Woman combat pilot: ఫస్ట్‌ టైమ్‌ అభిలాష నెరవేరింది

27 May, 2022 00:18 IST|Sakshi
అభిలాష బరాక్‌; కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ నాసిక్‌లో...

చిన్నప్పుడు అభిలాషకు తండ్రి కథలు చెప్పేవాడు. అవి కాలక్షేప కథలు, కంచికి వెళ్లే కథలు కావు. మన వీరసైనికుల నిజమైన జీవిత కథలు. ఆ కథలు వింటూ పెరిగిన అభిలాష భారత సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంది. తాజాగా ‘ఇండియన్‌ ఆర్మీ ఫస్ట్‌ ఉమన్‌ కంబాట్‌ ఏవియేటర్‌’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్‌ అభిలాష బరాక్‌.

అభిలాష బరాక్‌కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్‌సింగ్‌ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్‌లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది. అలా మిలిటరీలో పనిచేయాలనే కలకు అంకురార్పణ జరిగింది.
ఒకరోజు ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో తన సోదరుడి పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు హాజరైంది అభిలాష. ఆ వాతావరణం తనను ఎంత ఉత్తేజపరిచింది అంటే...పనిచేస్తే మిలిటరీలోనే పనిచేయాలన్నంతగా.

‘మిలిటరీ యూనిఫామ్‌’లో తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకునేంతగా!
‘నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న రోజు అది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అభిలాష.
దిల్లీ టెక్నాలజికల్‌ యూనివర్శిటీలో బీటెక్‌ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కాప్స్‌’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్‌ మిలిటరీ కోర్స్‌లు పూర్తిచేసింది.
‘ఇండియన్‌ ఆర్మీ ఏవియేషన్‌ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్‌ ఏవియేషన్‌ కోర్స్‌ విజయవంతంగా పూర్తి  చేసిన కెప్టెన్‌ అభిలాష ఇండియన్‌ ఆర్మీ ఫస్ట్‌ ఉమన్‌ కంబాట్‌ ఏవియేటర్‌...’ అని ఆర్మీ తన అధికార ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా తెలియజేసింది.

ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్‌ కాప్స్‌కు ఉన్న ఘనచరిత్ర తక్కువేమీ కాదు. రుద్ర, చీతా, ధృవ...మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్‌ చేయడంతో పాటు సియాచిన్‌లాంటి సున్నిత ప్రాంతాలలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది.
 ‘రెట్టించిన అంకితభావంతో పనిచేయడానికి తాజా బాధ్యత ప్రేరణ ఇస్తుంది’ అంటుంది హరియాణాకు చెందిన 26 సంవత్సరాల అభిలాష ‘స్విఫ్ట్‌ అండ్‌ ష్యూర్‌’ అనేది మన సైన్యానికి సంబంధించిన లక్ష్య ప్రకటిత నినాదం. ఈ నినాదాన్ని వేగంగా అందుకున్న యువ సైనికులలో అభిలాష ఒకరు. ఆమెకు అభినందనలు.

మరిన్ని వార్తలు