తోడేళ్లు, ఎలుగుబంట్ల మధ్య 70 ఏళ్లుగా ఒంటరి జీవితం

15 Dec, 2020 00:02 IST|Sakshi

అగాఫ్యా లైకోవా. ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్న 76 ఏళ్ల ఒంటరి స్త్రీ.మైనస్‌ 50 డిగ్రీల సెల్సియస్‌ వద్ద సైబీరియా మంచు దిబ్బల్లో నాగరిక ప్రపంచానికి దాదాపు 160 మైళ్ల దూరాన గత 70 ఏళ్లుగా జీవిస్తోంది.‘ఓల్డ్‌ బిలీవర్స్‌’ గా భావించే క్రిస్టియన్‌  చాందస సమూహానికి చెందిన అగాఫ్యా కుటుంబం సోవియెట్‌ రష్యా ఆవిర్భావ సమయంలో తమ మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న భయంతో సైబీరియాలోకి పారిపోయి అక్కడే జీవించసాగింది.అగాఫ్యా అక్కడే పుట్టింది. ఇప్పటికీ అక్కడే నివసిస్తోంది. రష్యా సంపన్నుడు ఒగెల్‌ దెరిపాస్కా ఆమెకు అక్కడ కొత్త ఇల్లు కట్టి ఇస్తుండటంతో తిరిగి వార్తల్లోకి వచ్చింది. 

సైబీరియా మంచు ఎడారిలో, ఏ జనావాసం నుంచైనా సరే దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తున, విస్తారమైన మంచు అడవుల మధ్య, మైనస్‌ 50 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయే చోట ఇప్పుడు ఒకే ఒక ఇల్లు కట్టబడుతోంది. దానిని కడుతున్నది రష్యాలో అల్యూమినియం కింగ్‌గా ఖ్యాతి గాంచిన ఒలెగ్‌ దెరిపాస్కా. కట్టి ఇస్తున్నది 76 ఏళ్ల వృద్ధురాలు అగాఫ్యా లైకోవాకు.ఎందుకంటే ఆమె అక్కడ ఒంటరిగా... అవును ఒంటరిగా 30 ఏళ్లుగా జీవిస్తున్నది. జీర్ణావస్థలో ఉన్న తన ఇంటిని వదిలి రానంటున్నది. ఆమె కోసమే ఆ ఇల్లు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచమంతా తిరుగాడుతోంది.

ఎవరీ అగాఫ్యా?
అగాఫ్యాను తెలుసుకోవాలంటే ముందు మతం గురించి తెలుసుకోవాలి. మతం మీద అచంచల విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారో తెలుసుకోవాలి. రష్యాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి సోవియెట్‌ యూనియన్‌ ఏర్పడ్డాక కొన్నాళ్లకు అక్కడి మత స్వేచ్ఛకు విఘాతం తలెత్తే పరిస్థితులు వచ్చాయి. రష్యాలో ఉంటున్న ‘పాత విశ్వాసులు’ అనే క్రైస్తవ చాందస వర్గంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు (వీరు పవిత్రంగా భావించే క్రాస్‌లో మూడు అడ్డగీతలు ఉంటాయి.) ఆ సమయంలో అంటే 1936లో నలుగురు సభ్యులున్న‘లైకోవ్‌ కుటుంబం’ అనే పాత విశ్వాసులు తమ మతాన్ని కాపాడుకోవడానికి సైబీరియా మంచు అడవుల్లోకి పారిపోయారు. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్న ఆ కుటుంబం వాయవ్య సైబీరియాలో యారినత్‌ నదికి సమీపంలో జీవించడం మొదలెట్టారు. ఆ భార్య, భర్త అక్కడకు వెళ్లాక వారికి మరో ఇద్దరు పిల్లలపు పుట్టారు. ఆ ఇద్దరిలో ఒకరు అగాఫ్యా.

ఆకలి జీవితం
సైబీరియా మంచు అడవి భయంకరమైనది. అది ఏ మాత్రం నివాస యోగ్యం కాదు. రష్యా ప్రభుత్వం తమ మీద తిరగబడే వారిని సైబీరియా జైలుకు పంపి తద్వారా వారికై వారు చచ్చేలా చేసేది. అలాంటి సైబీరియాలో అగాఫ్యా తల్లి, తండ్రి, ముగ్గురు తోబుట్టువులు జీవించడం మొదలుపెట్టారు. కేవలం తమ మతాన్ని కాపాడుకోవడానికి అక్కడ ఉండిపోయారు. వారు అక్కడ ఉన్నట్టుగా కాని, ఉంటున్నట్టుగా కాని ఎవరికీ తెలియదు. సమాచార వ్యవస్థ లేని ఆ రోజుల్లో వారు జీవించిన రోజులన్నీ చీకటి రోజులే. ముందు వారిలో తల్లి మరణించింది. ఆమె తన ఆహారాన్ని త్యాగం చేసి పస్తులు ఉండటం వల్ల చనిపోయింది. ఆ తర్వాత మిగిలిన తోబుట్టువులు ఒక్కొక్కరు రకరకాల ఆరోగ్య సమస్యలతో మరణించారు. 1988లో ఆఖరి తోడుగా ఉన్న తండ్రి కూడా మరణించాడు. అప్పటి నుంచి అంటే దాదాపు 30 ఏళ్లుగా అగాఫ్యా అక్కడ ఒంటరిగా జీవిస్తూ ఉంది.

ఉలిక్కిపడ్డ ప్రపంచం
1980లలో ఆ ప్రాంతంలో తిరుగుతున్న కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు మొదటిసారి అగాఫ్యాను అప్పటికి జీవించి ఉన్న ఆమె తండ్రిని చూశారు. చావు బతుకుల్లో ఉన్న అగాఫ్యా తండ్రిని ఆ భూగర్భ శాస్త్రవేత్తలలో ఒకడైన యెరొఫై సొదోవ్‌ కాపాడాడు. అంత నిర్మానుష్యమైన చోట వారు జీవించడాన్ని చూసి వారితో స్నేహం చేశాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి 2015 వరకూ అగాఫ్యాకు ఒకే ఒక్క నైబర్‌గా ఉన్నాడు కూడా. ఈ విషయం తెలుసుకున్న ఒక రిపోర్టర్‌ మొదటిసారిగా అగాఫ్యా ఉన్న చోటును సందర్శించి ఆమె గురించి కథనాలు రాసి ప్రచురించాడు. అగాఫ్యా కథ రష్యా అంతా సంచలనం అయ్యింది. ‘ఆమెకు మతి భ్రమించిందని నేను అనుకున్నాను. ఆమె మాట్లాడే భాష కూడా చాలా పాతది. ఆ మాటలు ఇప్పుడు చలామణిలో లేవు. కాని ఆమె వేట పద్ధతులు, ఇల్లు నిర్వహించుకునే తీరు చూసి ఆమె నార్మల్‌గా ఉందని తెలుసుకున్నాను’ అని ఆ రిపోర్టర్‌ రాశాడు. సోవియట్‌ యూనియన్‌ ప్రభుత్వం ఆమె ఖర్చులన్నీ భరించి ఒక నెల పాటు రష్యా టూరు చేయించింది. ఆ సమయంలోనే మొదటిసారి అగాఫ్యా కరెన్సీని, ఏరోప్లేన్‌లని, ట్రాఫిక్‌ని చూసింది. అయితే ఆమె ఏ కోశానా జనావాసాల్లో ఉండదలుచుకోలేదు. తిరిగి తన ఏకాంత హిమసీమకు వెళ్లిపోయింది.

తోడేళ్లు... ఎలుగుబంట్ల మధ్య...
అగాఫ్యా ఉంటున్న చోటుకు భూ మార్గం లేదు. హెలికాప్టర్‌లో వెళ్లాలి. లేదా నడుచుకుంటూ వెళ్లాలి. అక్కడ కరెంటు లేదు. హీటర్లూ లేవు. అయితే ఆమె అక్కడ ఒక్కతే ప్రాణాలతో జీవించి ఉంది. కొన్ని గొర్రెల్ని పెంచుకుంటూ వేట ద్వారా అడవిలో దొరికే కాయల ద్వారా తోడేళ్ల నుంచి ఎలుగుబంట్ల నుంచి కాపాడుకుంటూ జీవిస్తోంది. ‘మా కుటుంబం ఆకలికి తాళలేక ఒక్కోసారి బూట్లు ఉడకబెట్టుకొని తిన్న సందర్భాలు ఉన్నాయి’ అని ఆమె చెప్పింది.

చివరి శ్వాస వరకూ అక్కడే
సైబీరియాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోతాయి. ఇప్పుడు అగాఫ్యా ఉంటున్న ఇల్లు జీర్ణావస్థలో ఉంది. కాని ఆమె అక్కడి నుంచి రానంటున్నది. ‘నగరపు గాలి నాకు పడదు. జబ్బు పడతాను. అక్కడి ట్రాఫిక్, స్పీడ్‌ లైఫ్‌ చూస్తే నాకు యాంగ్జయిటీ వస్తుంది’ అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకే రష్యా సంపన్నుడు ఒలెగ్‌ దెరిపాస్కా ఆమెకు ఇల్లు కట్టడానికి ముందుకొచ్చాడు. ‘కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూనే ఆమె కాంటాక్ట్‌లో రాకుండా ఇల్లు కడుతున్నాం’ అని బాధ్యుడొకడు తెలిపాడు. ఇంటి సామాగ్రి ఆమె ఉంటున్న చోటుకు తీసుకుపోవడనికి కూడ పడవలు, హెలికాప్టర్లు ఉపయోగించాల్సి వస్తోంది. పని మొదలైంది. త్వరలో ముగుస్తుంది.

ప్రభుత్వం ఆమె నివాస ఎంపికను గౌరవించి తరచూ ఆమెను సందర్శించే వలంటీర్‌ను ఏర్పాటు చేసింది. నెలలో ఒకటి రెండుసార్లు ఎవరో ఒకరు వచ్చి ఆమెను గమనించి వెళుతుంటారు. అగాఫ్యా జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన డాక్యుమెంటరీలు యూట్యూబ్‌లో ఉన్నాయి. వాటిని చూస్తే ఆమె ఎలాంటి స్థితుల్లో నివసిస్తోందో అర్థమవుతుంది. మగతోడు లేనిదే స్త్రీ జీవించలేదని మగవాళ్లు, స్త్రీలు కూడా అనుకుంటూ ఉంటరు. దుర్గమారణ్యాలలో కూడా స్త్రీ ఒంటరిగా జీవించగలదని అగాఫ్యా నిరూపించింది. ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. లోకానికి తర్ఫీదు కాని పద్ధతుల్లో ఎందరో జీవిస్తూ ఉంటారు. ఆ కథలు బయటపడినప్పుడు ఆశ్చర్యపోవడమే మనం చేయగలం.
– సాక్షి ఫ్యామిలీ 

మరిన్ని వార్తలు