ట్రావెల్‌.. ట్రెండ్స్‌: పర్యాటకంపై తగ్గని ఆసక్తి

23 Mar, 2021 18:56 IST|Sakshi

కోవిడ్‌ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో పర్యాటక ప్రేమికుల ప్రణాళికలకు అవాంతరం ఏర్పడిందే గానీ వారి అభిరుచులకు కాదు. తమ కలల తీరాలను చేరుకోవడానికి నగరంలోని టూర్‌ ‘ఇష్టులు’ ఆసక్తిగానే ఉన్నారు. బోట్‌ ట్రావెల్‌ సెంటిమెంట్‌ ట్రాకర్‌ సర్వే ప్రకారం ఒక్కసారి కోవిడ్‌ ప్రభావం పరి సమాప్తం అవగానే తమ పర్యాటక ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి 63శాతం మంది ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా పర్యాటక రంగం ఎంతో నష్టపోయినప్పటికీ కొన్ని లాభాలనూ అందుకుందని విఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ రీజనల్‌ గ్రూప్‌ సిఒఒ వినయ్‌ మల్హోత్రా విశ్లేషిస్తున్నారు. కోవిడ్‌ నేపధ్యంలో ట్రావెల్‌ ట్రెండ్స్‌పై ఆయన ఏమన్నారంటే...

సురక్షితమే...సముచితం..
కోవిడ్‌ లాక్‌ డౌన్‌ల నేపధ్యంలో పర్యాటకుల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా సురక్షితమైన, నమ్మదగిన ప్రాంతాలపైనే దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో ట్రావెల్‌ పరిశ్రమ కూడా వేగంగా డిజిటల్‌ మయం అవుతోంది. అలాగే ట్రావెల్‌ ప్లానింగ్‌ నుంచి కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్‌ దాకా కాంటాక్ట్‌ లెస్‌ లావాదేవీలను పెంచుకుంటూ పోతోంది. 

ప్లానింగ్‌...కింగ్‌..
కేవలం ఒక బ్యాక్‌ ప్యాక్‌తో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా స్వల్ప దూరాలకు, ప్రాంతాలకు వెళ్లొచ్చేయడం వంటి ప్లానింగ్‌ లెస్‌ ట్రావెల్‌ ఇటీవల క్రేజీగా మారింది. అయితే ఇప్పుడు ఆ ఆలోచనలు మార్చుకోక తప్పడం లేదు. తాము ఎక్కడ బస చేయబోతున్నాం, ఏం తినబోతున్నాం.. వంటి ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకుంటూ ముందస్తు ప్లాన్‌ చేసుకోవాలి. 

వ్యయ..ప్రయాణాలకు సై
పర్యాటకాభిరుచి బాగా పెరిగిపోతున్న దశలో తక్కవ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలు చూడాలనే ఆలోచన.. వల్ల పెద్ద సంఖ్యలో సామూహిక ప్రయాణాలు, నాసిరకం విమానాలు, హాస్టల్స్, హోమ్‌ స్టే, గ్రూప్‌ టూర్స్, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌... వంటివి కూడా ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా కోవిడ్‌ విస్తరణ పరిస్థితుల్లో ఇది ఆమోద యోగ్యంగా కాదు. వీలున్నంత వరకూ సోలో/లేదా చిన్న చిన్న బృందాలతో మాత్రమే ప్రయాణాలు చేయాలని, తగినన్ని పారిశుధ్య ప్రమాణాలు పాటిస్తున్న చోట్ల బస చేయడం, చిన్న చిన్న దూరాలకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బుదులుగా క్యాబ్స్, సైకిల్స్, వాకింగ్‌.. వంటివి ఎంచుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది. తాజాగా థామస్‌ కుక్‌ నిర్వహించిన ఎస్‌ఒటిసి హాలిడే రెడీనెస్‌ సర్వేలో తాము ఆపరేటర్స్, హోటల్స్‌ తమ ప్రయాణం మొత్తం ప్రముఖ బ్రాండ్స్‌కే ప్రాధాన్యమిస్తామని 72శాతం మంది చెప్పారు. తద్వారా తమకు ప్రయాణ ఖర్చులు గతంతో పోలిస్తే కనీసం 35శాతం వరకూ పెరుగుతున్నా పర్లేదని వీరు అంటున్నారు. 

నెంబర్‌ టూ.. త్రీలకే డిమాండ్
సాధారణంగా ప్రతీ దేశంలో బాగా పేరొందిన టూరిస్ట్‌ ప్లేస్‌గా ఏదో ఒక సిటీ/ ప్లేస్‌ తప్పక ఉంటుంది. సహజంగానే అలాంటి చోట్ల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే కోవిడ్‌ పరిస్థితుల్లో అటువంటి బాగా పాప్యులర్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ల కన్నా... టాప్‌లో 2, 3 స్థానాల్లో ఉన్న వాటినే పర్యాటకులు ఎంచుకుంటున్నారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో ఉండే సమూహాల నుంచి తప్పించుకోవచ్చునని భావిస్తూ.. వీలున్నంత వరకూ అత్యంత తక్కువ మందికే తెలిసిన పర్యాటక ప్రాంతాలపై ఆసక్తి చూపిస్తున్నారు. 

డిజిటల్‌...ఫుల్‌
ప్రస్తుతం పర్యాటక పరిశ్రమ తమ వ్యాపార కార్యకలాపాల డిజిటలైజేషన్‌ను మరింతగా విస్తరించింది. కస్టమర్‌కి అవసరమైనవన్నీ క్లిక్‌ దూరంలోకి తెస్తోంది. ట్రావెల్‌ ప్లానింగ్‌ నుంచి వీసా అప్లికేషన్స్, ఎయిర్‌ పోర్ట్‌ నుంచి హోటల్స్‌... వరకూ.. ఆసాంతం డిజిటల్‌ ప్రక్రియకే ప్రాధాన్యత ఇస్తోంది. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్రాసెస్, డోర్‌ స్టెప్‌ వీసా సర్వీస్, ఇ వీసా సర్వీసెస్, పాస్‌పోర్ట్‌ రిటర్న్‌ కు కొరియర్, ఎయిర్‌పోర్ట్స్‌లో సెల్ఫ్‌ చెక్‌ కియోస్క్‌లు.. వంటివి వాడుకలోకి వచ్చేశాయి. ట్రావెల్‌ కంపెనీలన్నీ డిజిటల్‌ టచ్‌పాయింట్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. 

ముందుంది..పర్యాటక పండుగ
సాధారణంగా వేసవి సీజన్‌ అనేది పర్యాటక శాఖలు సంస్థలకు చాలా ముఖ్యమైంది. దాదాపుగా వార్షిక వ్యాపారంలో కనీసం 60 నుంచి 65శాతం ఈ సీజన్‌లోనే అందుతుందని అంచనా. లాక్‌ డౌన్‌ తో 2020లో దీన్ని సంపూర్ణంగా కోల్పోయారు. అయితే మరోవైపు పర్యాటక ప్రాధామ్యాలనే ఇది మార్చేయడం, మరీ ముఖ్యంగా సురక్షితమైన పర్యాటక అనుభవాలపై అవగాహన పెరగడం వంటి పలు లాభాలూ ఒనగూరాయి. అంతర్జాతీయ విమానాల రాకపోకల సందడి లేక ప్రస్తుతం పర్యాటక రంగం స్తబ్ధుగా కనిపిస్తున్నప్పటికీ... ఈ సీజన్‌ చివర్లో మళ్లీ పర్యాటకం బాగా ఊపందుకోవచ్చుననేది అంచనా. 

- వినయ్‌ మల్హోత్రా, రీజనల్‌ గ్రూప్‌ సిఒఒ, విఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు