Health Tips: షుగర్‌, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే...

25 Dec, 2021 09:47 IST|Sakshi

గోంగూర తేలిగ్గా తీసిపారేయద్దు

Health Benefits Of Gongura Leaves: ఆంధ్రమాతగా... శాకంబరీ వర ప్రసాదంగా పేరొందిన గోంగూరను తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే గోంగూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. గోంగూరలోని పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని కొవ్వును  నియంత్రిస్తుంది. వారానికి ఒక్కసారైనా గోంగూరతో పప్పు లేదా పచ్చడి చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తరచూ గోంగూరను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం...

గోంగూరలో పొటాషియం, ఐరన్‌ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది.

రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిని పెంచి, చక్కెర శాతాన్ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

గోంగూరలో విటమిన్‌ ఎ, బి 1, బి 2, బి 9 తో పాటు సి విటమిన్‌ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్‌ ఎ వల్ల కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

బీకాంప్లెక్స్, సి విటమిన్లతో దంత సమస్యలు దూరంగా ఉంటాయి. దీనిలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు పటిష్టంగా ఉంటాయి.

చదవండి: విటమిన్‌ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..!

అలాగే ఫోలిక్‌ యాసిడ్, మినరల్స్‌ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌ లాంటి భయంకర వ్యాధులను  నివారించడానికి గోంగూర ఉపయోగ పడుతుంది.

దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు ఏదో ఒక రూపంలో గోంగూరను తీసుకుంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.

రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూరను తీసుకోవాలి. అలాగే గోగుపూలను దంచి రసాన్ని తీసుకుని వడపోసి తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. 

కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల అలెర్జీలు వస్తుంటాయి. అటువంటి వాటిలో గోంగూర కూడా ఒకటి. కాబట్టి శరీరానికి సరిపడని వారు మినహా మిగిలిన అందరూ నిరభ్యంతరంగా గోంగూరను తీసుకోవచ్చు.  

చదవండి: Health Tips: జీలకర్రను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగుతున్నారా.. అయితే

మరిన్ని వార్తలు