‌’పై సానుకూల అంశాలే అత్యధికంగా నమోదయ్యాయని, దాంతో మూడ్స్‌ ఎలివేషన్‌కు చాక్లెట్లు సమర్థంగా తోడ్పడతాయంటూ వెల్లడైంది. అంతేకాదు... ఇలా చాక్లెట్స్‌ తిన్నవారి మలపరీక్షలూ నిర్వహించారట. ఆ పరీక్షల విశ్లేషణలో తేలిన అంశాలేమిటంటే... వారి మలంలో ‘బ్లావుషియా’ అనే ప్రోబయాటిక్‌ బాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉందనీ, ఈ తరహా బ్యాక్టీరియా కడుపు (గట్‌)లో ఉండటం వల్ల సంతోషంగా, ఆహ్లాదంగా ఉండే అవకాశాలూ పెరిగి మూడ్స్‌ మరింత బాగుంటాయాని వెల్లడైంది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘‘ద జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ బయోకెమిస్ట్రీ’’ అనే మెడికల్‌ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి.  

మరిన్ని వార్తలు