ఈ ఫోటోలో ఉన్నది కేకు అనుకుంటున్నారా? తెలిస్తే షాకవ్వుతారు!

24 Sep, 2023 08:10 IST|Sakshi

ఫొటోలో చూస్తే ఇదేదో కేకులా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది వెడ్డింగ్‌ కేకు నమూనాలో రూపొందించిన భవంతి. బటర్‌ క్రీమ్‌ మెట్లు, ఐసింగ్‌ టైల్స్‌ వంటి అలంకరణలను సిరామిక్‌తో ఏర్పాటు చేసి, దీనిని అచ్చంగా వెడ్డింగ్‌ కేకును తలపించేలా రూపొందించడం విశేషం. భారీ స్థాయిలో పన్నెండు మీటర్ల (39 అడుగులు) ఎత్తున ఈ వెడ్డింగ్‌ కేకు భవంతిని పోర్చుగీస్‌ కళాకారిణి జోవానా వాస్కోన్సెలస్‌ రూపొందించింది.

కళాత్మకమైన శిల్పాల తయారీలో ముప్పయ్యేళ్ల అనుభవం ఉన్న జోవానా తన అనుభవాన్నంతా రంగరించి ఈ భవంతిని సిసలైన కేకులా తీర్చిదిద్దడంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అతిథులు ఈ భవనంలోని మూడంతస్తుల్లోనూ తిరుగుతూ, ఇందులోని ప్రతి ఒక్క అంశాన్నీ పరిశీలించడానికి వీలుగా దీన్ని తయారు చేయడం విశేషం. లోపలి భాగంలో బంగారు రంగులో చేసిన అలంకరణలు, ఐసింగ్‌లా తయారు చేసిన శిల్పాకృతులు చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తాయి.

పద్దెనిమిదో శతాబ్దినాటి పోర్చుగీస్‌ సంప్రదాయమైన గార్డియన్‌ పెవిలియన్స్‌ ఆతిథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేసేందుకు ఈ వెడ్డింగ్‌కేకు భవంతిని రూపొందించినట్లు జోవానా తెలిపారు. వచ్చే అక్టోబర్‌ 26 వరకు ఈ కేకు భవంతిని తిలకించేందుకు సందర్శకులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. 

(చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!)

మరిన్ని వార్తలు