వివాహానికి ఏమి పరిశీలించాలి?

27 Feb, 2021 07:09 IST|Sakshi

షోడశ సంస్కారాలు

వివాహం ఎన్ని విధాలో గత వారంలో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వివాహానికి ఏమి పరిశీలించాలో అవలోకిద్దాం. ఒకే గోత్రం, లేదా ఒకే ప్రవర కలిగినవారు వివాహం చేసుకోవడాన్ని నిషేధించారు. తండ్రికి 7 తరాలవరకు, తల్లికి 5 తరాలవరకు సపిండురాలైన కన్యను చేసుకోరాదని శాస్త్రవచనం. అందరూ కూడా తమ వర్ణానికి చెందిన కన్యనే వివాహమాడాలని స్మృతులు శాసించినాయి. కానీ, బ్రాహ్మణులు మూడువర్ణాలకు చెందిన కన్యలని, క్షత్రియులు రెండువర్ణాలకు చెందిన కన్యలని, వైశ్యులు వైశ్యవర్ణానికి చెందిన కన్యలను వివాహమాడవచ్చు అని కొన్ని స్మృతులు బోధించాయి. దీనిని అనులోమ వివాహం అంటారు. కానీ నిమ్నవర్ణాలవారు హెచ్చువర్ణాలవారితో వివాహానికి స్మృతులు అంగీకరించలేదు. దీనిని విలోమవివాహం అంటారు.

వర్ణధర్మాలను పాటించనివారు, మగ సంతానం లేనివారు, వేదాధ్యయనం చేయనివారు, దొంగలు, మోసగాళ్ళు, నిందలుమోసేవాళ్ళు, రాజద్రోహులు, కురూపులు, క్షయ, కుష్ఠు, పాణ్డు రొగపీడితులు,  వంశపారంపర్యంగా వచ్చు రోగపీడితులైనవారు, మిక్కిలి పొడుగువారు, మరగుజ్జులు, విపరీతమైన నల్లటి / తెల్లటి శరీరంగలవారు, వికలాంగులు మొదలగు వారితో వివాహాలను శాస్త్రాలు నిషేధించాయి. ఇరువర్గాలవారు, విద్య, ఐశ్వర్యాదులలో సమానంగా వున్నప్పుడే ఆ వివాహ బంధం నిలచునని శాస్త్రకారుల వచనం.

వరుణ్ణి ఎంచుకునేముందు, అతడి గుణగణాలతోబాటు, అతని వంశం, శాస్త్రపరిజ్ఞానం, వయస్సు, ఆరోగ్యం, శరీరపుష్టి, బంధుబలగం, సంపదలు అను ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నియమం పెట్టారు. రోగాలతో వున్నవానికి, మారువేషాలలో తిరిగే వానికి, అవయవ సౌష్టవం లేనివానికి, విపరీతమైన బలం గలవానికి, బలహీనునికి, సంపాదన లేనివానికి, గుణహీనునికి, బుద్ధిహీనునికి, విదేశాలలోవుండువానికి, కన్యను ఇవ్వరాదని శాస్త్ర నియమం. శారీరక పరిపుష్టత, ఆరోగ్యరీత్యా, వధువు వయస్సు వరుని వయస్సుకంటే తక్కువగా వుండాలని అందరు శాస్త్రకారులు నిర్ణయించిన విషయం. శాస్త్రకారులందరు, వధువు రజస్వల కాకమునుపే వివాహం చేయాలని తీర్మానించారు.

వివాహానికి ఉపయుక్తమైన కాలం గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తంచేశారు స్మృతికారులు. కొందరు ఉత్తరాయణంలో మాత్రమే చెయ్యాలని, మరికొందరు సంవత్సరమంతా చెయ్యొచ్చని చెప్పారు. చైత్ర, పుష్యమాసాలు పనికిరావని కొందరు చెప్పారు. ఆషాఢ, మార్గశిర, ఫాల్గుణ మాసాలు విడిచిపెట్టాలని కొందరు, అన్ని మాసాలలో చెయ్యచ్చని కొందరు చెప్పారు. రోహిణీ, మృగశిర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణ, స్వాతి నక్షత్రాలు మంచివని కొందరు చెప్పియున్నారు. బుధ, గురు, శుక్రవారాలు వివాహానికి మంచివని కొందరు అంటే, రాత్రిపూటచేసే వివాహాలకు వారం పట్టించుకోనవసరం లేదని కొందరు స్మృతికారులు చెప్పారు. త్రిజ్యేష్టం, అనగా, జ్యేష్ట సంతానాలుగాని, జ్యేష్ఠ మాసంగానీ, జ్యేష్ఠా నక్షత్రంగానీ మూడు రకాల జ్యేష్ఠలు కలవకూడదని నియమంపెట్టారు.

వివాహ విషయంలో, జ్యోతిష్యం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. వధూవరుల వివాహ పొంతన పరీక్ష చేయడానికి, వర్ణం, వశ్యం, జన్మ/నామ నక్షత్రాలు, యోనులు, గ్రహాలు, గణాలు, రాసులు, నాడులు, కూటాలు అని ఎనిమిది అంశాలని పరిగణనలోకి తీసుకునే పద్ధతి వున్నది. వీటిలో ఆఖరి రెండు అంశాలకూ ప్రస్తుతం కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగిలినవి పెద్దగా పట్టించుకోవడంలేదు. మొత్తం 27 నక్షత్రాలు, దేవ, మానుష్య, రాక్షస అని మూడు తరగతులుగా/గణాలుగా విభజించారు. వధూవరులిద్దరూ ఒకే గణానికి చెందినవారైతే మంచిది. లేనిచో వారు కొన్ని నిబంధనల్ని పాటించాలి. వధూవరులు వారి జన్మ సమయాన్ని బట్టి వారు కొన్ని జంతుయోనులకు చెందినవారైవుంటారు. వారు జాతివైరం గల జంతువులకి చెందినవారు కాకుండా వుండాలి. ఉదాహరణకి, సింహం –జింక, పులి–మేక, పాము–ముంగిస, పిల్లి–ఎలుక, ఇలా వైరి వర్గానికి చెందకుండా వుండాలి.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు

చదవండి:
వివాహం కాని మానవులు పరిపూర్ణులు కారు.. 
కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి

మరిన్ని వార్తలు