లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్‌ హౌస్‌ కట్టించాడు!!

11 Oct, 2021 17:19 IST|Sakshi

ప్రేమకు చిహ్నం చూపమంటే.. షాజహాన్‌ తన భార్య కోసం కట్టిన తాజ్‌మహల్‌ వెంటనే మదిలో మెదులుతుంది. ఐతే తరాలుగా ఎందరో తమకు ఇష్టమైన వారికోసం ఎన్నో కట్టారు. కానీ అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. తాజాగా ఉత్తర బోస్నియాకు చెందిన 72 యేళ్ల వ్యక్తి భార్య ​కోసం రొటేటింగ్‌ హౌస్‌ను కట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

ఆకు పచ్చ ముఖభాగం, రెడ్‌ మెటల్‌ రూఫ్‌తో 360 యాంగిల్‌లో తిరిగే ఈ రొటేటింగ్‌ హౌస్‌ను వోజిన్‌ కుసిక్‌ అనే వ్యక్తి, తన భార్య లుబికా కోసం నిర్మించాడు. కాలేజీ చదువుకూడా లేని కుసిక్ ఈ రొటేట్‌ హౌస్‌ను స్వయంగా డిజైన్‌ చేశాడట. కేవలం ఎలక్ట్రిక్ మోటార్లు, పాత మిలిటరీ రవాణా వాహన చక్రాలను ఉపయోగించి కట్టాడని అక్కడి స్థానిక మీడియాకు వెల్లడించాడు. జీవిత చరమాంకానికి చేరుకున్న తర్వాత, పిల్లలు కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఇన్నేళ్లకి నా భార్య కోరిక తీర్చడానికి సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు.

కుసిక్ వివాహం చేసుకున్నాక భార్య, బిడ్డల కోసం అప్పట్లో ఒక ఇంటిని నిర్మించాడట. ఐతే ఆ టైంలో బెడ్‌ రూం సూర్యునికి ముఖాముఖిగా ఉండాలని భార్య కోరడంతో, భార్య అభీష్టానికి తగినట్లుగా గదుల నిర్మాణాన్ని మార్చాడు. రోడ్డుకి ఎదురుగా ముఖ ద్వారం వచ్చింది. దీంతో రోడ్డు మీద వెళ్లేవారందరినీ చూడాలనుకోవడం లేదని భర్తకు పిర్యాదు చేసింది భార్య. చాలా కష్టమైన పనైనప్పటికీ భార్య కోరుకున్నట్లు ప్రతిదీ మార్చవలసి వచ్చేదట. ‘ఇప్పుడైతే, మా ముందు తలుపు కూడా తిరుగుతుంది. రోడ్డు మీద వ్యక్తులెవరైనా కనిపిస్తే, ఆమె ఇంటిని తనకిష్టం వచ్చిన వైప్పుకు తిప్పుకోవచ్చు’అని సరదాగా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. దీంతో ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!!

మరిన్ని వార్తలు