-

శరీరాన్ని కాన్వాస్‌గా మార్చింది

30 Apr, 2022 14:05 IST|Sakshi

ఈ సృష్టిలో ప్రతిది అందమైనదే! చూసే దృష్టిలో లోపం లేకపోతే అన్నీ అందంగా, సవ్యంగా కనిపిస్తాయి. కానీ కొంతమంది మలినమైన మనసులతో ఎదుటివారిని లావుగా ఉన్నావు, బక్కగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, ఇలా ఉన్నావ్‌ అలా ఉన్నావ్‌ అని కామెంట్స్‌ చేస్తూ చిత్రవధకు గురిచేస్తుంటారు. ఆ కామెంట్లు ఎదుటివారికి ఎంతలోతుగా గుచ్చుకుంటున్నాయో..వారు ఎంతటి మానసిక క్షోభకు గురి అవుతున్నారో అనేది పట్టదు. ఈ కామెంట్లు చేసేవాళ్లంతా ప్రపంచంలో తామే అన్నివిధాలుగా పర్‌ఫెక్ట్‌ అని భావించి ... ఏ మాత్రం ఖర్చులేని, నోటినుంచి ఉచితంగా వచ్చే మాటలను గాలిలో వదిలేసి తృప్తిపడుతుంటారు.

అయితే ఇటువంటి నీచమైన కామెంట్ల బారిన పడిన వారి మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఫలితంగా వారి వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియచెప్పేందుకు ఏకంగా ప్రాజెక్టు చేసింది ఐనోవా సెర్డీరా గొంజాలెజ్‌. తన శరీరాన్నే కాన్వాస్‌గా మార్చి కనువిప్పు కలిగించడానికి ప్రయత్నించింది. ఆమె చేసిన సాహసం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో లక్షల మంది వీక్షించి, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

న్యూయార్క్‌కు చెందిన 19 ఏళ్ల మోడల్‌ ఐనోవా సెర్డీరా గొంజాలెజ్‌. పార్సన్స్‌ డిజైనింగ్‌ స్కూల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదువుతోంది ఐనోవా. స్కూల్‌ ఫైనల్‌ ప్రాజెక్టులో భాగంగా ‘మానసిక ఆరోగ్యం’పై ఆమె ప్రాజెక్టు చేయాల్చి వచ్చింది. డిజైన్‌ ద్వారా మానసిక ఆరోగ్యం గురించి చెప్పాలి. దీనికోసం ఆమె వివిధ రకాల స్కెచ్‌లను గీసింది. కానీ తనకు అవి నచ్చలేదు. కొంతమందితో కలిసి మాట్లాడి ప్రాజెక్టును లఘుచిత్రంలా రూపొందించాలనుకుంది. 

షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించింది 
‘లఘు చిత్రం ఎలా రూపొందిస్తే బావుంటుంది’ అని తీవ్రంగా ఆలోచించింది. తను గీసిన స్కెచ్‌లను పేపర్‌ మీద కాకుండా తన శరీరాన్ని కాన్వాస్‌గా మార్చి స్కెచ్‌లు గీస్తే  మరింత ప్రభావవంతంగా ఉంటుం దనిపించింది ఐనోవాకు. ఈ ఐడియాను వెంటనే అమలు చేసేందుకు  షార్ట్, టాప్‌ వేసుకుని, ‘‘మీరు ఎటువంటి బాడీ షేమింగ్‌కు గురయ్యారో ఆ కామెంట్లను నా శరీరం మీద రాయండి’’ అని రాసి ఉన్న ప్లకార్డుని చేతిలో పట్టుకుని వాషింగ్టన్‌ స్క్వేర్‌ పార్క్‌లో నిలుచుంది.

ఆ పార్క్‌లోకి వచ్చే మహిళలందరికీ ‘మీరు పడిన బాడీ షేమింగ్‌ కామెంట్లను నా శరీరం మీద రాయండి’ అని చెప్పింది. ముందు ఆశ్చర్యపోయినప్పటికీ, తరువాత ఆమె ఉద్దేశ్యం తెలుసుకుని అంతా రాయడం మొదలు పెట్టారు. ‘‘ట్రై నాట్‌ టు గెయిన్‌ వెయిట్, యువార్‌ నాట్‌సెక్సీ ఇనఫ్‌ టు మోడల్, యూ షుడ్‌ గెయిన్‌ సమ్‌ వెయిట్, యూ లుక్‌ ఇల్, పిక్‌ ఆప్‌ అండ్‌ యు విల్‌ ఫైండ్‌ ఏ ఫ్రెండ్, ఆర్‌ యూ ఈటింగ్‌?’’ కామెంట్లను రాశారు. చాలామంది తమకెదురైన కామెంట్లకు ఎలా బాధపడ్డారో కూడా వివరించారు. తనని కలిసిన వారందరూ రాసిన కామెంట్లు, అభిప్రాయాలను వీడియో రికార్డు చేసుకుంది ఐనోవా. దీంతో షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందిస్తోంది. 

బీ ఎషేమ్డ్‌ ఆఫ్‌ బాడీ –షేమ్‌ 
‘‘ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి, కొంతమందయితే నిత్యం ‘బాడీ షేమింగ్‌’కు గురవుతుంటారు. ‘‘బాడీ షేమింగ్‌కు గురైన వారు తమలో తాము మానసికంగా కృంగిపోతారు. నేను కూడా చాలాసార్లు బాడీ షేమింగ్‌కు గురయ్యాను. ‘యూ లుక్‌ అనొరెక్సిక్, యు ఆర్‌ యాస్‌ ఫ్లాట్‌ యాస్‌ టేబుల్‌’ వంటి కామెంట్లు చేశారు. ఒక మోడల్‌గా కూడా నేను బాడీ షేమింగ్‌కు గురయ్యాను అందుకే ఈ ప్రాజెక్టును చాలెంజ్‌గా తీసుకున్నాను. ఈ కార్యక్రమం ద్వారా నేను తెలుసుకున్న విషయాలతో ‘బీ ఎషేమ్డ్‌ ఆఫ్‌ బాడీ –షేమ్‌’ పేరిట లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నాను. దీని ద్వారా మరింత మందికి ఈ విషయంపై కనువిప్పు కలిగిస్తాను’’ అంటూ బాడీ షేమింగ్‌ ఎంత పెద్దతప్పో చెబుతోంది 
ఐనోవా.

మరిన్ని వార్తలు