37 Days Challenge: అతడి విజయ రహస్యమిదే! చెడు అలవాట్లకు దూరంగా.. ఇంకా ఇలా చేశారంటే!

28 Jan, 2023 12:05 IST|Sakshi
PC: Instagram

Weight Loss- 37 Days Challenge: తెలిసో తెలియకో చెడు అలవాట్ల బారిన పడతారు కొందరు. పని ఒత్తిడిలాంటి కారణాలతో ఆరోగ్యకరమైన జీవనశైలికి దూరమై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు మరికొందరు. అనారోగ్యకరమైన జీవనశైలి నుంచి బయటికి రావడానికి, చెడు అలవాట్ల కబంధ హస్తాల్లో బందీలుగా ఉన్నవారిని బయటికీ తీసుకురావడానికి ‘37 డేస్‌ ఛాలెంజ్‌’తో నడుం కట్టి విజయం సాధించాడు ప్రణిత్‌ షిలిమ్కర్‌.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రణిత్‌ షిమిల్కర్‌ కాలేజీ రోజుల్లో బాగా బరువు పెరిగాడు. దీంతో రకరకాల వ్యాయామాలు చేసి బరువు తగ్గాడు. ఈ విజయం తనకు కిక్‌ ఇవ్వడమే కాదు ఫిట్‌నెస్‌ ప్రేమికుడిగా మార్చేసింది. ఫిట్‌నెస్‌ క్లాస్‌లకు హాజరు కావడం మొదలుపెట్టాడు. రకరకాల ఫిట్‌నెస్‌ కోర్సులు చేశాడు. పర్సనల్‌ ట్రైనర్, న్యూట్రీషనిస్ట్‌గా పట్టా పొందాడు.

24 సంవత్సరాల వయసులో పుణెలో సొంతంగా జిమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు ‘ఫిట్‌నెస్‌ టాక్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌–కన్సల్టెన్సీ సంస్థను ప్రారంభించాడు. ‘37 డేస్‌ ఛాలెంజ్‌’తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఒక్కసారి ట్రై చేసి చూడండి
చెడు అలవాట్ల బారిన పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న వారిని, అధిక బరువుతో బాధపడుతున్న వారిని ‘ఒక్కసారి ట్రై చేసి చూడండి’ అని పిలుపు ఇచ్చాడు.

పెద్దగా నమ్మకం లేకపోయినా ‘ప్రయత్నించి చూద్దాం’ అంటూ చాలామంది ఈ ఛాలెంజ్‌లో భాగం అయ్యారు. సక్సెస్‌ కూడా అయ్యారు. ఒక దీక్షలాగా 37 రోజులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, తగిన వ్యాయామాలు చేస్తూ, సరిౖయెన పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది.

‘రకరకాల చెడు అలవాట్లకు దూరంగా ఉండడం లేదా అనారోగ్యకరమైన జీవనశైలిని రోజుల వ్యవధి లో మార్చుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. సహనం, సంకల్పబలం ఉంటే అదేమీ అసాధ్యం కాదని 37 డేస్‌ ఛాలెంజ్‌ నిరూపించింది. బాడీట్రాన్స్‌ఫర్మేషన్‌ జరగాలంటే లైప్‌స్టైల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ముఖ్యం’ అంటున్నాడు ప్రణిత్‌.

కోవిడ్‌ సంక్షోభసమయంలో ప్రణిత్‌ అతని బృందం ఎంతోమందిని ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు నడిపించారు. రోగనిరోధకశక్తి పెరగడానికి ఏంచేయాలో ‘ఫిట్‌నెస్‌ టాక్స్‌’ ద్వారా ప్రచారం చేశాడు.

జిమ్‌లో పొరపాటున కూడా ఎప్పుడూ అడుగుపెట్టని వారిలో, జిమ్‌కు వెళ్లాలనుకొని వెళ్లకుండా బద్దకించేవారిలో మార్పు తీసురావడంలో సక్సెస్‌ అయ్యాడు ప్రణిత్‌. పుణె, ముంబైలతో సహా ఎన్నో నగరాలలో ఫిట్‌నెస్‌కు సంబంధించి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇచ్చాడు. ప్రణిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యత గురించి చెప్పే ఎన్నో రీల్స్‌ కనిపిస్తాయి.

మంచి భవిష్యత్‌
‘నా కెరీర్‌ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టంగా ఉన్నాను. ఫిట్‌నెస్‌ రంగానికి మంచి భవిష్యత్‌ ఉందనేది కాదనలేని వాస్తవం. చాలామంది ఆరోగ్యకరమైన జీవనశైలికి దూరంగా ఉంటున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

మన ఆరోగ్యంపై ఎంత టైమ్‌ వెచ్చిస్తున్నామనేదానిపైనే మంచి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది’ అంటున్న ప్రణిత్‌ హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ఎంటర్‌ప్రెన్యూర్, డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్, ఆన్‌లైన్‌ కన్సల్టెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫిట్‌నెస్‌ టాక్స్‌’ ఫౌండర్, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌గా చిన్న వయసులోనే పెద్ద పేరు సొంతం చేసుకున్నాడు.

విజయాలకు కారణం
ఫిట్‌నెస్‌ ప్రేమికులతో మాట్లాడడం, వారి నుంచి నేర్చుకోవడం, నాకు తెలిసింది వారితో పంచుకోవడం అంటే ఇష్టం. ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ ప్రేమికులుగా మారాలి. ఆరోగ్యం బాగుంటేనే, ఆలోచనలు బాగుంటాయి. జీవితం పట్ల సానుకూలత మనకు నిరంతర శక్తిని అందించి ఎన్నో విజయాలు సాధించడానికి కారణం అవుతుంది.
– ప్రణిత్‌ షిలిమ్కర్‌ 

చదవండి: Health Tips: రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగడం, గుప్పెడు శనగలు నానబెట్టి తింటే
తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే..

మరిన్ని వార్తలు