అలకు ఎదురు‘గీత’

26 Jun, 2021 01:59 IST|Sakshi

నర్సు గీత గురించి వింటే ఒకటే అనిపిస్తుంది. రిటైర్మెంట్‌ అనేది ఎవరో ఇచ్చేస్తే పూలదండతో పాటు ఇంటికి తెచ్చేసుకునేది కాదని. గీత వయసు ప్రస్తుతం 66 ఏళ్లు. సర్వీస్‌ రూల్స్‌ ఆమెను రిటైర్‌ చేశాయి తప్పితే, సర్వీస్‌ చేయాలనే ఆమె తపనను ‘రిటైర్మెంట్‌ మోడ్‌’ లోకి నెట్టేయలేకపోయాయి. ఈ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ లో గీత చిన్నా చితక సేవల్ని అందించడం కాదు, లోకల్‌ యూత్‌ ని కలుపుకుని ఆపదలో ఉన్నవారి కోసం ఏకంగా పరుగులే పెడుతోంది. మైసూర్‌ లో ఇప్పుడు ‘అల’కు ఎదురీదుతున్న గీత.. ఆమె!

మైసూరుకు, చామరాజనగర్‌కు మధ్య పెద్ద దూరం ఉండదు. అరవై కి.మీ. దూరం. లేదా గంటన్నర ప్రయాణం. అయితే ఈ సెకండ్‌ వేవ్‌లో అది క్షణాలతో సహా లెక్కించవలసిన అత్యవసర దూరం అయింది. చామరాజనగర్‌ జిల్లాలోని కొల్లేగల్లు, హనూర్‌ తాలూకాల గ్రామాల్లో ఎంతోమంది కోవిడ్‌ బాధితులు మైసూర్‌ నుంచి వచ్చే ఆక్సిజన్‌ సిలెండర్‌ల కోసం, వైద్యసేవల కోసం ఎదురు చూస్తుండటం వల్ల ఇటీవల ఏర్పడిన అత్యవసర స్థితి. ఈ స్థితిలో గీత అనే రిటైర్డ్‌ నర్సు తన విశ్రాంత జీవితానికి స్వస్తి చెప్పి, విధులకు పునరంకితం అయిన విధంగా లేచి, గత రెండు నెలలుగా బాధితులకు అవసరమైన సిలెండర్‌లను, వైద్యసేవలను తనే స్వయంగా అందించి వస్తున్నారు.

బాధితుల కుటుంబ సభ్యులకు ‘భయపడాల్సిందేమీ లేదు’ అని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. గీతకు తెలిసిన వాళ్లిద్దరు ఇటీవల ఆక్సిజన్‌ అందుబాటులో లేక మరణించడం ఆమెను కదలించింది. ఆ కదలికే ఆమెను ఈ మార్గంలోకి రప్పించింది. ‘రిటైర్‌ అయి ఇంట్లో ఉంటే మాత్రం! నేనేమీ చేయలేనా..’ అని అనుకుంటున్న సమయంలో ‘స్వామీ వివేకానంద యూత్‌ మూవ్‌మెంట్‌’ (ఎస్వీవైఎం) గురించి ఆమెకు తెలిసింది. ఆ టీమ్‌ ఆక్సిజన్‌ అవసరం అయిన పేషెంట్‌ల వివరాలు తెలుసుకుని వారికి ఉచితంగా ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ లను సమకూర్చుతోంది. వెళ్లి వెంటనే వారిని కలిశారు గీత. నర్సుగా ఎమర్జెన్సీ సేవల్ని అందించడంలో తనకున్న అనుభవం గురించి వారికి చెప్పారు. ‘‘నేనూ మీతో కలిసి పని చేస్తాను’’ అన్నారు.

‘‘మీరు మాతో కలిసి పని చేయడం కాదు, మేమే మీతో కలిసి పనిచేస్తాం మేడమ్‌’’ అన్నారు వారు! అన్నమాట ప్రకారమే పేషెంట్‌ల సమాచారాన్ని వారు తెచ్చేవారు. వారికి ఏర్పరచవలసిన సదుపాయాలేమిటో గీత సూచించేవారు. మందులు, ఆహారం ఇవ్వడం వరకు మాత్రమే గీత అండ్‌ టీమ్‌ పరిమితం కాలేదు. గీత స్వయంగా పేషెంట్‌లను కలుసుకుని వారికి సేవలు చేసేవారు. ఆమె సేవాభావాన్ని, నిర్వహణ బలాన్ని గమనించిన ఎస్వీవైఎం మైసూరులోని ఆమె ఇంట్లోనే ఒక ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ల బ్యాంక్‌ను నెలకొల్పింది! ఇంటి నుంచి గీతే ఇప్పుడు వాటిని బట్వాడా చేస్తున్నారు. ‘‘కరోనా పేషెంట్‌లకు అంత సమీపంగా వెళ్లి సేవ చేస్తున్నారు.. మీకేమీ భయంగా ఉండదా?’’ అని ఆమెను అడిగితే.. ‘‘అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే ఉన్నాను’’ అని నవ్వుతూ చెప్తారు. గీత ఇంట్లో ఆమెతో పాటు 96 ఏళ్ల ఆమె తల్లి కూడా ఉంటారు. ఆమెను సంరక్షించుకుంటూనే, ఎంతోమందికి తల్లిలా తను సేవలు అందిస్తున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు