సంస్కారాలను బోధించే కల్పసూత్రాలు

6 Nov, 2020 00:13 IST|Sakshi

వేదవాఙ్మయం

కల్పసూత్రాలు(శాస్త్రాలు)ఋగ్వేదాది వేదాలవారీగా శాఖాభేదంతో అనేకమంది ఋషులు రచించారు. అవి ఆ ఋషుల పేర్లమీదే ప్రచారం పొందాయి. ఋగ్వేదానికి ఆశ్వలాయన, సాంఖ్యాయన కల్పసూత్రాలు, శుక్ల యజుర్వేదానికి కాత్యాయన, కృష్ణ యజుర్వేదానికి ఆపస్తంభీయ, బోధాయన, వైఖానస, సత్యాషాఢ, భారద్వాజ, అగ్నివేశ కల్పసూత్రాలు, సామవేదానికి లాట్యాయన, ద్రాహ్యాయన, జైమినీయ కల్పసూత్రాలు ప్రచారంలో వున్నాయి. చదవండి: (కల్పసూత్రాలు)

ఎవరెవరు ఏయే కర్మలను ఆచరించాలి, ఏయే కర్మలకు ఏయే మంత్రాలను ఉపయోగించాలి, దానికి కావల్సిన సామగ్రి, దానికి అధిష్టాన దేవత, యజ్ఞాయుధాలు ఏమేమి కావాలి, అవి ఎన్ని వుండాలి, వాటి ఆకారం ఏమిటి, అవి దేనితో తయారు చెయ్యాలి, ఎంతమంది ఋత్విక్కులు కావాలి, యజ్ఞగుండాలు ఎన్ని కావాలి, వాటి ఆకారాలు, వాటి కొలతలు, అవి ఎలా నిర్మించాలి, హోమ ప్రక్రియలు, హోమంలో వెయ్యాల్సిన హవిస్సులు, హోమ సమిధలు తదితర విషయాలను వివరిస్తాయి కల్పసూత్రాలు.. కల్పశాస్త్రాలలోని విషయాలన్నీ ముఖ్యంగా సూత్రాల రూపంలోనే వుంటాయి. సూత్రమంటే విశాలమైన విషయాన్ని ఒక చిన్న వాక్యరూపంలో చెప్పడం. శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, శుల్బ (శిల్ప) సూత్రాలు అని కల్ప సూత్రాలు నాలుగు రకాలుగా విభజించారు.

శ్రౌత సూత్రాలు శృతిని (వేదాన్ని) ఆధారం చేసుకుని చెప్పబడ్డాయి. ఉదాహరణకు, ఋగ్వేదంలో వివాహ సూక్తం, అథర్వణ వేదంలో వివాహ సంస్కారానికి సంబంధించిన సుమారు నూటనలభై మంత్రాలు మొదలైనవాటి ఆధారంగా అన్నమాట. వివాహం, గర్భాదానం, పుంసవనం, అక్షరాభ్యాసం, బ్రహ్మచర్యం, అంత్యేష్టి వంటి కొన్ని సంస్కారాల తాలూకు కొన్నిమంత్రాలు మనకు వేదాలలో కనబడినా, వాటికి సంబంధించిన నిర్దిష్టమైన విధి విధానాలు, పద్ధతులు వేదాలలో కనబడవు. వీటికి సంబంధించిన సంపూర్ణమైన వివరణలు మనకు శ్రౌత సూత్రాలే అందిస్తాయి. కర్మ సిద్ధాంత మూలాలు మనకు మొదటగా ఋగ్వేదంలోనూ ఆతర్వాత అథర్వణవేదంలోనూ కనిపిస్తాయి. ఈ సందర్భంగా అథర్వణవేదం గురించి కొంత చెప్పుకోవాల్సిన అవసరం వుంది.

వేదాలలో అథర్వణవేదం చివరిదే అయినా, అందులో దేవతా స్తోత్రాలకు సంబంధించిన మంత్రాలే కాకుండా, వేదకాలంలోని సమాజం, దానికి సంబంధించిన చరిత్ర, మానవుల జీవన విధానం, ఇత్యాది అంశాలను అధ్యయనం చెయ్యడానికి అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కారాలు, గృహాలు, పాడిపంటలు, వ్యవసాయం, కులమతాలు, వ్యాపార వాణిజ్యాలు, ప్రభుత్వాలు, రాజ్యాంగాలు, కళలు, వస్తు ఉత్పత్తులు, పరిశ్రమలు, భూగోళ ఖగోళ విఙ్ఞానం, వేదాంతం, విశ్వం మొదలగు అంశాలగురించి అథర్వణవేదం ఎంతో సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, ‘‘సర్వప్రాణుల మనుగడకు అన్నమే ఆధారం. ఆ అన్నానికి ఉత్పత్తిస్థానం క్షేత్రం (పొలం).ఆ క్షేత్రాన్నీ, అశ్వాన్నీ పోషిస్తూ క్షేత్రపతి (రైతు) మా మేలుకోసం కృషి (వ్యవసాయం) చేస్తాడు. ఆ బుద్ధిశాలి ఎంతో విఙ్ఞానం గడించి మాకు సుఖం కలిగించుగాక..!’’ అంటూ లౌకిక విషయాలైన వ్యవసాయ ప్రాధాన్యత, రైతుల ప్రాముఖ్యత గురించి అమోఘంగా స్తుతించిందీ వేదం. 

ఈ శ్రౌత సూత్రాలు, గార్హపత్య, ఆహవనీయ, దక్షిణ అనే మూడురకాల అగ్నులు వుపయోగించి చేసే యాగాలనుండి ఐదురకాల అగ్నులు ఉపయోగించి చేసే మహా క్రతువుల వరకు అన్నింటి గురించీ తెలియజేస్తాయి. ఉదాహరణకు, ఉపనయనంలో, బ్రాహ్మణులకు గాయత్రి, క్షత్రియులకు త్రిష్టుప్, వైశ్యులకు జగతీ మంత్రాలను ఉపదేశించే విధానాన్ని తెలిపేది శ్రౌత సూత్రాలే.అగ్న్యాధానం చెయ్యడానికి, వసంతే బ్రాహ్మణః గ్రీష్మే రాజన్యః వర్షాసు రథకారః శరదివైశ్యః అను వేద ప్రమాణం చేత, పూర్వకాలంలో ప్రతి వసంతఋతువులోను సోమయజ్ఞం చేసేవారు. ఇందుకు అవసరమైతే భిక్షాటన కూడా చేసేవారు. వీరిని ‘వసంత సోమయాజులు’ అనేవారు.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు

మరిన్ని వార్తలు