How To Lose Belly Fat: బరువు, కొవ్వు రెండూ తగ్గుతాయి.. క్యారెట్‌, మెంతులు, జామ, బెర్రీస్‌, ఇంకా..

20 Dec, 2021 11:17 IST|Sakshi

చుట్టు కొలత తగ్గించండి

Belly Fat: పొట్ట, బరువు తగ్గి, చక్కగా స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా తగ్గేవారు మాత్రం తక్కువే. కారణం... తగ్గడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం, ఒకవేళ ఎంచుకున్నా, ఆ నియమాలను పాటించకపోవడం. కొన్ని వ్యాయామాలు పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి, కానీ కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల లేదా కేవలం ఆహార నియమాలు మాత్రమే పాటించడం వల్ల పొట్ట తగ్గదు.

ఆహార నియమాలతోపాటు వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతాం. ఆ మార్గాలేమిటో చూద్దాం. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు.

అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైలు, మసాలాలు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్‌గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. 

ఉదయానే నిద్రలేవడం: కొన్ని అధ్యయనాల ప్రకారం తేలిందేమంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. 

రన్నింగ్‌ : రోజూ ఉదయమే రన్నింగ్‌ చేయడం చాలా మంచిది. దీని వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్‌ బాగా ఉపయోగపడుతుంది. రన్నింగ్‌ చేయలేకపోతే కనీసం వేగంగా నడవడం మంచిది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. 

క్యారెట్‌: క్యారెట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి వాటిని స్మూతీ, సలాడ్, జ్యూస్‌గా తినవచ్చు. మీ డైట్‌ చార్ట్‌లో క్యారెట్‌లను చేర్చండి, ఇది మీ బరువును సమర్థవంతంగా తగ్గిస్తుంది. 

మెంతులు: సహజంగా రక్తంలో చక్కెర స్థాయులను మెరుగుపరచడంలో మెంతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఔషధం. ఈ ప్రత్యేక ఔషధ గుణాలు మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆహార పానీయాలలో మొలకెత్తిన మెంతులను ఉపయోగించడం మంచి ఫలితాలనిస్తుంది. 

జామ: పేదల యాపిల్‌గా పేరుగాంచిన జామకాయకు అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. ఇది చలికాలంలో పుష్కలంగా లభించే పండు. దీనిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

బెర్రీస్‌: బెర్రీస్‌ ఆరోగ్యానికి చాలా మంచివి. బెర్రీలు తినడం  ద్వారా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. బెర్రీల్లో చాలా రకాలుంటాయి. అన్నిరకాల బెర్రీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్‌ వంటి వాటిని ఉదయం లేచిన వెంటనే తినడం మంచిది.

వేపుళ్లు, పాక్డ్‌ ఫుడ్‌ వద్దు: ఆయిల్‌తో డీప్‌ ఫ్రై చేసి తయారు చేసే ఆహారపదార్థాలను తినకండి.  ఆయిల్‌తో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల కొవ్వు పేరుకు పోతుంది. అలాగే గుండె జబ్బులకు గురవుతారు. అధిక కొలెస్ట్రాల్‌ తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఆయిల్స్‌తో తయారు చేసిన ఆహారపదార్థాలను తినకండి.

వివిధ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్‌: మనకు మార్కెట్లో తెల్లగా నిగనిగలాడే బ్రెడ్‌ దొరుకుతూ ఉంటుంది. అయితే దాన్ని తినకపోవడం మంచిది. కొన్ని రకాల బ్రెడ్‌ లు గోధుమ రంగులో ఉంటాయి. అలాంటి బ్రెడ్‌ తినడం మంచిది. వీటిలో న్యూట్రిషన్‌ ఎక్కువగా ఉంటుంది. మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికి, అసలు కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఈ బ్రెడ్‌ ఉపయోగపడుతుంది.

చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..

మరిన్ని వార్తలు