అన్నప్రాశనం..

26 Dec, 2020 07:44 IST|Sakshi

శిశువుకు ప్రప్రథమంగా అన్నం తినిపించే సంస్కారమే అన్నప్రాశనం. తల్లి గర్భంలో వున్న శిశువు, ఆ గర్భమాలిన్యాన్ని తిన్న దోషం పోవడానికి ఈ సంస్కారం జరిపించాలని సూత్రకారులు చెప్పారు. దాదాపుగా అన్ని గృహ్యసూత్రాలూ ఈ అన్నప్రాశన గురించి పేర్కొన్నాయి. కొందరు సూత్రకారులు ఆరునెలల తర్వాత చేయాలని సూచించి వుంటే, మరికొందరు సంవత్సరం చివరన జరిపించాలని సూచించారు. కొందరు సూత్రకారులు పుత్రునికి ఆరు లేదా ఎనిమిదవ నెలలో, పుత్రికకు ఐదవ లేదా ఏడవనెలలో జరిపించాలని చెప్పారు.

ఏతావాతా, ఈ అన్నప్రాశన సంస్కారమనేది, శిశువుకు ఆరునెలల వయస్సు నుండి వీలును బట్టి సంవత్సరం లోపు జరిపించాలని శాస్త్రం. అప్పటివరకు తల్లిపాలను మాత్రమే ఆహారం గా తీసుకున్న శిశువుకు క్రమక్రమంగా ఇతర ఆహార పదార్థాలను పరిచయం చేయడం ఈ సంస్కారంతో మొదలౌతుంది. కనుక, ఈ సంస్కారాన్ని ఉత్తరాయనంలో, శుక్ల పక్ష శుభతిథులలో జరిపించాలని శాస్త్రకారులు చెప్పారు. శిశువుకు పెట్టే ఆహారపదార్థాలలో ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, బెల్లం ప్రముఖపాత్ర పోషిస్తాయి. 
 
సంస్కార విధానం :
శుభ ముహుర్తాన దంపతులు ఆయురారోగ్యాలకొరకు సంకల్పం చెప్పుకుని గణపతిపూజ, పుణ్యహవాచన జరిపించి, శిశువుతో సహా ముగ్గురూ మంత్రపూర్వకంగా కంకణాలు ధరించాలి. శిశువును, ఆ తండ్రి, తన కుడితొడపై కూర్చుండబెట్టుకోవాలి. సాంప్రదాయ స్వర్ణ శిల్పాచార్యులు నూతనంగా తయారు చేసిన బంగారు లేక వెండి పాత్రను, చెంచాను, దక్షిణఫల తాంబూలాదులను ఇచ్చి, వారి ఆశీర్వాదం తీసుకుని తెచ్చుకోవాలి. అందులో ఆవుపాలు, నెయ్యి, బెల్లంతో తయారైన పరమాన్నాన్ని వుంచి, శిశువు మేనమామ ముమ్మారు శిశువుకు నాకించాలి. ఆ తర్వాత శిశువు తల్లిదండ్రులు కూడా కొద్దిగా రుచి చూపించాలి. తదుపరి ఆచార్యులు, బంధువులు, ఆహూతుల ఆశీర్వాదాలు తీసుకుని, వారికి భోజన ఫల దక్షిణాదులను సమర్పించాలి. కొందరు సూత్రకారులు ఈ సంస్కారంలో చరు హోమం చేయాలని చెప్పారు. 

తర్వాత వివిధరకాలైన వస్తువులను అంటే పుస్తకాలు, ధనం, బంగారం, వెండి, ఇతర పనిముట్లు, ఆహార పదార్థాలు తదితరాలను దేవుడి దగ్గర విడివిడిగా వుంచి, ఆ శిశువును వాటి ఎదురుగా వుంచాలి. వాటిలో ఏ వస్తువును ఆ శిశువు ముట్టుకుంటే, ఆ పనిలో నిపుణత సాధిస్తారని అర్థం చేసుకోవాలని కొందరు సూత్రకారులు చెప్పారు.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు

మరిన్ని వార్తలు