శౌర్య యాత్ర.. 40 మంది మహిళలా సైనికులు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు..!

12 Mar, 2022 16:22 IST|Sakshi

స్త్రీశక్తి

నిత్య ఉత్తేజం చే గువేరా ‘మోటర్‌ సైకిల్‌ డైరీస్‌’లో ఒక మాట...
‘ప్రపంచం నిన్ను మార్చే అవకాశం ఇవ్వు. ఆ తరువాత ఈ ప్రపంచాన్ని మార్చే దిశగా ప్రయాణిస్తావు’ ప్రయాణం అనేది పైకి భౌగోళిక అంశాలకు సంబంధించిన విషయంగా కనిపించినప్పటికీ, సూక్ష్మదృష్టితో చూస్తే... అది మనలోకి మనం ప్రయాణించడం. ప్రయాణ క్రమంలో కొత్త విషయాలను నేర్చుకోవడం. మన దగ్గర ఉన్న విషయాలను పంచుతూ వెళ్లడం.

రక్తం గడ్డ కట్టే చలిలో జమ్మూ అంతర్జాతీయ సరిహద్దుల్లో డేగకళ్లతో కాపుకాసి, ఉగ్రవాదులకు, అక్రమ చొరబాటుదారులకు చెక్‌ పెట్టిన మహిళా సైనికుల ధీరత్వం ఇప్పటికీ తాజాగానే ఉంటుంది. ఎర్రటి ఎండల్లో, నాలుక పిడచకట్టుకుపోయే భయానక వేడిలో రాజస్థాన్‌ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన మహిళా సైనికుల అంకితభావం ఎప్పటికీ గుర్తుంటుంది. విధినిర్వహణలో కాలప్రతికూలతలు, భౌగోళిక ప్రతికూలతలను అధిగమించి ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి విధి అయిన నిర్వహించగలం’ అని నిరూపించారు బీఎస్‌ఎఫ్‌ మహిళా సైనికులు.

రాజస్థాన్‌కు చెందిన తనుశ్రీ ప్రతీక్‌ బీఎస్‌ఎఫ్‌ చరిత్రలో ఫస్ట్‌ ఉమెన్‌ కంబాట్‌ ఆఫీసర్‌గా నియామకం అయినప్పడు అది ఒక విశేషం మాత్రమే కాదు, ఎంతోమంది మహిళలకు విశిష్టమైన ఉత్తేజాన్ని అందించింది. మొన్నటి దిల్లీ రిపబ్లిక్‌ డే వేడుకల్లో బీఎస్‌ఎఫ్‌ మహిళా దళం ‘సీమ భవాని’ చేసిన అపురూప సాహసిక విన్యాసాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఇవేమీ జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోవడం లేదు. ఒక కొత్తదారికి ఊతం ఇవ్వబోతున్నాయి.

తాజా విషయానికి వస్తే.. బీఎస్‌ఎఫ్‌కు చెందిన నలభైమంది మహిళా సైనికులు దిల్లీ నుంచి కన్యాకుమారి వరకు బైక్‌ యాత్ర చేపట్టారు. 5,280 కి.మీ ఈ యాత్రకు ‘సీమా భవాని శౌర్య ఎంపవర్‌మెంట్‌ రైడ్‌–2022’ అని నామకరణం చేశారు. అటు అమృత్‌సర్‌ నుంచి ఇటు చెన్నై, హైదరాబాద్, అనంతపురం, బెంగుళూరు వరకు స్త్రీ సాధికారికతకు సంబంధించిన ఘట్టాలను పంచుకుంటూ, సానుకూల దృక్పథాన్ని రేకెత్తించడమే ఈ యాత్ర లక్ష్యం.


యాత్రలో భాగంగా బృంద సభ్యులు పాఠాశాల, కాలేజీ విద్యార్థులు, ఎన్‌సీసీ వాలెంటీర్లు, బైక్‌రైడర్స్‌... మొదలైన వారితో సమావేశం అవుతారు. దిల్లీకి సమీపంలోని ఒక పాఠశాల విద్యార్థులతో సమావేశం అయినప్పుడు... మొన్నటి రిపబ్లిక్‌డే వేడుకల్లో సీమభవాని బృందం చేసిన సాహసకృత్యాలను గుర్తు చేసుకుంది ఒక చిన్నారి. తాను కూడా అలా చేయాలనుకుంటుదట!


‘నువ్వు కచ్చితంగా చేయగలవు’ అని చెప్పినప్పుడు ఆ పాప ముఖం ఎంత సంతోషంతో వెలిగిపోయిందో! మరోచోట ఒక కాలేజీ విద్యార్థిని ‘బీఎస్‌ఎఫ్‌లో చేరాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏం చదవాలి?’... మొదలైన విషయాలను అడిగింది. ఆ అమ్మాయికి అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది రైడర్స్‌ గ్రూప్‌. దూరాలను అధిగమించడమే కాదు... దూరాలను తగ్గించడం కూడా ఈ యాత్ర లక్ష్యం. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలపై రాజసంగా కనిపిస్తున్న సీమ భవానీ శక్తులను ఒక్కసారి చూడండి... ఎంత ఉత్తేజకరమైన దృశ్యమో!

మరిన్ని వార్తలు