82 ఏళ్ల తాత ఎగిరి గంతేశాడు.. కారణం ఏంటంటే!

3 Apr, 2021 06:46 IST|Sakshi
ప్రేమ గెలుచుకున్న తాత

యాభై ఏళ్ల తరువాత ఫస్ట్‌ లవ్‌ ను కలుసుకోబోతున్నందుకు 82 ఏళ్ల తాత ఎగిరి గంతేస్తున్నాడు. రాజస్థాన్‌లోని కులధార గ్రామంలో గేట్‌ కీపర్‌ గా పనిచేస్తోన్న తాత 30 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరీనాతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా తాతను ప్రేమించింది. వాళ్ల ప్రేమకు పెద్దవాళ్లు అడ్డుచెప్పలేదు, కానీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో విడిపోయారు. ఇది జరిగి 50 ఏళ్లు అయింది. తాజాగా మరీనా తాతకు ‘హౌ ఆర్‌ యూ, మై ఫ్రెండ్‌’ అని లెటర్‌ రాస్తూ...‘త్వరలో ఇండియా వచ్చి నిన్ను కలుస్తాను’ అని చెప్పడంతో తాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్‌.

పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ 82 ఏళ్ల వ్యక్తి రాజస్థాన్‌లోని కులధార గ్రామంలో గేట్‌ కీపర్‌గా పనిచేస్తున్నాడు. 30 లలో ఉన్నప్పుడు అతను ప్రేమలో పడ్డాడు. అది 1970. ఓ ఐదురోజుల పర్యటనలో భాగంగా మరీనా అనే అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి జైసల్మీర్‌ను చూసేందుకు వచ్చింది. తాతా, మరీనా అనుకోకుండా ఎదురు పడ్డారు. కళ్లూ కళ్లూ కలిశాయి. అంతే! తొలిచూపులోనే ఒకరితో ఒకరు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. అయితే ఇద్దరూ ఇష్టపడినప్పటికీ ..ఐదురోజులు ఒకరినొకరు చూసుకుంటూ గడిపారు. మరీనా పర్యటన ముగియడంతో ఆస్ట్రేలియా తిరిగి వెళ్తూ.. తాతకు ‘ఐ లవ్‌ యూ’ అని చెప్పి, తన అడ్రస్‌ ఇచ్చింది. ఆ తరువాత ఇద్దరూ ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవారు.

ఉత్తరాలతో వారి ప్రేమ మరింత బలపడడంతో.. మరీ నా తాతను ఆస్ట్రేలియా రమ్మని పిలిచింది మరీ నా. పిలిచిన వెంటనే తాత రెక్కలు కట్టుకుని మరీ ఆస్ట్రేలియాలో వాలిపోయాడు.అక్కడ ఓ మూడు నెలలపాటు ఎంతో ఆనందంగా గడిపారు ఇద్దరూ. ఆ తరువాత మరీనా తాతను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండమని అడిగినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. తాత ఇండియా వదిలివెళ్లడానికి ఇష్టపడలేదు, మరీనా కూడా ఆస్ట్రేలియా వదిలి ఇండియాలో ఉండడానికి ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ దీర్ఘకాలం కలిసి ఉండడం కుదరదని నిశ్చయించుకుని విడిపోయారు.విడిపోవడం ఇద్దరికీ ఇష్టంలేకపోయినా తమ తమ దేశాలను వదిలి వెళ్లలేక ఇద్దరూ ప్రేమకు దూరమయ్యారు.

ఆ తరువాత ఇద్దరూ తనకి పెళ్లి అయ్యిందా? నేను గుర్తుంటానా? అని అనుకునేవారు. ఇది ఇలా కొనసాగుతుండగానే కులధారలో తాతకు గేట్‌కీపర్‌ ఉద్యోగం దొరికింది. దీంతో ఇంట్లో వాళ్లు పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో తాత మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కలగడంతో వారికి మంచి భవిష్యత్‌ అందించే క్రమంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ పెద్దయ్యారు. రెండేళ్ల క్రితం తాత భార్య మరణించింది. సంసార సాగరంలో తాత పడిపోయినప్పటికీ మరీనా పెళ్లి అయి ఉంటుందా? తనని నేను మళ్లీ కలుసుకోగలనా? అనుకుంటూ ఉండేవాడు. అయితే ఇక్కడితో తాత ఫస్ట్‌ లవ్‌స్టోరీ ముగిసిపోలేదు.

రెండు నెలల క్రితం తాతకు మరీనా నుంచి ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘‘హౌ ఆర్‌ యూ, మై ఫ్రెండ్‌? నేను ఇప్పటిదాకా ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. త్వరలోనే ఇండియా వస్తున్నాను’’ అని చెప్పింది. యాభై ఏళ్ల తరువాత కూడా మరీనా తనని గుర్తుపెట్టుకోవడంతో.. తాత ఆశ్చర్యానందాలలో మునిగి తేలాడు. ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఇద్దరూ లవ్‌ బర్డ్స్‌లా రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ తమ బంధాన్ని మరింత దృఢపరుచుకున్నారు. తాత ఈ విషయాన్నీ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ వారితో పంచుకోవడంతో 50 ఏళ్ల నాటి ప్రేమ వెలుగులోకి వచ్చింది. తాత మాట్లాడుతూ..‘‘మరీనా మళ్లీ నా దగ్గరకొస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

ఇప్పుడు నా మనసు 21 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతోంది. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ నా ఫస్ట్‌ లవ్‌ ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని తాత ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం సోషల్‌ మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండడంతో నువ్వు గ్రేట్‌ తాత! అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు