Aaron Sanderson King Of Piel Island: రాజయోగం.. ఎలక్ట్రీషియన్ వృత్తి నుంచి ఓ దీవికి రాజుగా..!

31 Jul, 2022 17:10 IST|Sakshi

నిన్న మొన్నటి వరకు అతడొక సాధారణ ఎలక్ట్రీషియన్‌. ఇప్పుడతడు ఏకంగా ఒక దీవికి రాజయ్యాడు. వాయవ్య ఇంగ్లాండ్‌లోని కంబ్రియా కౌంటీ ఫర్నెస్‌ తీరానికి దాదాపు మైలు దూరంలో ఉంది ‘పీల్‌ ఐలాండ్‌’ అనే దీవి. దీని విస్తీర్ణం 26 ఎకరాలు. ఈ దీవిని సొంతం చేసుకోవడానికి సుమారు రెండువందల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు.

అదృష్టం వరించడంతో ఆరన్‌ సాండర్సర్‌ అనే ముప్పయి మూడేళ్ల సామాన్య ఎలక్ట్రీషియన్‌ ఈ దీవిని ఇటీవల సొంతం చేసుకోగలిగాడు. అంతేకాదు, 170 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ‘కింగ్‌ ఆఫ్‌ పీల్‌ ఐలాండ్‌’గా త్వరలోనే పట్టాభిషక్తుడు కానున్నాడు.

ఇంతకీ ఈ సామాన్యుడు ఎలా రాజు అయ్యాడనుకుంటున్నారా? అదంతా ఒక సంప్రదాయ ప్రక్రియ ప్రకారం జరిగిపోయింది. పర్యాటక కేంద్రమైన ‘పీల్‌ ఐలాండ్‌’లో ఒక పబ్‌ ఉంది. ఇంగ్లాండ్‌ నలుమూలల నుంచి ఇక్కడకు జనాలు తరచుగా వస్తుంటారు. అప్పుడప్పుడు చుట్టుపక్కల యూరోపియన్‌ దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ దీవిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

పర్యాటకులు ఇక్కడి టెంట్లలో బస చేస్తుంటారు. టెంట్లలో బస చేయడానికి రోజుకు 5 పౌండ్లు (సుమారు రూ.500) వసూలు చేస్తారు. చిరకాల సంప్రదాయం ప్రకారం క్రంబియా కౌంటీ ఈ దీవిలోని పబ్‌ను నడిపేందుకు టెండర్లు ఆహ్వానించింది. రెండువందల మందికి పైగా దీనిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు ఆరన్‌ సాండర్సన్‌కు ఇది దక్కింది. పబ్‌ యాజమాన్యంతో పాటు, దీవికి రాజుగా పట్టాభిషేకం, దాంతో పాటే ఇంగ్లాండ్‌ రాణి ఎలిజబెత్‌ అనుగ్రహించే ‘నైట్‌హుడ్‌’ కూడా ఇతడికి త్వరలోనే దక్కనున్నాయి.

కౌన్సిల్‌ సభ్యులు ఈ విషయం తనతో చెబితే మొదట నమ్మలేకపోయానని, ఈ దీవికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి కానుండటం ఎంతో సంతోషంగా ఉందని సాండర్సన్‌ మీడియా ఎదుట  ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పీల్‌ ఐలాండ్‌లో పబ్‌తో పాటు పురాతనమైన కోట కూడా పర్యాటక ఆకర్షణగా ఉంటోంది. ఫర్నెస్‌ ప్రాంతానికి చెందిన మతగురువులు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ పెద్ద రాతికోటను నిర్మించారు. ఈ దీవి నుంచి ఫర్నెస్‌ తీరానికి రాకపోకలు జరిపేందుకు ఒక మరపడవ అందుబాటులో ఉంటుంది. ఈ మరపడవలో పదిహేను నిమిషాల్లో ఫర్నెస్‌ తీరానికి చేరుకోవచ్చు.

రాడ్‌ స్కార్‌ అనే వ్యక్తి ఇప్పటివరకు ఈ దీవికి రాజుగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సాండర్సన్‌ అతడి నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించి, అధికార లాంఛనాలతో పట్టాభిషిక్తుడు కానున్నాడు. పట్టాభిషేకం తర్వాత పబ్‌ నిర్వహణతో పాటు దీవి మొత్తం అతడి అధీనంలోనే ఉంటుంది. అదృష్టం కలిసొస్తే, ఇలా అనుకోకుండానే ‘రాజ’యోగం పడుతుందేమో! 

మరిన్ని వార్తలు