కుకింగ్‌ క్వీన్‌ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్‌ బ్లాగ్‌..

9 Jun, 2021 14:40 IST|Sakshi

పిల్లల చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లకు కిచెన్‌ బాధ్యత లు అప్పజెప్పి మనవళ్లు మనవరాండ్రతో ఆడుకోవాలనుకుంటారు మన భారతీయ సంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఫుడ్‌ బ్లాగ్‌ను ప్రారంభించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించారు. దాంతో ఆమె సోషల్‌ మీడియా స్టార్‌గానే గాక ..‘‘పాపులర్‌ ఇండియన్‌ వెజిటేరియన్, యూట్యూబ్‌ చెఫ్, రెస్టారెంట్‌ కన్సల్టెంట్, ఫుడ్‌ బ్లాగర్, టెలివిజన్‌ పర్సనాలిటీ’’ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన నిషాకి ఢిల్లీకి చెందిన ఎంఎస్‌ గుప్తాతో వివాహం జరిగింది. ఢిల్లీకి వచ్చేసిన నిషాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల పెంపకంలోనూ, మరోపక్క భర్త వ్యాపారంలో సాయం చేస్తూ బిజీగా ఉండేవారు. పిల్లలు చదువులు పూరై తమ ఉద్యోగాలతో బిజీ అయిపోయారు. దీంతో అప్పటిదాకా తీరిక లేకుండా గడిపిన నిషాకి ఒక్కసారిగా తీరిక ఏర్పడడంతో తనని తాను బిజీగా ఉంచుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తన కొడుకు బ్లాగ్‌కు రాస్తుండడం చూసి.. తనకు బాగా అనుభవమున్న కుకింగ్‌ను బ్లాగ్స్‌లో రాయాలనుకున్నారు.

కొడుకు సాయంతో..
భర్త, కొడుకు సాయంతో.. నిషా 2007లో కుకింగ్‌ బ్లాగ్‌ను ప్రారంభించి దానిలో వంటల తయారీ గురించి రాసేవారు. తర్వాత తనే సొంత వెబ్‌సైట్‌ https:/nishamadhulika.com లో తన తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు వండుతూ అవి ఎలా వండాలో రాసి పోస్టులు పెట్టేవారు. నిషా వంటలను ఇష్టపడిన అభిమానులు ‘‘వీడియోలు పెట్టండి మేడం’’ అని అడగడంతో.. వీడియోలు కూడా అప్‌లోడ్‌ చేయడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా 1300 కుపైగా వంటల వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. 

సిసలైన శాకాహార వంటలు
మధులిక కుటుంబం 2009 లో నోయిడాకు మకాం మార్చింది. అప్పుడే ఆమె సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. శాకాహార వంటకాలకు ప్రాధాన్యత నిచ్చిన నిషా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాల వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వీడియోలు మిలియన్ల మందిని ఆకర్షించేవి. ప్రస్తుతం నిషా ఛానల్‌ సబ్‌స్క్రైబర్స్‌ కోటీ పదిహేను లక్షలకు పైనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. 

ఐదుగురితో టీం ..
యూ ట్యూబ్‌ వీడియోల ద్వారా ఆదాయం వస్తుండడంతో.. మంచి కిచెన్‌ను సెటప్‌ చేసి, ఐదుగురితో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్‌ రెండుమూడు వంటల వీడియోలు తీసి.. తరువాత ఛానల్లో అప్‌లోడ్‌ అయిన వంటకాలకు వచ్చే కామెంట్లు, అభిప్రాయాలను సమీక్షిస్తూ లోపాలను ఎలా సరిదిద్దాలో చూసుకునేది.

టాప్‌టెన్‌ బెస్ట్‌ యూ ట్యూబర్‌..
మొదట్లో బ్లాగ్స్, వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు ఇది వ్యాపారంగా చూడని నిషా.. తనకు తెలిసిన అనేక వంటకాలను హిందీలో అప్‌లోడ్‌ చేసేవారు. తరువాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఉన్న తన ఫాలోవర్స్‌ తమ భాషల్లో వీడియోలు అప్‌లోడ్‌ చేయమని అడగగా వాళ్ల భాషల్లో వంటల వీడియోలు, సబ్‌టైటిల్స్‌తో పోస్టు చేసేవారు. అంతేగాక పలు వెబ్‌సైట్లకు వంటల ఆర్టికల్స్‌ రాసిచ్చేవారు. దీంతో సబ్‌స్క్రైబర్స్‌తోపాటు, ఆదాయం పెరిగింది.

ఈ క్రమంలో ఆమె 2014లో యూట్యూబ్‌ చెఫ్స్‌ టైటిల్, 2017లో టాప్‌ యూట్యూబ్‌ కుకింగ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అవార్డులు అందుకున్నారు.  ఇండియన్‌ టాప్‌టెన్‌ బెస్ట్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌ జాబితాలో.. రెండుసార్లు నిషా స్థానం దక్కించుకున్నారు. అంతేగాక  ప్రముఖ మ్యాగజీన్లు బ్లూమ్‌బర్గ్, ఎకనామిస్ట్, ఇండియా టుడే వంటివి ఆమె సక్సెస్‌ స్టోరీని ప్రచురిస్తూ ‘కుకింగ్‌ క్వీన్‌’గా అభివర్ణించాయి. లోక్‌సభ టీవీ ఆమె ఇంటర్వ్యూనూ టెలికాస్ట్‌ చేయడం విశేషం. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు