శశి సమయం

1 Dec, 2020 08:04 IST|Sakshi

కవి సమయం అనే మాట ఉంది. సృజనాత్మకత జనియించే క్షణాలవి! అతిరా శశికి లాక్‌డౌన్‌ కాలమంతా ‘కళా సమయం’ అయింది. ఆ తీరిక వేళ ప్రాచీన మండల కళతో ఆమె తన భావాలకు రూపం ఇచ్చి రికార్డులు నెలకొల్పారు. అందుకే లాక్‌డౌన్‌లో ఆమె సద్వినియోగం చేసుకున్న సమయాన్ని శశి సమయం అనాలి. కరోనా మహమ్మారి కొన్నాళ్లపాటు అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఇంటి గడప దాటి బయటకు రావడానికి వీల్లేని పరిస్థితుల్లో కొందరు విసుగ్గా రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపేస్తే, మరికొందరు తమలోని కళానైపుణ్యాలను వెలికితీసే పనిలో పడ్డారు. రెండవ కోవలోకి వస్తారు కేరళలోని మున్నార్‌లో ఉంటున్న అతిరా శశి. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఆమె ఓ కొత్త ఆర్ట్‌ నేర్చుకోవడమే కాకుండా ఆ కళలో రాణించి ఏకంగా రికార్డులే తన ఖాతాలో వేసుకున్నారు! మండల ఆర్ట్‌ అనేది మన భారతీయ ప్రాచీన కళ. మండలం అంటే సంస్కృతంలో ‘వలయం’ అని అర్థం.

వలయాకారంలోఉండే జామెట్రీ డిజైన్‌ ఈ ‘మండల ఆర్ట్‌’. మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర రాష్ట్రాలలో వస్త్ర ముద్రణలో ఈ మండల కళను ఉపయోగిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలోనూ ఈ కళ ప్రాచుర్యంలో ఉంది. ఇందులో శశి రికార్డులు నెలకొల్పారు. మండల ఆర్ట్‌ ఆధారంగా అతిరా శశి పెయింట్స్‌ వేయడం సాధన చేశారు. భారతీయ రాష్ట్రాలు, వాటి రాజధానులు, వర్ణమాల, పర్యావరణం, రాశీచక్ర గుర్తులు సహా వంద రకాల పెయింట్స్‌ వేసినందుకు 21 ఏళ్ల శశి పేరు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, కలాం వరల్డ్‌ రికార్డ్‌లలో నమోదయ్యింది. ఆమె వేసిన పెయింటింగ్స్‌లో గౌతమ బుద్ధ సంస్కృతి మూలాలు లోతుగా పాతుకుపోయిన టిబెట్, భూటాన్, మయన్మార్‌ వంటి ప్రదేశాలు సైతం ఉండటం విశేషం.

అతిరా శశి ఈ కళను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ‘నా చిన్నతనంలో నాన్న ఉద్యోగరీత్యా మేము గుజరాత్‌లో ఉండేవాళ్లం. మొదట అక్కడే ఈ ఆర్ట్‌ను  చూశాను. వాటిని పరిశీలించినప్పుడు దుపట్టా, చీరలపై ఈ ఆర్ట్‌ను అక్కడి కళాకారులు ఎంతో శ్రద్ధగా వేసినట్లుగా అనిపించింది. గుజరాత్‌ నుంచి మున్నార్‌ తిరిగి వచ్చాక కాలేజీ చదువులో పడిపోయాను. ఎప్పుడైనా రిలాక్స్‌ అవడానికి మాత్రం మండల ఆర్ట్‌ని వేయడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. లాక్‌డౌన్‌ సమయంలో వంద రకాల భిన్నమైన మండల ఆర్ట్‌ను పెయింటింగ్‌గా రూపుకట్టడంతో అవార్డులు వరించాయి’’ అని శశి చెప్పారు. బిబిఎలో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన అతిరా శశిని చూస్తే ఒక విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ‘అందరికీ సమయం ఒకటే. దానిని సరిగ్గా ఉపయోగించుకున్నవారినే విజయం వరిస్తుంది’ అని.. 

మరిన్ని వార్తలు