Azadi Ka Amrit Mahotsav: హర్‌ ఘర్‌ తిరంగా..మన ఇంటిపై మూడు రంగుల జెండా

21 Jul, 2022 00:36 IST|Sakshi

గొప్ప సందర్భం దగ్గర పడింది. దేశమంతా పండగ కళ రానుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో ఊరూ వాడా వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి ‘ఇంటిని’ కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరుతో మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? ఉత్సవ సందర్భంగా ఏం చేస్తే బాగుంటుంది? పిల్లల చేత ఏం చేయిస్తే బాగుంటుంది. కొన్ని ఆలోచనలు.

ఒక మహా దృశ్యాన్ని ఊహించండి. డ్రోన్‌ షాట్‌. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు డ్రోన్‌ కెమెరా ఎగురుతూ వుంటే ప్రతి ఇంటి మీదా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం. భారత ప్రజల సగర్వ స్ఫూర్తి. ఉప్పొంగే గుండెల దీప్తి. ఎలా ఉంటుంది? అద్భుతం కదూ.

ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు దేశంలోని 20 కోట్ల ఇళ్ల మీద త్రివర్ణ పతాకం ఎగరాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగిన ప్రచారం కోసం, ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు హోం శాఖ సూచనలు చేసింది. మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయమై ప్రచారం చేయాలని తెలిపింది. పిల్లలు, యువత, వయోజనులు అందరూ కలిసి ఈ తేదీలకు ముందు బృందాలుగా ఏర్పడి త్రివర్ణ పతాకాలు చేబూని పల్లెల్లో తిరుగుతూ ‘ప్రభాత్‌ ఫేరి’ చేస్తే ప్రజలు స్పందిస్తారని చెప్పింది.

గాంధీజీ 1930లలో దేశభక్తి ప్రేరేపించడానికి తెల్లవారుజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘ప్రభాత్‌ ఫేరి’ (ప్రభాత భ్రమణం) నిర్వహించేవారు. ఇప్పుడు ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగరాలంటే ఇలాంటి ప్రభాత భ్రమణాలు అవసరమని కేంద్రం తెలిపింది. సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలతో సెల్ఫీలు పెట్టమని చెప్పింది. మొత్తంగా ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడాలని కోరింది. మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జెండాలు ఎగరడానికి మూడు సైజులలో తయారీకి, అందుబాటుకు ఏర్పాట్లు చేసింది. ఇవి ఆన్‌లైన్‌లో, పోస్ట్‌ ఆఫీసుల్లో అందుబాటులోకి వస్తాయి.

ప్రతి ఇంటి పండగ
అవును. ఇది ప్రతి ఇంటి పండగ. ఒక అపూర్వఘట్టంలో మన ఇంటి మీద జెండా ఎగరనున్న పండగ. పెద్దలకి, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు ఇంతకు మించిన జ్ఞాపకం ఏమైనా ఉంటుందా? ఒక త్రివర్ణ పతాకంతో మించిన ఫ్యామిలీ ఫొటో ఉంటుందా? అయితే ఈ ఘట్టంలో మనం ఏ మాత్రం యోగ్యతతో ఉన్నామో చెక్‌ చేసుకోవాలి. కొన్ని తప్పక చేయాలి. కొన్ని చేయమని ఇతరులకు చెప్పాలి.

మన ఇంట్లో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చెక్‌ చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో గాంధీజీ ఆత్మ కథ ‘సత్యశోధన’ కనీసం ఉండాలి. నెహ్రూ రచనలు, భగత్‌ సింగ్‌ జీవిత కథ తెలుగు యోధులు అల్లూరి, ప్రకాశం పంతులు వంటి వారి పరిచయ పుస్తకాలు ఉండాలి.

నలుగురిలో కలిసి ‘జనగణమన’ పాడటం కాదు. ఒక్కళ్లమే తప్పుల్లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా జాతీయ గీతం పాడటం ప్రాక్టీసు చేయాలి. ‘వందేమాతరం’ కంఠతా పట్టాలి. ‘రఘుపతి రాఘవ రాజారామ్‌’, ‘సారే జహాసే అచ్ఛా’ వంటి గీతాలు పిల్లల చేత కంఠతా పట్టించాలి. ఉంటున్న వీధుల్లో, అపార్ట్‌మెంట్లలో ఆగస్టు పదిహేను లోపు వీలున్న సమయాల్లో, శని, ఆదివారాల్లో పిల్లల చేత ఇవన్నీ ప్రాక్టీసు చేయించాలి. వారికి క్విజ్‌లు పెట్టాలి.

ఈ మూడు రోజులు దేశ నాయకుల పోస్టర్లు ఇంట్లో అలంకరించాలి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సుభాస్‌ చంద్రబోస్, సర్దార్‌ పటేల్, భగత్‌ సింగ్, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌... వంటి నేతల్లో ఎవరో ఒకరన్నా మన డ్రాయింగ్‌ రూమ్‌లో కొలువుదీరాలి.

కమ్యూనిటీ ఉత్సవాలు జరుపుకోవాలి. అంటే వీధుల్లో, వాడల్లో, అపార్ట్‌మెంట్‌లలో ఆ మూడు రోజులు దేశభక్తి సినిమాలు ప్రదర్శించవచ్చు. నాటకాలు, ఫ్యాన్సీ డ్రెస్‌లు, ఏకపాత్రాభినయాలు... ఇవన్నీ పెద్దలు, పిల్లలు కలిసి చేయవచ్చు. ఫోన్‌ పలకరింపుల్లో ‘హలో’ బదులు ‘వందేమాతరం’, ‘బై’ బదులు ‘జైహింద్‌’ వాడితే ఆ అనుభూతే వేరు.

ఈ స్వాతంత్య్రం ఎందరో తెలిసిన తెలియని దేశభక్తుల త్యాగఫలం. వేలాది మంది తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వల్లే మనం ఇవాళ మన ఇంటిలో హాయిగా ఉన్నాం. కనుక వారందరి స్మృతిలో అన్నదానం, అనాథలకు సహాయం, అవసరంలో ఉన్నవారికి చేదోడు పనులు చేయడం కనీస కృతజ్ఞత.

ఇంటింటా త్రివర్ణపతాకం కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుదాం. సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. మూడు రోజుల పాటు దేశపటాన్ని కాషాయ, ధవళ, ఆకుపచ్చ వర్ణాలతో మిలమిలమెరిపిద్దాం.

మరిన్ని వార్తలు