అపురూప కల్పన

10 Feb, 2023 01:55 IST|Sakshi

ఆర్కిటెక్చర్‌ + ఆర్ట్‌

ముంబైకి చెందిన ఆష్తి మిల్లర్‌ను ‘ఆర్కిటెక్ట్‌’ అంటే మాత్రమే సరిపోదు. అలా అని ‘ఆర్ట్‌’కు మాత్రమే పరిమితం చేయలేము. ఇలస్ట్రేషన్, గ్రాఫిక్‌ డిజైన్‌లతో  తనప్రోఫెషనల్‌ కెరీర్‌కు కొత్త మెరుపు తీసుకువచ్చింది. అదే తన ప్రత్యేకశైలిగా మారింది...

నేను చేసే వర్క్స్‌లో వీలైనన్ని వివరాలు ఉండేలా జాగ్రత్త పడతాను. దీంతో వీక్షకులు అందులో కొత్తదనాన్ని చూస్తారు. నా ఆలోచన విధానం ఏమిటో తెలిసిపోతుంది. నా మది ఎప్పుడూ రకరకాల ఐడియాలతో నిండిపోయి ఉంటుంది. వాటిలో నుంచి కొన్ని ఐడియాలను తీసుకొని పనిచేస్తాను. – మిల్లర్‌

ముంబైలోని ఆష్తి మిల్లర్‌ ఇల్లు క్రియేటివిటీకి సంబంధించిన విషయాలకు కేంద్రంగా ఉండేది. తల్లి ఫైన్‌ ఆర్టిస్ట్‌. తండ్రి ఆర్కిటెక్ట్‌. ఇంటినిండా ఆర్ట్‌కు సంబంధించిన ముచ్చట్లే! చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోపాటు రకరకాల మ్యూజియమ్‌లు, ఆర్ట్‌గ్యాలరీలకు వెళుతుండేది మిల్లర్‌. అవి ఊరకే ఉండనిస్తాయా! తనలో సృజనాత్మకమైన ఆలోచనలను పెంపొందించాయి. సక్సెస్‌ఫుల్‌ ఆర్కిటెక్ట్‌గా తండ్రికి మంచి పేరు ఉంది. అయితే అది రాత్రికి రాత్రి వచ్చేందేమీ కాదు. ఎంతో కష్టపడ్డాడు. తండ్రి కష్టం తనకు ఆదర్శం అయింది. తండ్రి బాటలోనే ఆర్కిటెక్చర్‌ కోర్సు చదువుకుంది. ‘మిల్లర్‌ ఇంక్‌ స్టూడియో’ మొదలు పెట్టింది. ఈ స్టూడియో ద్వారా ప్రోఫెషనల్‌ కెరీర్‌ ‘ఆర్కిటెక్ట్‌’ను తన క్రియేటివిటీకి సంబంధించిన ఇలస్ట్రేషన్‌ అండ్‌ గ్రాఫిక్‌ డిజైన్‌లతో మిళితం చేసి యూనిక్‌ స్టైల్‌తో తిరుగులేని విజయం సాధించింది మిల్లర్‌.

జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తోంది. మారథాన్‌లకు సంబంధించిన మెడల్స్‌ను యూనిక్‌ స్టైల్‌లో డిజైన్‌ చేయడంలో తనదైన ప్రత్యేకత సాధించుకుంది. ఒక ఫిన్‌టెక్‌ కంపెనీ బ్రాండ్‌కు సంబంధించి మనీఆర్ట్‌ సిరీస్‌ కోసం మిల్లర్‌ సృష్టించిన 14 లేయర్‌లతో కూడిన ఆర్ట్‌ వర్క్‌కు మంచి పేరు వచ్చింది. ప్రతి లేయర్‌లో వివిధ దేశాలకు చెంది కరెన్సీ, వివిధ భౌగోళిక ప్రాoతాలకు సంబంధించిన ఎలిమెంట్స్‌ ప్రతిఫలిస్తాయి.

మిల్లర్‌ ఆర్ట్‌వర్క్స్‌ దేశవిదేశాల్లోని ప్రసిద్ధ గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి. ‘మిల్లర్‌ ఆర్ట్‌వర్క్‌లో తాజాదనం కనిపిస్తుంది. సూటిగా మనసును తాకే ఆకర్షణీయత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలలో ఎన్నో  కట్టడాలు ఉన్నాయి. వాటి వైవిధ్యాన్ని తన కళలోకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంది’ అంటుంది క్యూరెటర్‌ అమ్‌బ్రోగి.

‘మిల్లర్‌లోని ప్రత్యేకత ఏమిటంటే ఒకే సమయంలో భిన్నమైన విషయాల గురించి ఆలోచించడం. వాటిని సృజనాత్మకంగా సమన్వయం చేసుకోవడం. ఆమె ఆర్ట్‌వర్క్స్‌లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, శిల్పం, చిత్రం మిళితమై కనిపిస్తాయి’ అంటున్నాడు ఆర్కిటెక్చరల్‌ సంస్థ పికార్ట్‌కు చెందిన ఆంథోనీ మార్కెస్‌.ఆంథోనితో కలిసి అర్బన్‌ మాస్టర్‌ ప్లాన్స్‌ నుంచి పర్సనల్‌ స్పేసెస్‌ వరకు ఎన్నోప్రాజెక్ట్‌లలో పనిచేసింది ఆష్తి మిల్లర్‌.‘మోర్‌ ఈజ్‌ బెటర్‌’ అనే ఫిలాసఫీని నమ్ముతున్న ఆష్తి మిల్లర్‌ తాజాగా ఫోర్బ్స్‌ ఇండియా ‘30 అండర్‌ 30’లో చోటు సంపాదించింది.

మరిన్ని వార్తలు