ఎనిమిదో అడుగు

13 Jan, 2021 08:25 IST|Sakshi

నటి అనుష్క, రెజ్లర్‌ బబిత ఇద్దరూ ఒకే రోజు తల్లులు అయ్యారు. అనుష్కకు అమ్మాయి. బబితకు అబ్బాయి. ఎవరు పుట్టినా ఈక్వల్‌ ఈక్వల్‌ అని ముందు నుంచీ ఇద్దరూ అంటూనే ఉన్నారు. అందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా ఉంటూ వచ్చారు. బబిత అసలు తన పెళ్లి రోజే ఆడబిడ్డ కోసం ‘ఎనిమిదో అడుగు’ వేసింది! ‘ఆడబిడ్డను సంరక్షిస్తాను, చదివిస్తాను, ఆడిస్తాను’ అని ప్రమాణం చేస్తూ అందుకు సంకేతంగా ఏడడుగుల తర్వాత ఎనిమిదో అడుగు వేసింది. అనుష్క అయితే ఆరో నెలలో.. ‘అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకటే. అబ్బాయి పుట్టడం స్పెషలేం కాదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక శక్తిమంతమైన పోస్ట్‌ పెట్టారు. ఈ బెస్ట్‌ మమ్మీల జెండర్‌ ఈక్వాలిటీ ఆదర్శవంతమైనది. ‘ఎనిమిదో అడుగు’లాంటిది. 

జనవరి 11న ముంబైలో అనుష్కా శర్మ, బబితా ఫోగట్‌ తల్లులయ్యారు. సాధారణ వ్యక్తి అయినా, సెలబ్రిటీ అయినా తల్లి తల్లే. అయితే ఈ తల్లులు ప్రత్యేకమైనవారు. సమాజానికి ఆదర్శప్రాయంగా ఉన్నవారు. తల్లి కాబోతున్నట్లు తెలిసిన నాటి నుంచీ బబిత, అనుష్క ‘ఏ బిడ్డయినా ఒక్కటే’ అని ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. ‘ఆడపిల్ల తక్కువ కాదు, మగపిల్లాడు ఎక్కువా కాదు. ఇద్దర్నీ సమానంగా చూడాలి. సమానంగా పెంచాలి’ అని పోస్ట్‌లు పెడుతూ వస్తున్నారు. మరి ప్రముఖులు, డబ్బున్నవాళ్లు పెంచినట్లుగా సగటు తల్లిదండ్రులు ఆడపిల్లని మగపిల్లాడితో సమానంగా పెంచగలరా? అని సోషల్‌ మీడియాలో వీళ్లకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ‘‘పెద్ద తల్లి అయినా, పేద తల్లి అయినా ఒకటే. తల్లి ప్రేమలో తేడా ఉండదు. తేడా చూపించకూడదు’’ అని బబిత, అనుష్కల సమాధానం. ఈ ప్రశ్నలూ సమాధానాల వరకూ ఎందుకు? ఆడపిల్ల అని ఇంట్లోనే ఉంచేస్తే బబిత రెజ్లర్‌ అయి ఉండేవారా? దేశానికి మెడల్స్‌ సాధించుకుని వచ్చేవారా? అనుష్క నటి, నిర్మాత అయి ఉండేవారా? బబిత (31), అనుష్క (32) ఇంచుమించు ఒక ఈడు వారు. పురుషాధిక్య ప్రపంచంలోని అవరోధాలను దాటుకుని తమకంటూ ఒక గుర్తింపుతో నిలబడినవారు. అనుష్క అయోధ్య అమ్మాయి. బబితది హర్యానా. బబిత పేదరికం గురించి తెలిసిందే. అనుష్క కూడా అంత తేలిగ్గా ఏమీ ఇప్పటి తన స్థానానికి చేరుకోలేదు. బాలీవుడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. తండ్రి మిలటరీ ఆఫీసర్, తల్లి గృహిణి. ఇక చూడండి.. సంప్రదాయం నుంచి గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఎంత కష్టమో. అందుకే ఈ ఇద్దరి మాట విలువైనది. తొలిసారి తల్లులు కాబోతున్న వారికి, ఇప్పటికే తల్లులైనవారికీ శిరోధార్యమైనది. తల్లి సపోర్ట్‌ ఉంటేనే తండ్రీ ఆడపిల్లల్ని వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా పెంచగలడు. 

                                                   ∙∙∙

సీమంతం జరిగేటప్పుడు బబిత ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆ వేడుకలో ఆమె రెండు కేక్‌లను కట్‌ చేశారు. ఒకటి బ్లూ కలర్‌ కేక్‌. ఇంకొకటి పింక్‌ కలర్‌ కేక్‌. బ్లూ మగపిల్లవాడికి. పింక్‌ ఆడపిల్లలకు. ఎంత అందమైన భావన. పెళ్లిలో కూడా బిబిత, ఆమె భర్త సుహాగ్‌ ఏడడుగుల తర్వాత ఎనిమిదో అడుగు వేశారు! ఆ ఎనిమిదో అడుగును బబితే భర్త చేత వేయించింది. ఆడబిడ్డను చదివిస్తానని, సంరక్షిస్తానని, ఆడుకోనిస్తానని ఆ దంపతులు చేసిన ప్రమాణానికి సంకేతం ఆ ఎనిమిదో అడుగు. అనుష్కకు కూడా ఇంత అందంగానే ఆలోచించారు. తను ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘ఎవర్ని కోరుకుంటున్నారు? మగబిడ్డనా, ఆడపిల్లనా?’ అని అభిమానులు ఆమెను అడుగుతుండేవారు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఆ పోస్ట్‌. ‘‘మన సమాజంలో మగ బిడ్డ పుట్టడం ఒక ప్రత్యేక విషయం. ఈ దృష్టిని మనం వదులుకోవాలి. ఆడపిల్లల్ని రెస్పెక్ట్‌ చేసేలా మగపిల్లల్ని పెంచడం.. అదీ మనకు ఉండాల్సిన ప్రత్యేకత. తల్లిదండ్రుల బాధ్యత కూడా. మహిళలు సురక్షితంగా, భద్రంగా మసులుకునేలా అబ్బాయిని పెంచాలి. అప్పుడు మనకు అబ్బాయి ఉండటం గొప్ప అవుతుంది’’ అని ఆ పోస్ట్‌లో అనుష్క రాశారు. సందేహం లేదు అనుష్క ఆశించినట్లు బబిత కొడుకు పెరుగుతాడు. బబిత కోరుకున్నట్లు అనుష్క కూతురు ఈక్వల్‌ ఈక్వల్‌గా పెరుగుతుంది. 

మరిన్ని వార్తలు