వ్యాయామం చేయడం బద్దకంగా ఉందా.. జస్ట్‌ ఇలా చేయండి..

8 Jul, 2021 12:37 IST|Sakshi

రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరమేమీ లేదు. కానీ, ఆచరణకు వచ్చేసరికి అనేక సమస్యలు మొదలవుతాయి. అలాంటి వారికి యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. ఇంట్లోనే కాదు.. మనకు నచ్చిన చోట కూర్చుని రోజూ 30 నిమిషాల పాటు నిర్దిష్ట పద్ధతిలో శ్వాస తీసుకుంటే చాలు.. అది కాస్తా వ్యాయామానికి సరితూగే ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు.  ఫొటోలో చూపినట్లు ముక్కును రెండు వైపులా మూసేసి.. నోటి ద్వారా మాత్రమే ఈ కొత్త శ్వాస ప్రక్రియ నడుస్తుంది.

‘హై రెసిస్టెన్స్‌ ఇన్‌స్పిరేటరీ మజిల్‌ స్ట్రెంగ్త్‌ ట్రెయినింగ్‌’ క్లుప్తంగా ఐఎంఎస్‌టీ అని పిలిచే ఈ తరహా శ్వాస ప్రక్రియ 1980లలోనే పరిచయమైనా దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలిశాయి. 50 నుంచి 79 ఏళ్ల వయసున్న 36 మందిపై తాము ప్రయోగం చేశామని, వారానికి ఆరు సార్లు చొప్పున ఆరు వారాల పాటు జరిగిన ఈ ప్రయోగాల్లో మంచి ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ డేనియల్‌ క్రెయిగ్‌ హెడ్‌ తెలిపారు. వీరిలో సగం మంది రోజూ అరగంటపాటు నోట్లో ఒక పరికరాన్ని ఉంచుకుని ఊపిరి పీల్చినప్పుడు వారి రక్తపోటు 9 పాయింట్ల వరకు తగ్గిందని వివరించారు.

ఈ పద్ధతిని నిలిపేసిన తర్వాత కూడా చాలాకాలం పాటు ప్రయోజనాలు కొనసాగడం ఇంకో విశేషమని తెలిపారు. అంతేకాకుండా.. నాడుల్లోని ఎండోథీలియల్‌ కణాల పనితీరు 45 శాతం వరకు మెరుగుపడిందని పేర్కొన్నారు. రుతుస్రావం నిలిచిపోయిన వారికీ ఈ శ్వాస ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. జిమ్‌ సౌకర్యాలు లేనివారు ఈ పద్ధతిని ఉపయోగించుకుని ఏరోబిక్‌ వ్యాయామం ద్వారా కలిగే లాభాలను పొందొచ్చని చెప్పారు.   

మరిన్ని వార్తలు