దివ్యమైన కల

18 Jul, 2021 05:48 IST|Sakshi
దివ్య పెరియసామి ఆచార్య

అమ్మాయిలందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. ముంబైకు చెందిన దివ్య పెరియసామి ఆచార్యకు మాత్రం అతివలను మరింత అందంగా తీర్చిదిద్దడమంటే ఎంతో ఇష్టం. దీంతో బ్యూటిషియన్‌ కావాలని కలలు కనేది. కానీ సంప్రదాయ కుటుంబంలో పుటి ్టపెరిగిన దివ్య బ్యూటిషియన్‌ కావడం కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేదు. ఆమె కోరికను వారు వ్యతిరేకించేవారు. అయినా దివ్య మాత్రం తన కలను నిజం చేసుకునే మార్గాలను వెదికేది. ఈ క్రమంలో 2018లో ‘సలాం బాంబే ఫౌండేషన్‌’(ఎస్‌బీఎఫ్‌) వారు ‘స్కిల్స్‌ ః స్కూల్‌’ పేరిట శిక్షణ ఇస్తున్నట్లు దివ్యకు తెలిసింది. వెంటనే బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌లో చేరి బ్యూటిషియన్‌ కోర్సుకు సంబంధించిన అన్ని రకాల శిక్షణలు తీసుకుని, తరువాత ఓ పార్లర్‌లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేసింది. పట్టుదలతో స్కిల్స్‌ నేర్చుకుని పార్లర్‌ పెట్టుకునే స్థాయి ఎదగడంతో తల్లిదండ్రుల మనసు కరిగి సంతోషంతో ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఇంటిదగ్గరే ‘దివ్యాస్‌ బ్యూటీ పార్లర్‌’ పేరిట పార్లర్‌ను ప్రారంభించి వివిధ రకాల బ్యూటీ సర్వీసులు, ఫేషియల్, మెనిక్యూర్, పెడిక్యూర్, మేకప్, మెహందీ డిజైన్స్‌ వంటి వాటన్నింటిని కస్టమర్లకు అందిస్తోంది.

‘‘పదిహేడేళ్ల అమ్మాయిగా ప్రభుత్వ పథకాలు పొందడం చాలా కష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకాలైనా 18 ఏళ్లు పైబడిన వారికే వర్తిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్‌బీఎఫ్‌  16–20 ఏళ్లలోపు వారికి అందించే వొకేషనల్‌ శిక్షణ  కార్యక్రమం నా కలను నిజం చేసింది. బడ్జెట్‌ నిర్వహణ, కస్టమర్లతో ఎలా మెలగాలి, సౌందర్య సాధనాల కొనుగోలు, వాడకం వాటిæరికార్డులు ఎలా నిర్వహించాలి అన్న అంశాలతోపాటు కొత్తరకం వ్యాపార అవకాశాల గురించి తెలుసుకున్నాను. గూగుల్‌ బిజినెస్, వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌లు ఎలా తెరవాలో నేర్చుకుని సొంతంగా నేనే బ్యానర్, విజిటింగ్‌ కార్డును రూపొందించుకున్నాను. ఇప్పుడు బ్యూటీపార్లర్‌ నడుపుతూనే, సొంతఫార్ములాతో హెయిర్‌ ఆయిల్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాను. బ్యూటిషియన్‌ కావాలన్న నా కలను ప్రారంభంలో కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మాటలు పట్టించుకోకుండా బ్యూటì షియన్‌ కోర్సుపై దృష్టిపెట్టి పార్లర్‌ పెట్టే స్థాయికి ఎదగడంతో అమ్మ వాళ్లు కూడా మనస్పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో సొంతంగా స్టూడియో పెట్టుకుని నాలాంటి మరి కొంతమంది అమ్మాయిలను బ్యూటిషియన్‌గా తీర్చిదిద్ది, ఉపాధి కల్పిస్తాను’’ అని దివ్య చెప్పింది.
 

మరిన్ని వార్తలు